ETV Bharat / science-and-technology

Deep Fake Video Call Scam : అర్జెంట్​గా డబ్బులు కావాలని ఫ్రెండ్​ కాల్​ చేశాడా?.. అది డీప్​ ఫేక్ స్కామ్ కావచ్చు! జాగ్రత్త!

author img

By

Published : Aug 19, 2023, 2:09 PM IST

Deep fake scams
AI Based Deep Fake Fraud

Deep Fake Video Call Scam : సైబర్​ నేరగాళ్లు మరో సరికొత్త మోసానికి తెరతీశారు. డీప్​-ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి, వీడియో కాల్స్ చేసి.. బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి భారీగా డబ్బులు తీసుకొని, మోసానికి పాల్పడ్డారు. మరి ఇలాంటి సైబర్​ స్కామ్స్​ బారిన పడకుండా, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో, ఇప్పుడు తెలుసుకుందామా?

Deep Fake Video Call Scam : రమ్య ఆఫీస్​లో చాలా బిజీగా పని చేస్తోంది. ఇంతలో ఫోన్ రింగ్​ అయ్యింది. చూస్తే అన్​-నోన్​ నంబర్​. ఎవరు అయ్యుంటారు? అనుకుంటూనే ఫోన్​ లిఫ్ట్ చేసింది. ఫోన్​లో తన బెస్ట్​ ఫ్రెండ్​ రోజా ఏడుస్తూ మాట్లాడుతోంది.

  • రమ్య : ఏమైంది రోజా? ఎందుకు ఏడుస్తున్నావ్​?
  • రోజా : రమ్య! మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్​లో ఉన్నారు. అర్జెంటుగా డబ్బులు కావాలి. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నువ్వే హెల్ప్ చేయాలి. ప్లీజ్​ రమ్యా! ఒక రూ.50,000 ఉండే అడ్జెస్ట్ చేయు.. నేను తరువాత ఇచ్చేస్తాను.
  • రమ్య : మరేం ఫర్వాలేదు రోజా! మరేమీ భయపడకు. ఇదిగో ఇప్పుడే రూ.50,000 పంపిస్తున్నా.
  • రోజా : థాంక్యూ రమ్య! ఆపద కాలంలో ఆదుకుంటున్నావ్​! నీ మేలు ఎప్పటికీ మర్చిపోను.

( రమ్య రూ.50,000 పంపించింది. అంతే ఫోన్​ కట్​...)

సుబ్బారావు ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఇంతలో తన ఫ్రెండ్​ అప్పారావు వాట్సాప్​ వీడియో కాల్ చేశాడు. సుబ్బారావు ఫోన్ లిఫ్ట్​ చేశాడు.

సుబ్బారావు : ఏంట్రా అప్పారావు.. ఇప్పుడు ఫోన్​ చేశావ్​?

అప్పారావు : సుబ్బారావు.. అర్జెంట్​గా ఓ రూ.30,000 కావాలి రా!

సుబ్బారావు : ఇప్పుడేంట్రా అంత అర్జెంట్​!

అప్పారావు : మా అబ్బాయి ఎగ్జామ్ ఫీజ్​ కట్టాలి. లాస్ట్ డేట్ వచ్చేసింది. నా చేతిలో ప్రస్తుతం డబ్బు లేదు. ఓ పది రోజుల్లో ఇచ్చేస్తారా?

సుబ్బారావు : అంతేనా! ఇదిగో ఇప్పుడే పంపిస్తా ఉండు.

( సుబ్బారావు రూ.30,000 పంపించాడు. ఓ అరగంట తరువాత మళ్లీ అప్పారావు ఫోన్ చేశాడు. )

సుబ్బారావు : ఏంట్రా మళ్లీ ఫోన్​ చేశావ్​?

అప్పారావు : అరే.. నాకు మళ్లీ ఓ రూ.20,000 కావాలి రా.

సుబ్బారావుకు ఈ సారి అనుమానం వచ్చింది. ఎందుకంటే.. ఫోన్​లోని వాయిస్​కు తన ఫ్రెండ్ అప్పారావు వాయిస్​కు చాలా తేడా కనిపిస్తోంది. అందుకే తన ఫోన్ కాంటాక్ట్​ లిస్ట్​లోని అప్పారావు నంబర్​కు ఫోన్​ చేశాడు.

అప్పారావు : అరే.. సుబ్బి ఏంటిరా.. ఫోన్​ చేశావ్​! బాగున్నావా?

సుబ్బారావు : ఇప్పుడే కదరా మాట్లాడాం. మళ్లీ బాగున్నావా? అని అడుగుతున్నావ్​!

అప్పారావు : నేను ఎప్పుడు ఫోన్​ చేశానురా..

( సుబ్బారావు షాక్​ అయ్యాడు. తన వాట్సాప్​ వీడియో కాల్​ నంబర్​ను చెక్​ చేశాడు. షాక్ తిన్నాడు.. ఎందుకంటే అది డీప్​ ఫేక్​ ​)

మీకు కూడా ఇలానే మీ స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఫోన్​ కాల్స్ వస్తున్నాయా? అర్జెంటుగా డబ్బులు కావాలని అడుగుతున్నారా? అయితే అది డీప్​ ఫేక్ స్కామ్ అయ్యే అవకాశం ఉంది. జరజాగ్రత్త! ( Deep Fake Scams )

గుడ్​ అండ్ బ్యాడ్​
Deep Fake Technology Disadvantages : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తరువాత మన దైనందిన పనులు అన్నీ చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. కానీ అదే సమయంలో కొంత మంది సైబర్​ నేరగాళ్లు దీన్ని ఆయుధంగా చేసుకొని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తూ.. వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారు. అందుకే ఇలాంటి సైబర్​ మోసాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డీప్​ఫేక్ టెక్నాలజీ
What is Deep Fake Technology : సాంకేతిక నిపుణులు.. కృత్రిమ మేధ సహాయంతో డీప్​ఫేక్​ టెక్నాలజీని రూపొందించారు. దీని ద్వారా వీడియోలు, ఆడియోలు, ఫొటోలను కృత్రిమంగా తయారు చేస్తారు. ఇవి చూడడానికి చాలా వాస్తవికంగా ఉంటాయి. వాస్తవానికి ఈ డీప్​ ఫేక్​ టెక్నాలజీ ద్వారా మంచి చేయాలన్నది సాంకేతిక నిపుణుల ఉద్దేశం. కానీ దీని వల్ల మంచి కంటే.. చెడే ఎక్కువ జరుగుతోంది.

డీప్​ ఫేక్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు
Deep Fake Technology Benefits :

  • డీప్​ ఫేక్​ సాంకేతికతతో చాలా చౌకగా మంచి వీడియో కంటెంట్​ రూపొందించవచ్చు. అలాగే చాలా చౌకగా ఆన్​లైన్​ ప్రచారం కూడా చేయవచ్చు.
  • డీప్​ ఫేక్​ టెక్నాలజీ ద్వారా ఓమ్నీ ఛానల్​ ఎడ్వర్టైజ్​మెంట్​ చేయవచ్చు.
  • యూజర్లకు, కస్టమర్లకు పర్సనలైజ్డ్​ ఎక్స్​పీరియన్స్​ను అందించవచ్చు.

సినిమా తారలు, సెలబ్రిటీలే మొదటి టార్గెట్​
Deep Fake Celebrity Video Generator : సినిమాలకు, సినిమా తారలకు, సెలబ్రిటీలకు ప్రజల్లో మంచి క్రేజ్​, పాపులారిటీ ఉంటాయి. ఎంతో మంది వాళ్లను అభిమానంతో, ఆరాధిస్తూ ఉంటారు. అందుకే సైబర్​ నేరగాళ్లు వీళ్లను టార్గెట్​ చేసుకుంటున్నారు. డీప్​ఫేక్​ టెక్నాలజీ ఉపయోగించి మహిళా నటీమణుల, సెలబ్రిటీల అశ్లీల చిత్రాలు, వీడియోలు రూపొందించి, పోర్నోగ్రఫీ వెబ్​సైట్​ల్లో పెడుతున్నారు. అలాగే వీటి ఉచ్చులో చిక్కుకున్న యువతీయువకులను తప్పుదోవ పట్టించి, డబ్బులు కాజేస్తున్నారు.

హనీ ట్రాప్​
Honey Trapping : డీప్​ ఫేక్​ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే, మర-మనుషులు కూడా నిజమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కొన్నాళ్ల క్రితం వరకు నిజమైన అమ్మాయిలు లేదా అబ్బాయిలు.. స్పామ్​ కాల్స్​ చేసి, అమాయకులైన యువతీయువకులను హనీ-ట్రాప్​లోకి దింపేవారు. కానీ నేడు ఆ అవసరం లేకుండా పోయింది. డీప్​-ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి, ఆర్టిఫీషియల్​ మనుషుల్ని సృష్టిస్తున్నారు. వాటితో నేరుగా న్యూడ్​ కాల్స్ చేసి, యువతను రెచ్చగొడుతున్నారు. తరువాత వాళ్లను బ్లాక్​మెయిల్​ చేసి, డబ్బులు కాజేస్తున్నారు. అలాగే మానసిక వేదనకు గురిచేస్తున్నారు. ఒకసారి ఈ హనీ-ట్రాప్​ ఉచ్చులో పడ్డవారిని.. జీవితాంతం వేధిస్తూనే ఉంటారు. కనుక యువతీ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

స్నేహితులు, బంధువులు లాగా!
Deep Fake Money Scam In India : నేటి యువత సోషల్​ మీడియా మానియాలో బ్రతికేస్తోంది. మఖ్యంగా యువతీయువకులు.. తమ వ్యక్తిగత వివరాలను, ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో అప్లోడ్​ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సైబర్​ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా ఫ్రీగా దొరుకుతున్న ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని.. డీప్​ఫేక్ వ్యక్తులను రూపొందిస్తున్నారు. అంటే మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని పోలిన.. కృత్రిమ వ్యక్తులను సృష్టిస్తున్నారు. అలాగే వాళ్ల స్వరాన్ని (Voice)ను కూడా అచ్చంగా డీప్​ ఫేక్​ చేస్తున్నారు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వీటిని రూపొందించి, మోసాలకు పాల్పడుతున్నారు.

వాయిస్​, వీడియో కాల్స్!
Deep Fake Video Call Scam : ఒకప్పుడు కేవలం స్పామ్​ కాల్స్​కే పరిమితమైన సైబర్​ క్రిమినల్స్.. ఇప్పుడు నేరుగా వీడియో కాల్స్​ చేసే పరిస్థితికు వచ్చారు. డీప్​-ఫేక్ టెక్నాలజీ సాయంతో మీకు తెలిసిన వ్యక్తుల మాదిరిగా ఫోన్​ చేస్తారు. అత్యవసరంగా డబ్బులు కావాలని, లేదా ఆరోగ్యం బాగాలేదు సాయం చేయమని.. ఇలా రకరకాలుగా మీ మనస్సులను కరిగిస్తారు. పొరపాటున వీరి ట్రాప్​లో పడ్డామా? ఇక అంతే సంగతులు. మన బ్యాంకు ఖాతాలోని మొత్తం డబ్బులు కాజేస్తారు.

రూ.40,000 దోచుకున్నారు!
Deep Fake Scam In Kerala : ఇటీవల కేరళలోని ఒక వ్యక్తిని ఇలా డీప్​ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి మోసం చేశారు. సైబర్​ నేరగాళ్లు ఏమి చేశారంటే.. సదరు కేరళ వ్యక్తికి తెలిసిన ఒక వ్యక్తి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. అచ్చంగా ఆ వ్యక్తిని తలపించే డీప్​ ఫేక్​ ఇమేజ్​ను, వాయిస్​ను సృష్టించారు. దీని సాయంతో.. సదరు కేరళ వ్యక్తికి వాట్సాప్​లో వీడియో కాల్​​ చేశారు. వైద్య ఖర్చులు కోసం అత్యవసరంగా డబ్బులు కావాలని, దయుంచి సాయం చేయమని ప్రాధేయపడుతూ అడిగించారు. అంతే తనకు తెలిసిన స్నేహితునికి సాయం చేయాలనే ఉద్దేశంతో.. సదరు కేరళ వ్యక్తి రూ.40,000 పంపించారు. అది జరిగిన కొద్ది సేపటికి, మరలా ఫోన్ చేసి మరో రూ.30,000 అర్జెంట్​గా కావాలని ఆడిగారు. కానీ ఈ సారి అతనికి అనుమానం వచ్చింది. వెంటనే తన నిజమైన స్నేహితునికి కాల్​ చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆ స్నేహితుడు.. తాను ఎలాంటి ఫోన్​ కాల్​ చేయలేదని, అలాంటి అవసరమే తనకు లేదని స్పష్టం చేశాడు. దీనితో తను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Deep Fake Scam In India In Telugu : ఇలానే మరో వ్యక్తి కూడా సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కి రూ.30,000 వరకు పోగొట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనుక మీకు కూడా ఇలాంటి మెసేజ్​లు, వాయిస్​ కాల్స్​, వీడియో కాల్స్ వస్తే.. వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం అనుమానం వచ్చినా, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

డీప్​-ఫేక్​ కాల్స్​ నుంచి రక్షణ ఎలా?
How To Protect From Deep Fake Scam : వాస్తవానికి డీప్​-ఫేక్​ టెక్నాలజీని ఛేదించడం అంత సులభం ఏమీ కాదు. కానీ కొన్ని ట్రిక్స్ ఉపయోగించి.. వాటిని కొంత మేరకు గుర్తంచే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలియని వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు.. స్నేహితులం, బంధువులం అని పరిచయం చేసుకుంటే.. వెంటనే వాళ్ల వ్యక్తిగత వివరాలు అడగండి. వాళ్లు కచ్చితమైన సమాధానం చెప్పకపోతే.. అనుమానించండి. వెంటనే మీ నిజమైన బంధువులు, స్నేహితులకు ఫోన్​ చేసి కన్ఫార్మ్​ చేసుకోండి.
  • ఎవరైనా మీకు మెసేజ్​, వాయిస్​ కాల్​, వీడియో కాల్​ చేసి.. మీ వ్యక్తిగత వివరాలు అడిగితే.. అస్సలు చెప్పకండి. అలాగే అత్యవసరంగా డబ్బులు కావాలని ప్రాధేయపడినా.. గాబరా పడకండి. కచ్చితమైన సమాచారం ఉంటేనే.. వ్యక్తిగతంగా వెళ్లి డబ్బులు సాయంచేసే ప్రయత్నం చేయండి. అలాగే అధికారులమని చెబుతూ.. మీ సోషల్ సెక్యూరిటీ నంబర్లు, క్రెడిట్​, డెబిట్​ కార్డు నంబర్లు అడిగినా ఇవ్వవద్దు. కచ్చితంగా ఆన్​లైన్​లో డబ్బులు పంపవద్దు.
  • ఒక వేళ మీకు వచ్చిన కాల్​.. డీప్​ ఫేక్​ కాల్​ అని అనుమానం వస్తే.. వెంటనే దానిని కట్​ చేయాలి. ఒక వేళ అదే నంబర్​ నుంచి పదేపదే కాల్స్ వచ్చినా.. వాటిని లిఫ్ట్​ చేయకూడదు. ఫ్రాడ్​ కాల్స్ అని అనుమానం వస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

డీప్​ ఫేక్​ కాల్స్​ను గుర్తించడం ఎలా?
How To Identify Deep Fake Videos And Calls : వాస్తవానికి సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉన్న నేటి కాలంలో అసలు, నకిలీలను గుర్తించడం చాలా కష్టం. అయినప్పటికీ జాగ్రత్తగా పరిశీలిస్తే.. డీప్​ ఫేక్​ వీడియా, ఆడియో కాల్స్​ను మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది.

1. ఒరిజినల్ వ్యక్తి స్వరానికి.. డీప్ ఫేక్​ వాయిస్​కు కొంచెం తేడా ఉంటుంది.

2. వాస్తవానికి డీప్​ ఫేక్​ ఇమేజ్​లో​ లేదా వీడియోలో.. ఎవరో ఒక వ్యక్తికి మరో వ్యక్తి తలను లేదా ఇతర శరీర భాగాలను అతికించినట్లుగా కనిపిస్తుంది. దీని ద్వారా కూడా మీరు కచ్చితంగా అది ఫ్రాడ్​ కాల్​గా గుర్తించవచ్చు.

3. డీప్​ ఫేక్​ వీడియోలోని ఆర్టిఫీషియల్​ ఇమేజ్ లేదా వీడియో బిహేవియర్​ చాలా తేడాగా ఉంటుంది. వాయిస్​ కూడా కన్సిస్టెంట్​గా ఉండదు.

4. మీ వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు.. అవతలి వ్యక్తి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే.. అది డీప్​ ఫేక్​ కాల్​గా గుర్తించవచ్చు.

5. సాధారణంగా మీ స్నేహితులు, లేదా బంధువులు ఎప్పుడూ చేయని రిక్వెస్ట్​లు చేసినప్పుడు.. ఉదాహరణకు.. అత్యవసరంగా డబ్బులు కావాలని, లేదా క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్ నంబర్లు కావాలని అడిగితే.. వెంటనే అది డీప్​ ఫేక్​ కాల్ అని గుర్తించవచ్చు.

సైబర్​ నేరాలపై ఎలా ఫిర్యాదు చేయాలి?
How to report Cyber Fraud

  • సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడిన వెంటనే.. వీలైనంత త్వరగా దగ్గరల్లోని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలి.
  • సైబర్ క్రైమ్​ బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్​ రిపోర్టింగ్​ పోర్టల్​లో ఫిర్యాదు చేయవచ్చు. దీని హెల్ప్​లైన్ నంబర్​ - 1930.
  • సైబర్​ ఫ్రాడ్​ గురించి cybercrime.gov.in వెబ్​సైట్​ ద్వారా కూడా కంప్లైట్​ ఇవ్వవచ్చు.

సైబర్​ ఫ్రాడ్స్​పై ఫిర్యాదు చేయడానికి అవసరమైన పత్రాలు
Documents Needed To File Report For Cyber Fraud : ఆన్​లైన్​ లావాదేవీలు, లాటరీ స్కామ్స్​, ఏటీఎం ట్రాన్సాక్షన్స్​, ఫేక్​ కాల్స్​, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర మోసాలకు గురైనప్పుడు కచ్చితంగా.. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్​ను పోలీసులకు అందించాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంకు స్టేట్​మెంట్స్​, చిరునామా, మీ గుర్తింపు కార్డు (ఐడీ) కూడా ఇవ్వాలి. అలాగే మీకు వచ్చిన అనుమానిత మెసేజ్​లు, ఈ-మెయిల్స్​, కాల్స్ వివరాలను కూడా చూపించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.