ETV Bharat / opinion

రక్తనాళాలకు 'సికిల్ సెల్' ముప్పు- అవగాహనే మందు!

author img

By

Published : Jun 19, 2021, 7:17 AM IST

Updated : Jun 19, 2021, 7:26 AM IST

Sickle Cell anemia
సికిల్​ సెల్​

ఎర్ర రక్తకణాలను దెబ్బతీసే అతిప్రమాదకర జబ్బు సికిల్‌సెల్‌! ఈ వ్యాధి బారిన పడిన వారిలో వివిధ అవయవాలకు రక్తం తగినంతగా సరఫరా కాదు. శరీర కణాలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషకాలు అందవు. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తహీనతతో పాటు అనేక ఇన్ఫెక్షన్లూ చుట్టుముడతాయి. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు, బాధితులను రక్షించేందుకు 2008లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఏటా జూన్‌ 19న 'ప్రపంచ సికిల్‌సెల్‌ దినం'గా పాటిస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మృదువుగా, గుండ్రంగా ఉండే ఎర్ర రక్తకణాలను దెబ్బతీసే అతిప్రమాదకర జబ్బు సికిల్‌సెల్‌(Sickle Cell)! ఆ వ్యాధిగ్రస్తుల్లో ఎర్ర రక్తకణాలు కొడవలి (సికిల్‌) లేదా నెలవంక ఆకారంలోకి మారతాయి. అవి జిగురుగా, గట్టిగా తయారై- శరీరంలోని సూక్ష్మరక్తనాళాల్లో చిక్కుకుపోతుంటాయి. ఫలితంగా వివిధ అవయవాలకు రక్తం తగినంతగా సరఫరా కాదు. శరీర కణాలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషకాలు అందవు. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తహీనతతో పాటు అనేక ఇన్ఫెక్షన్లూ చుట్టుముడతాయి. సికిల్‌సెల్‌ ఎనీమియాగానూ పిలిచే ఈ రక్తరుగ్మత వంశపారంపర్యమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బు కలిగించే జన్యువు ఉన్నవారిలో సగం మందికి పైగా మనదేశంలోనే ఉంటారని అంచనా! భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా 44 వేల మంది పిల్లలు సికిల్‌సెల్‌ వ్యాధితో జన్మిస్తున్నారు. వీరిలో 20 శాతం రెండేళ్ల లోపే చనిపోతున్నారు. ఇరవై ఏళ్ల వయసులోగా మరో 30 శాతం బాధితులు మరణిస్తున్నారు.

గిరిజనులపై తీవ్ర ప్రభావం

ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు, బాధితులను రక్షించేందుకు 2008లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా జూన్‌ 19న 'ప్రపంచ సికిల్‌సెల్‌ దినం'గా పాటిస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో గిరిజన సమూహాలు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, బిహార్‌, ఝార్ఖండ్‌, అసోం, సిక్కిం, పశ్చిమ ఒడిశా, ఉత్తర తమిళనాడు, తూర్పు గుజరాత్‌లలో సికిల్‌సెల్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీని బాధితుల్లో కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, ప్లీహం దెబ్బతింటాయి. ఈ సమస్యల వల్ల వారికి మరణం ముప్పు పెరుగుతుంది. ఎముక మజ్జ మార్పిడి ఒక్కటే దీనికి మేలైన చికిత్స. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది! దాతలు దొరకడం కష్టం కావడంతో పాటు కొంతమందికి ప్రాణాపాయాన్నీ కలిగించవచ్చు. ఎర్ర రక్తకణాల మార్పిడి మరో ప్రత్యామ్నాయం. రక్తహీనతను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. బాధితుల వయసు, బరువులను బట్టి దీన్ని అందిస్తూ ఉంటారు. కరోనా ప్రభావంతో దేశంలో నెత్తురు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. కొవిడ్‌ రెండో దశ విజృంభణతో రక్తదానానికి చాలామంది ముందుకు రావడంలేదు. దానితో సికిల్‌సెల్‌ బాధితులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో..

సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తుల్లో ధైర్యం నింపడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, మహిళా సంఘాలు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఓ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. దాని ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు, ఆశ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మరోవైపు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆన్‌లైన్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు నిర్వహిస్తోంది. దీని ద్వారా వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేసుకొని వారికి తగిన తోడ్పాటును అందిస్తోంది. సికిల్‌సెల్‌ సంస్థల జాతీయ కూటమి (నాస్కో) సైతం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తోంది. వ్యాధి బాధితులు నాణ్యమైన జీవనం సాగించడానికి అవసరమైన సాయమూ చేస్తోంది. దివ్వాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఈ కొడవలి కణ రక్తహీనతను ఒక వైకల్యంగా గుర్తించారు. దాంతో ప్రభుత్వం నుంచి బాధితులు వివిధ ప్రయోజనాలు పొందడానికి అవకాశం కలిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రక్తహీనతను నిరోధించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కొన్ని మార్గదర్శకాలను, చికిత్సా పద్ధతులను సిఫార్సు చేసింది. 2018 సంవత్సరంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ రక్తహీనత నివారణపై ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించినప్పటికీ ఆ తరవాత అది మరుగున పడిపోయింది. దాన్ని వెంటనే పట్టాలెక్కిస్తే చాలామందికి మేలు కలుగుతుంది.

నిర్దారణ పరీక్షలు అవసరం

సికిల్‌సెల్‌ రక్తహీనతతో బలహీనంగా ఉండేవారు కొవిడ్‌ బారిన పడితే ఇంకా ఎక్కువగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి బాధితులు శరీరానికి కావాల్సిన నీటితోపాటు, క్రమం తప్పకుండా ఔషధాలు, మంచి పోషకాహారం తీసుకోవాలి. వీరికి సకాలంలో రక్తం అందించడంపై ప్రభుత్వాలు తక్షణం దృష్టిసారించాలి. రక్తనిధి కేంద్రాల్లో నెత్తురు నిల్వలను పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. సికిల్‌సెల్‌ వాహకుల గుర్తింపునకు పరీక్షలు (జన్యు కౌన్సిలింగ్‌) జరపడం చాలా ముఖ్యం. వ్యాధికారక జన్యువును కలిగి ఉన్నవారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా భవిష్యత్‌ తరానికి ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఇందుకోసం జిల్లాస్థాయిలో వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా గిరిజన సముదాయాల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలి.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌
(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

ఇదీ చూడండి: కొవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టడానికి కారణమిదే.. !

ఇదీ చూడండి: దాతలు లేక తరుగుతున్న నెత్తురు నిల్వలు

Last Updated :Jun 19, 2021, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.