ETV Bharat / science-and-technology

గూగుల్​లో పాస్​వర్డ్ రూల్స్​ ఛేంజ్​! ఇకపై 'పాస్​కీ'తోనే లాగిన్.. సెట్ చేసుకోవడం ఇలా..

author img

By

Published : May 4, 2023, 4:48 PM IST

google-passkey-support
google-passkey-support

Google passkey login : డిజిటల్ ప్రపంచంలో ఏ ఖాతా తెరవాలన్నా పాస్​వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. పాస్​వర్డ్ ఎంటర్ చేస్తేనే ఖాతాల్లోకి లాగిన్ అవ్వడం సాధ్యమవుతుంది. అయితే ఇదంతా గతం! పాస్​వర్డ్ టైప్ చేసే రోజులు కనుమరుగు కానున్నాయి. ఒక్కో ఖాతాకు ఒక్కో పాస్​వర్డ్ పెట్టి గుర్తుంచుకునే పని లేకుండా చేస్తున్నాయి టెక్ సంస్థలు. అదెలాగంటే?

Google passkey login : పాస్​వర్డ్​లు లేని డిజిటల్ ప్రపంచాన్ని ఊహించుకోగలమా? ఏ ఖాతా ఓపెన్ చేయాలన్నా పాస్​వర్డ్ ఎంటర్ చేయాల్సిందే! కానీ ఇప్పుడు ఆ అవసరం లేదంటోంది గూగుల్. ఆన్​లైన్​లో ఖాతాల లాగిన్ కోసం ఆ సంస్థ.. పాస్​కీ పద్ధతిని ప్రవేశపెట్టింది. పాస్​వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఖాతాల్లోకి లాగిన్ అయ్యే విధంగా పాస్​కీ వ్యవస్థను రూపొందించింది. గురువారమే ఈ పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. పాస్​వర్డ్​లకు బదులు ఫింగర్​ప్రింట్, ఫేస్ ఐడీ, పిన్ నంబర్​ సాయంతో ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చని చెబుతోంది.

Google passkey support : పాస్​కీ పద్ధతికి మారుతున్నట్లు గూగుల్​తో పాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు 2022లోనే ప్రకటించాయి. అక్షరాలు, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్ల కలయికతో ఉండే పాస్​వర్డ్​లకు స్వస్తి చెప్పేలా పాస్​కీ వ్యవస్థకు ఆజ్యం పోస్తున్నట్లు తెలిపాయి. తాజాగా, గూగుల్ ఓ అడుగు ముందుకేసి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేజర్ ప్లాట్​ఫామ్స్​లో ఇది అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

ఏంటీ పాస్​కీ?
సింపుల్​గా చెప్పాలంటే.. మొబైల్​ అన్​లాక్ చేసేందుకు మనం బయోమెట్రిక్ ఉపయోగిస్తుంటాం కదా. ఫేస్ ఐడీ, ఫింగర్​ప్రింట్ లేదంటే పిన్ నంబర్​తో మొబైల్ అన్​లాక్ చేస్తుంటాం. ఇకపై ఇదే బయోమెట్రిక్​తో ఖాతాల్లోకి లాగిన్ అవ్వొచ్చు. ఖాతాదారుడిని తన అకౌంట్​లోకి లాగిన్ అయ్యేందుకు అనుమతించే కీనే పాస్​కీ అంటారు. తొలిసారి పాస్​కీ టెక్నాలజీని ఉపయోగించినప్పుడు రెండు 'కీ'లు జనరేట్ అవుతాయి. ఇందులో ఒక కీ.. యూజర్ డివైజ్​లో స్టోర్ అవుతుంది. ఇంకో కీ.. ఖాతా సర్వీసు అందించే కంపెనీ సర్వర్లలో ఉంటుంది. సంబంధిత ఖాతాలోకి యూజర్ లాగిన్ అవ్వాలంటే.. తన డివైజ్​ను బయోమెట్రిక్ ద్వారా అన్​లాక్ చేయాలి. ఫోన్​లో ఉన్న కీ.. సర్వర్​లో ఉన్న కీతో మ్యాచ్ అయితే లాగిన్ విజయవంతమవుతుంది.

పాస్​వర్డ్​లకు పాస్​కీలకు తేడా ఏంటి?
ఫిడో (FIDO ఫాస్ట్ ఐడెంటికేషన్ ఆన్​లైన్) ఆథెంటికేషన్​లో భాగంగా పాస్​కీలు.. పాస్​వర్డ్​ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. పాస్​కీల వల్ల ఖాతాల లాగిన్​ ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. ఏ అకౌంట్​ కోసమైనా.. పాస్​వర్డ్​లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిసారి పాస్​వర్డ్​ను మ్యాన్యువల్​గా టైప్ చేయాల్సిన అవసరమే రాదు. ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ ద్వారా అన్​లాక్ చేస్తే సరిపోతుంది. పాస్​వర్డ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఇది తొలగిస్తుంది.

హై సెక్యూరిటీ కూడా..
పాస్​వర్డ్​లతో పోలిస్తే పాస్​కీల సీక్వెన్స్ సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ కూడా ఎక్కువ. డివైజ్​లోని కీ.. సీక్రెట్​గా స్టోర్ అవుతుంది. సర్వర్​లో ఉండే కీ.. సంక్లిష్టమైన సీక్వెన్స్​తో స్టోర్ అవుతుంది. కేవలం డివైజ్​లో ఉన్న ప్రైవేట్ కీ మాత్రమే.. సర్వర్​లోని కీని ఓపెన్ చేయగలుగుతుంది. ఫిషింగ్ వంటి హ్యాకింగ్ ప్రయత్నాలను పాస్​కీ వ్యవస్థ నిరోధిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఏ హ్యాకింగ్ సాఫ్ట్​వేర్ కూడా బ్రేక్ చేయలేనంత పటిష్ఠంగా ఈ టెక్నిక్​ను రూపొందించారు.

గూగుల్ అకౌంట్​లో పాస్​కీ సెట్ చేస్కోండిలా..
Google passkey setup : గూగుల్ ఖాతాను ఇకపై పాస్​కీతో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ సెట్టింగ్స్​ను మార్చుకుంటే సరిపోతుంది.

  • ముందుగా myaccount.google.com లోకి వెళ్లండి.
  • అందులోని సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ చేయండి.
  • 'How you sign in to Google' అనే సెక్షన్​లో 'పాస్​కీస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆటోమెటిక్​గా క్రియేట్ అయిన పాస్​కీస్ కనిపిస్తాయి
  • కిందికి స్క్రోల్ చేస్తే.. క్రియేట్ పాస్​కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. బయోమెట్రిక్​తో ఆథెంటికేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది.

ఇకపై పాస్​కీ ద్వారా బయోమెట్రిక్ ఆథెంటికేషన్​తో గూగుల్ అకౌంట్​లోకి లాగిన్ అవ్వొచ్చు. పాస్​కీ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. సాధారణ పాస్​వర్డ్​తోనూ లాగిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకటికి మించి డివైజ్​లు ఉపయోగించేవారు.. ప్రతిసారి ఫోన్​ ద్వారానే ఆథెంటికేషన్ పూర్తి చేయాల్సిన పని ఉండదు. ప్రతి డివైజ్​కు ప్రత్యేక పాస్​కీ పెట్టుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.