ETV Bharat / opinion

విచ్చలవిడిగా మార్కెట్లో నకిలీలు- అవగాహనతోనే అడ్డుకట్ట

author img

By

Published : Mar 15, 2021, 8:08 AM IST

నేటి రోజుల్లో కల్తీ లేని వస్తువు ఏదైనా ఉందా అంటే చెప్పడం కష్టం. పాలను సైతం విషమయం చేస్తున్నారంటే.. కల్తీకి కాదేదీ అనర్హం అన్నంతగా తయారైంది నేటి పరిస్థితి. పెరిగిన ఆదాయంతో కొనుగోళ్లూ ఉపందుకున్న తరుణంలో మోసాలు విపరీతంగా పెరిగాయి. కల్తీ సహా.. వివిధ రూపాల్లో కొనుగోలుదారులను మోసగిస్తున్న తీరును అడ్డుకోవాలంటే వినియోగదారుల హక్కులపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిందే.

World Consumer Rights Day 2021: Know history, significance, consumer rights in India
అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానంలో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. దేశ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు కాబట్టి ఎక్కువభాగం వ్యయం కూడా అక్కడే జరుగుతోందని నిపుణులు అంటున్నారు. గ్రామీణ ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉండటంతో జీవనశైలిలోనూ మార్పులు చోటుచేసుకొంటున్నాయి. గ్రామీణ వినియోగదారుల ప్రాథమ్యాలు వేగంగా మారిపోతున్నాయి. వస్తువుల కొనుగోలుతో పాటు, సేవారంగంలోనూ గ్రామీణుల ఆలోచనాధోరణిలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.

ఆదాయంతో పాటు కొనుగోళ్లూ ఊపందుకోవడంతో- పట్టణ ప్రాంత వినియోగదారుల తలసరి వ్యయంతో పోలిస్తే గ్రామీణ వినియోగదారుల తలసరి వ్యయం పెరుగుతోంది. కనీస అవసరాలైన ఆహారం వంటి వాటిపై చేసే ఖర్చుతో పాటు, ఆహారేతర వస్తువులపై చేసే వ్యయమూ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలో గ్రామీణం వాటా గణనీయంగా ఉంటుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలతో గ్రామీణ విపణులపై అంతర్జాతీయ వ్యాపారవర్గాలు దృష్టి సారించాయి. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి.

80శాతం మోసాలే..

ప్రధాన నగరాలు మొదలుకొని గ్రామాల వరకు ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, శీతలపానీయాలు రెడీమేడ్‌ వినియోగ వస్తువుల వాడకం విస్తరించింది. నకిలీలు, నాసిరకం వస్తువులు మార్కెట్లో విచ్చలవిడిగా చలామణీలో ఉన్నాయి. గ్రామీణ జనాభాలో దారిద్య్రం, నిరక్షరాస్యత వంటివి వినియోగదారులు తరచూ మోసానికి గురయ్యేందుకు కారణమవుతున్నాయి. కొన్ని నకిలీ కంపెనీలు అసలును పోలిన, నాణ్యతలేని వస్తువులను తయారు చేస్తున్నాయి. త్వరితగతిన అమ్ముడయ్యే సరకుల (ఎఫ్‌ఎంసీజీ) విపణి దేశం నలుమూలలా, విస్తరిస్తూ సింహభాగాన్ని ఆక్రమించింది. ఈ విపణి దేశంలో 2013 నాటికి 4,500 కోట్ల డాలర్లు; ప్రస్తుతం సుమారు 13,500 కోట్ల డాలర్లకు చేరిందని అంచనా. పాల పదార్థాలు, శీతల పానీయాలు, శీతలీకరణ చేసిన ఆహార పదార్థాలు, మందులు, అలంకరణ వస్తువులలో నాణ్యతలేమిని, నకిలీలను గుర్తించడం, నియంత్రించడం కష్టతరం. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో వస్తువులు ఒకదాన్ని పోలి ఒకటి ఉంటూ వినియోగదారుల్ని సంశయంలో పడేస్తాయి. దేశంలోని 80శాతం వినియోగదారులు త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల కొనుగోళ్లలో మోసపోతున్నారని 'ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)' వెల్లడించింది.

ఔషధాలు సైతం..

దేశంలో నాణ్యతలేని, నకిలీ వస్తువుల కొనుగోలు నిరాటంకంగా, లాభాపేక్షతో ఎలా కొనసాగుతుందో, ఫిక్కీ గతంలోనే తేటతెల్లం చేసింది. నాణ్యతలేని ప్యాకింగ్‌ ఆహార పదార్థాలు, శీతల పానీయాలవల్ల వినియోగదారుల ఆరోగ్యం పాడై, వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వస్తువుల విక్రయాలపై నిఘా పెంచాల్సిన అవసరముంది. భారత ఆహార భద్రత ప్రామాణిక సంస్థ నివేదిక ప్రకారం పాల ఉత్పత్తులు సహా, పలు నిత్యావసర సరకులు అధిక శాతం కల్తీకి గురవుతున్నాయి. ఔషధ రంగంలో సైతం నకిలీ మందుల బెడద వినియోగదారులకు ఆర్థికంగా, ఆరోగ్యరీత్యా నష్టాన్ని కలిగిస్తోంది. వాహన రంగం రంగంలో నకిలీ వస్తువుల వినియోగంవల్ల వాహనాల జీవితకాలం తగ్గిపోయి, ఆర్థికభారం పెరుగుతోంది.

నియంత్రణ ముఖ్యం..


ఆధునిక సాంకేతికత విస్తరించడంతో ఆన్‌లైన్‌ వ్యాపారం అధికమయింది. పలురకాల వస్తువులకు ఈ-విపణి పెద్దదిక్కుగా మారింది. ఆన్‌లైన్‌ మోసాలకు తెగబడే వారి సంఖ్యా అధికమవుతోంది. మోసాల నియంత్రణపై, వినియోగదారుల హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచే కార్యక్రమాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. కాలానుగుణంగా వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో తగిన చట్ట సవరణలను చేపట్టాల్సిన అవసరం ఉంది. మోసపూరిత ప్రకటనలను నిలువరించే సంస్థాగత ఏర్పాట్లు చాలా తక్కువ. వ్యాపార, వాణిజ్య సంస్థలు చేసే తప్పుడు ప్రచారాన్ని నియంత్రించడానికి సమర్థ వ్యవస్థ అవసరం. విదేశీ పెట్టుబడులను విరివిగా ఆకర్షించి భారత్‌లో తయారీ చర్యలు వేగవంతం చేయాలంటే మోసపూరిత, అభివృద్ధి నిరోధక చర్యలను రూపుమాపాలి.

వినియోగదారుల హక్కులు..

తయారీదారులకు భద్రత కల్పిస్తూ, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచాలి. వినియోగదారులపై జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయడానికి అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలి. వినియోగదారుల హక్కులను ఆయా ప్రాంతీయ భాషలలో ముద్రించి, విరివిగా ప్రచారం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలే వేదికలుగా వినియోగదారుల హక్కులు సాధించుకోవాల్సిన విధానం గురించి, సవివరంగా ప్రజలకు తెలియజేయాలి. ప్రజలను జాగృతం చేసినప్పుడే దేశం వినియోగదారుల సంక్షేమంతో, సత్వర ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌

ఇదీ చదవండి: కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవ్!

'నాణ్యమైన సేవలు పొందడం వినియోగదారుల హక్కు'

ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.