ETV Bharat / opinion

'సీల్డు కవర్‌' సంస్కృతికి తెరపడేదెన్నడు?

author img

By

Published : Sep 20, 2021, 4:37 AM IST

మితిమీరిన వ్యక్తిపూజ, ఎల్లలు దాటిన ఆశ్రిత పక్షపాతం, అడ్డూఅదుపు లేని అవినీతితో దేశీయంగా రాజకీయాలకు మకిలి పట్టింది. ఈ సంస్కృతి కాంగ్రెస్​లో మరీ అధికం! 'ప్రజాస్వామ్యమంటే ఏకవ్యక్తి పాలన కాదు' అని చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీనే.. ఆ ప్రమాణం సొంత పార్టీకి వర్తిస్తుందని విస్మరించినట్లు ఇటీవలే పంజాబ్​ సీఎం ఉదంతం చూస్తే బోధపడుతోంది.

democracy
కాంగ్రెస్

'ప్రజాస్వామ్యమంటే ఏకవ్యక్తి పాలన కాదు' అని కాంగ్రెస్‌ రాకుమారుడు రాహుల్‌ గాంధీ గతంలో ఘనంగా ప్రవచించారు. అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేసి, అధిష్ఠానం అడుగులకు అందరూ మడుగులొత్తాల్సిన పరిస్థితిని స్థిరపరచిన సొంత పార్టీకీ ఆ ప్రమాణం వర్తిస్తుందనే విషయాన్ని ఆయన విస్మరించారు. అవమానాలను తట్టుకోలేకపోతున్నానంటూ తాజాగా రాజీనామా చేసిన పంజాబ్‌ 'కెప్టెన్‌' అమరీందర్‌ సింగ్‌- అధిష్ఠానం ఒంటెత్తు పోకడలనే వేలెత్తి చూపించారు. వాచాలత్వంలో వాసికెక్కిన సిద్ధును ముద్దు చేస్తున్న పార్టీపెద్దల వైఖరి యావద్దేశానికే ముప్పుగా ఆయన అభివర్ణించారు. అస్మదీయులకూ అందుబాటులో ఉండరనే అపప్రథకు తోడు అధిష్ఠానంతో బెడిసికొట్టిన సంబంధాలు- అమరీందర్‌ పదవికి పొగపెట్టాయి. పేరుకు పార్టీ పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపినా- కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఎంపికకు దిల్లీలోని రాహుల్‌ నివాసమే వేదికైంది.

సీల్డుకవర్‌ సీఎం..

శాసనసభ్యుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా 'సీల్డుకవర్‌ సీఎం'లను కొలువు తీర్చే పెడపోకడలకు ఇందిర జమానా పెట్టింది పేరు! ఉత్తర్‌ప్రదేశ్‌, ఏపీలతో సహా అప్పట్లో ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అలాగే నామినేషన్లపై నడచి వచ్చేవారు. దశాబ్దాలు గడచినా ఆ దుష్ట సంప్రదాయం గతించలేదు సరికదా.. తరతమ భేదాలతో అన్ని పార్టీలూ అదే పద్ధతిని ఆబగా అందిపుచ్చుకొన్నాయి. మితిమీరిన వ్యక్తిపూజ, ఎల్లలు దాటిన ఆశ్రిత పక్షపాతం, అడ్డూఅదుపు లేని అవినీతితో దేశీయంగా దుర్రాజకీయాలకు తల్లివేరైనా కాంగ్రెస్‌లోనైతే ఈ మకిలి సంస్కృతి మరీ అధికం! 'ఇండియా ఒక కంప్యూటర్‌ అయితే- దానికి డీఫాల్ట్‌ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్‌' అని రాహుల్‌ ఆమధ్య మహాగొప్పగా సెలవిచ్చారు. ఏక కుటుంబాధిపత్యంలో మేటవేసిన అవలక్షణాలతో అదెప్పుడో వైరస్‌గా రూపాంతరం చెందిందన్నది ప్రత్యర్థుల విమర్శే కాదు- జనావళిలో అత్యధికుల అభిప్రాయం! పునాది నుంచి అధినాయకత్వం వరకు అంతర్గత సంస్కరణలతో పార్టీకి కొత్త రక్తం ఎక్కించకపోతే- గత వైభవాల శిథిల చిత్రంగా అది మిగిలిపోవడం తథ్యం!

చర్చలకు ఆస్కారమే లేదు..

ప్రభుత్వాధినేతల నిర్ణయాలకు పార్టీ అభిప్రాయమే ప్రాతిపదిక కావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఆనాడు కృపలానీ పట్టుపట్టారు. విస్తృత మార్గదర్శక సూత్రాలను పార్టీ అందిస్తే చాలని నాటి ప్రధాని నెహ్రూ స్పష్టీకరించారు. అటువంటి చర్చలకు ఆస్కారమే లేకుండా అధిష్ఠానం పేరిట సమస్త వ్యవహారాలను ఒకరిద్దరు వ్యక్తులే అనుశాసించే దుర్వ్యవస్థ ఆ తరవాతి కాలంలో కాంగ్రెస్‌లో వేళ్లూనింది. కాలక్రమంలో అన్ని రాజకీయ పక్షాలకూ పాకిన ఆ జాడ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా వెర్రితలలు వేస్తోంది. విధానాలపై వాదోపవాదాలు, సామూహిక నిర్ణయాలు పూజ్యమై- దిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలన్నీ అగ్రనేతల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. జనహిత శాసనాల రూపకల్పనలో ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం కొరవడి- చట్టసభలు అలంకార ప్రాయమవుతున్నాయి.

అయినా తీరు మారలే..

అధినేత్రిగా సర్వంసహాధికారాలను గుప్పిట పట్టిన సోనియా దుందుడుకు వైఖరితోనే ప్రజలకు పార్టీ దూరమైందని ఏకే ఆంటొనీ కమిటీ లోగడే కుండ బద్దలుకొట్టినా- కాంగ్రెస్‌ తీరు మారలేదు. మిగిలిన పార్టీలకు అది గుణపాఠమూ కాలేదు. ప్రజాసేవే లక్ష్యంగా సాగాల్సిన రాజకీయాలకు నేడు అధికారమే పరమావధి అవుతోంది. నవ యువభారతం ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం, దేశవ్యాప్త ప్రజా ఉద్యమాల నిర్మాణంలో సామర్థ్యలేమి, కలిసి రావాలనుకొనే పక్షాలపై స్వారీచేసే పెత్తందారీ నైజం వెరసి- నూట ముప్ఫై ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. దాని అడుగుజాడలను అనుసరిస్తూ వ్యక్తిస్వామ్యంతో వెలాతెలాపోతున్న రాజకీయ పక్షాలు- ప్రజాస్వామ్య విలువలకే సమాధి కడుతున్నాయి. జాతి భవితను తీర్చిదిద్దడంలో వ్యష్టి కన్నా ప్రజాస్వామిక వ్యవస్థల పాత్రే కీలకం. రాజకీయ పార్టీలు ఆ విలువల బాటలో నడిచేదెన్నడు అన్నదే ప్రధాన ప్రశ్న!

ఇదీ చూడండి: సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా- 'అవమానాలు భరించలేకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.