ETV Bharat / science-and-technology

'రిజర్వేషన్‌ బాపతు ఇలాగే ఉంటారు'.. ప్రీతిని అవమానించిన సైఫ్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

author img

By

Published : Mar 2, 2023, 7:00 AM IST

Updated : Mar 2, 2023, 7:39 AM IST

Preethi Suicide case update : కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్ధి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఇవాళ విచారించనున్నారు. సైఫ్‌ను కస్టడీకి తీసుకునేందుకు వరంగల్ కోర్టు అనుమతించింది. ప్రీతిని సైఫ్‌ మానసికంగా వేధించినట్లుగా... విచారణ కమిటీ స్పష్టం చేసింది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లోనూ వేధింపుల నిజమేనని తేలింది. ప్రీతికి పరిజ్ఞానం లేదని...రిజర్వేషన్ కోటాలో వస్తే.. ఇంతే అన్నట్లుగా సైఫ్ బాధించాడని పోలీసులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Preethi Suicide case
Preethi Suicide case

Preethi Suicide case update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనలో అరెస్టైన సైఫ్‌ను.. పోలీస్‌ కస్టడీకి మెజిస్ట్రేట్ అనుమతించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వరంగల్ పోలీసులు.. సైఫ్‌ను విచారించనున్నారు. ఫిబ్రవరి 22న ప్రీతి.. ఆత్మహత్యకు పాల్పడగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ... 27 తేదీన కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఫిబ్రవరి 24న సైఫ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌పై ఖమ్మం జైలుకు తరలించారు.

police custody for Saif : ప్రీతిని సైఫ్ ర్యాంగింగ్ చేశాడని మానసికంగా వేధించినట్లు తేటతెల్లమైంది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో బుధవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. ప్రిన్సిపల్, ఏసీపీ, ఆర్డీఓ, 13 మంది పీజీ విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి హాజరయ్యారు. ప్రీతి విధుల్లో ఉన్న సమయంలో పనిచేసిన తోటి విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతి ర్యాగింగ్‌కు గురైందని కమిటీ నిర్ధారించింది. గతంలో రెండు మూడుసార్లు సైఫ్ ప్రీతిని వేధించాడని... ఇందులో లైంగికపరమైన అంశాలు లేవని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్ తెలిపారు.

police custody for Saif in Preethi suicide case : సైఫ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి కేసులో పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లోనూ కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. సైఫ్‌ ఫోన్‌లో పలు వాట్సాప్ చాట్స్‌‌ను పోలీసులు పరిశీలించారు 19 మంది సాక్షులను విచారించారు. ప్రీతి పడిపోయిన గదిలో ఇంజెక్షన్లతో సహా మొత్తం 24 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సైఫ్ 2021లో కళాశాలలో చేరగా ప్రీతి గత ఏడాది నవంబర్‌లో చేరింది. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో డిసెంబర్ నెలలో ప్రీతికి, సైఫ్‌కు మధ్య వివాదం జరిగినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. రోగికి అవసరమైన పైప్ పెట్టాల్సిందిగా సైఫ్ చెప్పగా.... తన దగ్గర లేదని ప్రీతి సమాధానం ఇచ్చింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడైంది.

ప్రీతికి ఎలాంటి పరిజ్ఞానం లేదని రిజర్వేషన్‌ కోటాలో వస్తే ఇలాగే ఉంటుందంటూ..తోటి విద్యార్ధుల ముందు సైఫ్‌ అవమానించాడని పోలీసులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం మరోసారి చేయకూడదని హెచ్చరించాడని వివరించారు. ప్రీతికి ఏ విధంగానూ సహకరించరాదని మరో విద్యార్థికి చెప్పాడని... ఐసీయూలో విధులు కేటాయించి విశ్రాంతి ఇవ్వద్దంటూ సూచించినట్లు రిపోర్ట్‌లో వెల్లడైంది.

నాతో ఏదైనా సమస్య ఉందా....? అని ప్రీతి ప్రశ్నించిందని డ్యూటీకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. హెచ్‌ఓడీతో మాట్లాడుకోవచ్చని చెప్పినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రీతి అలా మాట్లాడటం.. సైఫ్‌ను ఆగ్రహానికి గురి చేసిందని.... దీంతో మరింత వేధించి అవమానించాలని..నిర్ణయించుకున్నట్లుగా రిపోర్ట్‌లో వెల్లడించారు. గత నెల 21న సైఫ్‌ని పిలిపించిన హెచ్‌వోడీ... పద్ధతి మార్చుకోవాలని అతడిని మందలించారు. ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తెలిసి పారిపోవాలని సైఫ్‌ ప్రయత్నిస్తుండగా.... అరెస్ట్ చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.

ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో సంఘీభావం తెలుపుతున్నారు. ప్రీతి ఆత్మహత్యకు కారకులపై హత్యానేరం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేసి శిక్షించాలంటూ హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు ఆర్మీ అకాడమీ విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. గొప్ప చదువులు చదవాల్సిన ప్రీతి అర్దాంతరంగా తనువు చాలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Mar 2, 2023, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.