ETV Bharat / science-and-technology

Iphone Charging Mistakes : ఐఫోన్ ఛార్జింగ్​ టిప్స్​.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 3:28 PM IST

IPhone Charging Mistakes In Telugu : మనం నిద్రలేచింది మొదలు, రాత్రి పడుకొనే వరకు ఫోన్ లేకపోతే రోజే గడవదు. అది మన జీవితంలో అంతలా భాగమైపోయింది. యాపిల్ ఫోన్​ను ఈ మధ్య ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు పొరపాట్లు చేస్తున్నారు. దీని వల్ల ఫోన్ వేగంగా పాడైపోతుంది. దానికి తోడు కొన్ని సార్లు షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఐఫోన్ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాపిల్ సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

iPhone Charging Tips
iPhone Charging Mistakes

IPhone Charging Mistakes : మనలో చాలా మందికి రాత్రి ఫోన్ ఛార్జింగ్​ పెట్టి నిద్రపోవడం అలవాటు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది ప్రముఖ సంస్థ యాపిల్. ఐఫోన్ వినియోగదారులకు ఆ సంస్థ కీలక సూచనలు చేసింది. ఛార్జింగ్ విషయంలో పొరపాట్లు చేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించింది. అసలు ఐఫోన్​ వినియోగదారులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ప్రమాదాలు జరగకుండా ఏవిధంగా నివారించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపోయేటప్పుడు ఛార్జింగ్ పెట్టొద్దు!
IPhone Charging Safety Tips : చాలా మందికి ఫోన్ ఛార్జింగ్​లో పెట్టి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే దీని వల్ల ఐఫోన్​కే కాదు మనుకూ ప్రమాదమే. కొన్ని సార్లు ఐఫోన్ కిందపడి చెడిపోయే అవకాశం ఉంటుంది. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గవచ్చు. మీరు పడుకొనే సమయంలో ఐఫోన్ ఛార్జింగ్​ పెట్టి అలానే విడిచిపెట్టవద్దు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్​ జరిగి, ఫోన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నిద్రపోయే సమయంలో ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది.

దిండు కింద ఫోన్ పెట్టవద్దు!
IPhone Night Time Charging Risk : ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్​ను తలకు దగ్గరగా ఉంచవద్దు. అలానే ఛార్జింగ్ పెట్టి దిండు కింద పెట్టవద్దు. అలా చేయడం వల్ల మొబైల్ వేడెక్కే అవకాశం ఉంది. ఫలితంగా ఐఫోన్ త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. తలకింద ఫోన్ పెట్టడం, దానిపై నిద్రించడం లాంటి పనులు చేయకూడదు. ప్లగ్​కు ఛార్జర్​ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు వాటిపై నిద్రించడం, తాకడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని సార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇవి పాటిస్తే మేలు
IPhone Charging Tips : ఐఫోన్​ ఎక్కువ కాలం వాడాలంటే.. ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి? ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన విషయాలను యాపిల్ తన వెబ్​సైట్​లో స్పష్టంగా పేర్కొంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • ఐఫోన్ వినియోగదారులు ఒరిజినల్ ఛార్జర్, కేబుల్​ను మాత్రమే వాడాలి.
  • ఒకవేళ యూఎస్​బీ కేబుల్​ మార్చాల్సి వస్తే.. యాపిల్ కంపెనీ లోగో, ఐఎస్​ఐ గుర్తు ఉన్న ఒరిజినల్​ ప్రొడక్టును మాత్రమే తీసుకోవాలి.
  • ఐఫోన్​ను ఛార్జ్ చేయడానికి ఎప్పుడూ యాపిల్ యూఎస్​బీని మాత్రమే వాడాలి.
  • మెగ్ సేఫ్ ఛార్జర్​ను కూడా ఉపయోగించవచ్చు. క్యూఐ సర్టిఫైడ్ ఛార్జర్​ను కూడా ఐఫోన్​కు కనెక్ట్ చేయవచ్చు. వీటిని ప్రత్యేకంగా అమ్ముతుంటారు.
  • ఐఫోన్​ను కేబుల్ సాయంతో కంప్యూటర్​కు కనెక్ట్ చేయవచ్చు.
  • ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్​ను పైకి ఉంచాలి.
  • ఛార్జర్, కేబుల్​లు ఎక్కడా కట్ కాకుండా చూసుకోవాలి.
  • సెల్​ఫోన్​కు, ఛార్జర్​కు మధ్యలో లోహపు తీగలు, వస్తువులు లేకుండా చూడాలి.
  • ముఖ్యంగా ఛార్జర్​లో తేమ లేకుండా చూడాలి.

ఈ జాగ్రత్తలు అన్నీ పాటించడం ద్వారా చాలా వరకు ఐఫోన్​ ప్రమాదాలను నివారించవచ్చని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.