ETV Bharat / opinion

గోప్యతకు నిఘా ముప్పు.. స్వీయ జాగ్రత్తలే కీలకం!

author img

By

Published : Aug 3, 2021, 5:50 AM IST

privacy
గోప్యత

మనకే తెలియకుండా మన ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సంభాషణలను, సందేశాలను పసిగట్టే అత్యాధునిక పరిజ్ఞానంతో గోప్యత అనేది మిథ్యగా మారింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు- ఏవీ నిఘాకు అతీతం కావని పదేపదే నిరూపణ అవుతోంది. ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధించినా, పౌరుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతూనే ఉన్నాయి. గోప్యతను కాపాడుకోవడానికి పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడకుండా వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రాచీన కాలం నాటి రాజులు మొదలుకొని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల వరకు ఇంటా బయటా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గూఢచారులతో పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. పూర్వకాలంలో చారులు తాము సేకరించిన సమాచారాన్ని పావురాలతో ఏలినవారికి చేరవేసేవారు. 1844లో అమెరికాలో శామ్యూల్‌ మోర్స్‌ టెలిగ్రాఫ్‌ లైన్లను కనిపెట్టాక సమాచారం వేగంగా ప్రసారం కావడం మొదలైంది. సమాచార విప్లవానికి టెలిగ్రాఫ్‌ నాంది పలికింది. 1876లో అలెగ్జాండర్‌ గ్రాహం బెల్‌ టెలిఫోన్‌ను కనిపెట్టారు. అది కమ్యూనికేషన్‌ విప్లవాన్ని ఆరంభించింది.

త్వరలో 5జి సెల్యులర్‌ నెట్‌వర్కులు టెలికం విప్లవాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళబోతున్నాయి. భారతదేశ తంతి తపాలా (పీ అండ్‌ టీ) శాఖ ప్రజలకు 1853 నుంచి ఎప్పటికప్పుడు టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, టెలికం సేవలను అందిస్తూ వచ్చింది. శత్రుదేశాల చెవుల పడకుండా మన సైనిక బలగాలకు కోడ్‌లో సందేశాలు పంపుకొనే సౌకర్యాన్ని కల్పించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్‌ సీఐఏ, రష్యన్‌ కేజీబీ గూఢచార సంస్థలు పోటాపోటీగా పరస్పరం నిఘా వేసుకొనేవి. రహస్య సమాచారాన్ని చేరవేయడానికి ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించేవి.

దుర్వినియోగమే ఎక్కువ..

గతంలో గూఢచారులు క్షేత్ర స్థాయిలో తిరిగి వ్యక్తిగతంగా సమాచారం సేకరించేవారు. దీన్ని హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ (హ్యూమింట్‌)గా వ్యవహరించారు. సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ సాధనాల ద్వారా పంపడాన్ని ఎలింట్‌గా పేర్కొంటారు. నేడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం వల్ల ప్రత్యర్థుల సంభాషణలను రహస్యంగా ఆలకించడానికి టెలిఫోన్లలో ఏర్పాటు చేసే బగ్‌లు మొదలుకొని, సొంతదారులకు తెలియకుండానే వారి సెల్‌ఫోన్లలో చొరబడటానికి తోడ్పడే స్పైవేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్వదేశంలో రాజకీయ ప్రత్యర్థుల సంభాషణలు, సందేశాలపై నిఘా వేయడం చట్టవిరుద్ధమని తెలిసీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ చట్ట ఉల్లంఘనకు పాల్పడి, పదవిని కోల్పోయారు. 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలవడానికి రష్యన్‌ ఏజెంట్లు ఇంటర్నెట్‌ను, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ జరిగినా- ఆ విషయం విస్పష్టంగా రుజువు కాలేదు. టెలికం, ఇంటర్నెట్‌లను అడ్డుపెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో మేధాహక్కుల చౌర్యానికి చైనా పాల్పడుతోందని; సైనిక, పారిశ్రామిక రహస్యాలను కాజేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అనేక ఇతర దేశాలూ ఇలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. హువావై కంపెనీ పరికరాల్లో గూఢచర్య వెసులుబాటు ఉందని, దీన్ని చైనా ఉపయోగించుకొంటోందని అనుమానిస్తున్నాయి. ఈ కారణంతోనే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు హువావై టెలికం సాధనాలను నిషేధించాయి.

పెగాసస్ ప్రకంపణలు..

తాజాగా బట్టబయలైన పెగాసస్‌ ఉదంతం మొబైల్‌ ఫోన్ల హ్యాకింగ్‌ విశ్వరూపాన్ని వెలుగులోకి తెచ్చింది. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తల ఫోన్లలోకి చొరబడి వారి సంభాషణలను, సందేశాలను పసిగట్టే అత్యాధునిక పరిజ్ఞానమిది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు- ఏవీ నిఘాకు అతీతం కావని పదేపదే నిరూపణ అవుతోంది. ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధించినా, పౌరుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతూనే ఉన్నాయి. దీని నివారణ మార్గాలను తక్షణం కనుగొనడం ఆవశ్యకం. గోప్యతను కాపాడుకోవడానికి పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడకుండా వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరీ ముఖ్యమనుకున్న సమాచారాన్ని సెల్‌ఫోన్లలో పంచుకొనే బదులు ల్యాండ్‌ లైన్లను ఉపయోగించడం మంచిది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ పారదర్శకతను పాటిస్తూ, దొంగచాటు నిఘాకు ఆస్కారం లేకుండా చూస్తోంది. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు వాడేవారు పటిష్ఠమైన పాస్‌వర్డ్‌లను ఏర్పరచుకొని, వాటిని పదేపదే మారుస్తూ ఉండాలి. సంబంధిత సంస్థలు, సైబర్‌ పోలీసులు తరచూ చెప్పే జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ ఖాతాదారులకు నిఘా భయం లేని భద్రమైన సేవలు అందించాలి. కేవలం వ్యాపార లాభాలు చూసుకోవడం కాకుండా ఖాతాదారుల ప్రయోజనాల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం క్లౌడ్‌ సర్వీసు ప్రొవైడర్లు తమ డేటా కేంద్రాలలో బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా, మున్ముందు 5జితో టెక్నాలజీలు మారిపోనున్నాయి. దానికి తగినట్లు తమ భద్రతా ఏర్పాట్లనూ మార్చుకోవాలి. భారత్‌లో బహుళపార్టీల రాజకీయ వ్యవస్థ ఉంది. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలి. వ్యక్తుల గోప్యత, భద్రత, మర్యాదలకు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలగనిరీతిలో దేశ భద్రత కోసం నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించాలి.

- ఎం.ఆర్‌.పట్నాయక్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.