ETV Bharat / priya

ఛాయ్​తో వచ్చే పైత్యం- అల్లంతో ఖతం

author img

By

Published : Jul 19, 2021, 9:40 AM IST

ఉదయాన్నే ఓ కప్పు అల్లం చాయ్‌ గొంతులోకి జారుతూ ఉంటే.. ఆహా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అల్లం మురబ్బా తింటే జలుబూ..గిలుబూ బలాదూర్‌. ఆహారం రుచిని పెంచే అల్లం పోషకాల్లోనూ నంబర్‌వన్‌..

ginger benefits
అల్లం టీ

అల్లాన్ని శ్రింగిభేరం అనీ, ఆర్ద్రకం అనీ పిలుస్తారు. వాడుకభాషలో అద్రక్‌ అంటారు. అల్లంలోని ఘాటైన సుగంధ తైలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆహారం వల్ల జీర్ణ వ్యవస్థకు వచ్చే ఇబ్బందులని తగ్గిస్తాయి. అల్లానికి రక్తంలో కొవ్వును తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.

చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు అల్లం లేదా శొంఠిరసాన్ని ఇస్తే జలుబు తగ్గుతుంది. జలుబు రావడానికి కారణమైన రైనోవైరస్‌ను అదుపుచేసే శక్తి, అల్లానికి ఉండటమే ఇందుకు కారణం.

పోషకాలు: 100 గ్రాముల అల్లంలో 11గ్రా పిండి పదార్థాలు, 2.5గ్రా కొవ్వు పదార్థాలు ఉంటాయి. క్యాల్షియం 21 గ్రా. ఉంటుంది. ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

టీని ఎక్కువగా తాగేవాళ్లు.. రెండు నుంచి ఐదు గ్రాముల పచ్చి అల్లాన్ని దంచి టీలో కలిపి ఉడికించుకుని తాగితే టీవల్ల వచ్చే పైత్యం తగ్గుతుంది. అల్లంరసంలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

తరచూ దురదలు, దద్దుర్లు వంటి అలెర్జీ సమస్యలతో బాధపడేవారు.. అల్లం రసం రెండు చెంచాలు తీసుకుని అందులో రెండు చిటికెల పసుపు, తగినంత పటిక బెల్లం వేసుకుని తాగాలి. ఇలా పదిహేను రోజులు తాగితే అలెర్జీ సమస్య తగ్గుముఖం పడుతుంది.

సున్నంలో ఊరబెట్టి ఎండలో పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీనిలో పోషకగుణాల కన్నా ఔషధగుణాలే అధికం. అరచెంచా శొంఠిపొడిని చెంచా నెయ్యితో కలిపి రోజూ మొదటి ముద్దతో కలిపి తింటే గ్యాస్‌, అజీర్ణం, అరుచి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

జాగ్రత్తలు: అల్లం, వెల్లుల్లిని కలిపి ఎక్కువగా తినకూడదు. కడుపులో మంట ఉన్నవారు శొంఠిని ఎక్కువ తీసుకోకూడదు.

- డాక్టర్‌ పెద్దిరమాదేవి, ఆయుర్వేద నిపుణులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.