ETV Bharat / science-and-technology

జియో ల్యాప్​టాప్​ రిలీజ్.. ధర రూ.20వేలు లోపే!

author img

By

Published : Oct 5, 2022, 7:38 AM IST

టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ల్యాప్​టాప్​ను ఆవిష్కరించింది రిలయన్స్ గ్రూప్. జియో బుక్‌గా వ్యవహరించే దీనిని గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో రూ.19,500 ఆఫర్‌ ధరకు విక్రయిస్తున్నారు.

jio laptop features
జియో ల్యాప్​టాప్​ రిలీజ్.. ధర రూ.20వేలు లోపే!

Jio laptop price in India : రిలయన్స్‌ జియో తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. జియో బుక్‌గా వ్యవహరించే దీనిని గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో రూ.19,500 ఆఫర్‌ ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది జీఈఎం పోర్టల్‌లోనే అందుబాటులో ఉంది. అందువల్ల అందరూ దీనిని కొనే వీల్లేదు. కేవలం ప్రభుత్వ విభాగాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. దీపావళి నాటికి సాధారణ ప్రజానీకానికి కూడా దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ధర ఇంతే ఉంటుందా? లేదా? అనేది చూడాలి. కాగా.. ఇప్పటికే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌- 2022లోనూ జియో బుక్‌ను ప్రదర్శించారు.

జియో బుక్‌ ప్రత్యేకతలు ఇవీ..
Jio laptop features : జీఈఎం పోర్టల్‌లో ఉన్న వివరాల ప్రకారం..

  • 11.6 అంగుళాల హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్‌ యాంటీ-గ్లేర్‌ తెర. ఇది నాన్‌టచ్‌. రిజల్యూషన్‌ 1366X767 పిక్సెల్స్‌
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో కూడిన ఈ జియో బుక్‌.. జియోఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది.
  • 2 జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. ర్యామ్‌ను పెంచుకునే సదుపాయం లేదు.
  • యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, 3.0 పోర్ట్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్స్‌ ఇందులో లేవు. అయితే మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ ఉంది.
  • బ్లూటూత్‌, 4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీకి వీలుంది.
  • రెండు ఇంటర్నల్‌ స్పీకర్లు, మైకోఫోన్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ లేదు.
  • 55.1- 60ఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ.
  • 1.2 కిలోల బరువు. ఒక సంవత్సరం బ్రాండ్‌ వ్యారెంటీ

5జీ ఫైనల్ ట్రయల్స్ షురూ..
5జీ సేవలపై తుది ప్రయోగాత్మక ప్రక్రియ (బీటా ట్రయల్‌)ను నాలుగు నగరాలు- దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసిలో బుధవారం (అక్టోబరు 5) ప్రారంభించనున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ఎంపిక చేసిన వినియోగదారులపై దీనిని చేపట్టనుంది. తమ 5జీ సేవలను ప్రయత్నించాల్సిందిగా.. 'జియో ట్రూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌' కింద వినియోగదారులను కంపెనీ ఆహ్వానించనుంది. ఎంపికైన వినియోగదారులు సెకనుకు 1 గిగాబిట్‌ వేగంతో కూడిన అపరిమిత 5జీ డేటాను పొందుతారు. 'ట్రూ-5జీ సేవలను ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022లో విజయవంతంగా ప్రదర్శించిన అనంతరం.. దసరా రోజున 4 నగరాల్లో బీటా ట్రయల్‌ ప్రక్రియను ప్రారంభించనున్నామ'ని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతమున్న జియో సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా జియో ట్రూ 5జీకి ఎంపికైన వినియోగదార్లు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతారని పేర్కొంది. ప్రస్తుతం వాడుతున్న 4జీ ప్లాన్‌ రుసుమును చెల్లిస్తే సరిపోతుందని, 5జీ ప్రయోగ సందర్భంగా ఎటువంటి అదనపు ఛార్జీలు కట్టనక్కర్లేదని పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో మార్పులు తీసుకొచ్చే సొల్యూషన్లను, ప్లాట్‌ఫామ్‌లను 5జీ సృష్టిస్తుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. మున్ముందు ఇతర నగరాల్లోనూ 5జీ సేవల బీటా ట్రయల్స్‌ నిర్వహిస్తామని జియో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.