TRS Working President KTR : వరికి ఉరి బిగిస్తున్న కేంద్రం.. రైతు వ్యతిరేక విధానాలపై సమరం

author img

By

Published : Nov 12, 2021, 8:18 AM IST

paddy purchase in telangana

కేంద్ర సర్కార్ తమ నిరంకుశ విధానాలతో రైతులను దెబ్బతీస్తుంటే.. తెలంగాణ భాజపా నేతలు కర్షకుల బతుకులతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(TRS Working President KTR) ఆరోపించారు. బండి సంజయ్​కి దమ్ముంటే.. వారంలోగా 1.5 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురావాలని సవాల్ చేశారు. తెలంగాణ రైతులకు మద్దతు ఇవ్వకపోగా.. ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో ధాన్యం కొనుగోలు చేయమని చెబుతూనే.. రాష్ట్రంలో యాసంగికి వరి పంట వేయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(BJP) ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలను సమూలంగా నాశనం చేయడంతోపాటు, రాజ్యాంగ విధులను నెరవేర్చకుండా పారిపోవడం అలవాటుగా మారింది. దేశానికి అత్యంత కీలకమైన వ్యవసాయరంగంలోని రైతన్నలకు ఉపాధి, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా దేశ ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకుని, వ్యవసాయోత్పత్తుల కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని భారత రాజ్యాంగంలోని 246 అధికరణ పేర్కొంటోంది. కానీ ఈ బాధ్యతను విస్మరించి, భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాత వెన్నువిరిచేలా దుష్ట విధానాలకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల(Agricultural acts)పై ఏడాదిగా దేశ రైతాంగం అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ, ఆందోళన చేపట్టినా కేంద్రం స్పందించడం లేదు. పైగా భాజపా నేతలే రైతు నిరసనలపై హింసాత్మక దాడులకు తెగబడుతున్నరు. ఏకంగా కేంద్రమంత్రి పుత్రరత్నమే కర్షకులను కార్లతో తొక్కించి చంపినా ప్రధాని నోరు విప్పలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతువ్యతిరేకతను తన విధానాలు, చట్టాలు, చర్యలతో కొట్టొచ్చినట్లు చాటుకొంటోంది.

.

అన్నదాతకు అండగా మా ప్రభుత్వం

మా ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) స్వయంగా ఒక రైతు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అనేక పంటలను సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి, పాలనా పగ్గాలు చేపట్టిన తరవాత ఒక రైతుగా- రైతాంగ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అన్నదాతకు చేసినంత మేలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ఏ ప్రభుత్వమూ చేయలేదని గర్వంగా చెప్పగలను. దుక్కి దున్నేవాడి దుఃఖం తుడిచేలా... ప్రపంచమే అబ్బురపడే అద్భుత పథకాలు, కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని(Telangana Agriculture Sector) బలోపేతం చేస్తున్నారు. దేశానికి ప్రాజెక్టుల నిర్మాణంలో పాఠాలు చెబుతూ అనేక సవాళ్లను పరిష్కరించి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని(Kaleshwaram Lift Irrigation Project) మూడేళ్లలోనే పూర్తి చేశారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. రాష్ట్రంలోని వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచే గొలుసుకట్టు చెరువులను మిషన్‌ కాకతీయతో పునరుద్ధరించుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా 10 వేల కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నాం. గత ప్రభుత్వాల హయాములో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం రైతులు లాఠీచార్జీలపాలైన ఉదంతాలకు భిన్నంగా ఈ రోజు రైతులకు వాటిని విస్తారంగా అందుబాటులోకి తెచ్చాము.

.

దేశంలో ఎక్కడా లేని విధంగా నకిలీ విత్తనాలు(fake seeds) అమ్మేవారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా కఠిన చర్యలు చేపట్టాం. అన్నదాతకు అప్పుల బాధ ఉండవద్దని వారికి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా పది వేల రూపాయలు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్నాం. ఇప్పటిదాకా సుమారు 50 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాం. అన్నదాతల అకాల మరణాలు సంభవిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు అయిదు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా రైతుబీమా(Rythu bheema)ను అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి దఫా రూ.16 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. రెండోసారీ మాఫీ చేస్తున్నాం. అన్నదాతల్లో చైతన్యానికి, ఆధునిక వ్యవసాయ మెలకువల కోసం, అధికారుల సలహాలు సూచనలు అందించేలా 26,001 రైతు వేదికలను నిర్మించాం. ప్రతి అయిదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా చేసి ఓ అధికారిని నియమించి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాన్ని బలోపేతం చేశాం. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ అన్నదాతలను కంటికి రెప్పగా కాపాడుకున్నాం. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తూ రాష్ట్ర రైతాంగం పండించిన పంటలకు నష్టం కలగకుండా, ఖర్చుకు వెనకాడకుండా మొత్తం వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేశాం. వారంలోనే రైతులకు డబ్బులు అందిస్తున్నాం. కరోనా విపత్తు సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల జీతాల్లో కోత విధించి మరీ రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన నిబద్ధత మా తెరాస సర్కారుది. ఇలా... మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలవల్ల ఒకప్పుడు కరవుతో తల్లడిల్లిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా అలరారుతోంది. మా ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ కార్యక్రమాలను, పథకాలను వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రం సైతం ఆదర్శంగా తీసుకునేలా దేశ చరిత్రలో నిలిచిపోయేలా అమలు చేస్తున్నాం.

కేంద్ర వైఖరే శాపం

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే... కేంద్రం మాత్రం అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేలా వ్యవహరిస్తోంది. సాగుదారులకు సాయం చేయడంలేదు. రాష్ట్రాలకు సహకారం అందించడం లేదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండగా, పంటలకు మద్దతు ధరలు ప్రకటించాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా- కొన్నింటికే వాటిని పరిమితం చేసింది. గత ప్రభుత్వాల హయాములో దేశవ్యాప్తంగా పంట రుణాలు మాఫీ కాగా- వేల కోట్ల రూపాయల కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేస్తున్న భాజపా ప్రభుత్వం, వ్యవసాయ రుణాల మాఫీ ఊసే ఎత్తడం లేదు. అన్నదాతలపై ఆంక్షల కత్తి దూస్తూ నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా రైతన్నలు దిల్లీలో ధర్నాలు చేస్తున్నా, వందల మంది కర్షకులు ప్రాణత్యాగం చేస్తున్నా రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. సాధారణంగా వరి, గోధుమలు, ఇతర ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ(Food Corporation of India)) ద్వారా కొనుగోలు చేస్తుంది. ఇలా కొనాల్సింది, కొన్నాక తిరిగి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంచాల్సింది కేంద్రమే. ధాన్యం కొననే కొనబోమంటూ తేల్చి చెబితే రాష్ట్రాలు ఏం చేయాలి? పంటలు పండించిన రైతులు ఏమైపోవాలి? ధాన్యం కొనుగోళ్లు, సేకరణ విషయంలో కేంద్ర లోపభూయిష్ఠ నిర్ణయాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ దేశ హితం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అగ్రతాంబూలం ఇచ్చే భాజపా, రైతుల పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది.

త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌ రాష్ట్రంలో ప్రతి గింజ ధాన్యం కొంటామంటున్న(Paddy purchase) కేంద్రం, తెలంగాణకు మాత్రం సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ ఏడాది కేంద్రం తెలంగాణ ధాన్యం తీసుకునేదే లేదని మెలిక పెడుతోంది. నెల రోజుల క్రితం మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా దిల్లీకి వెళ్లి ఆ శాఖ మంత్రితో మాట్లాడినా- కనీసం ఈ ఏడాది ఎంత కొంటారో చెప్పాల్సిందిగా కోరినా ఇప్పటిదాకా స్పందన లేదు. గత ఏడాది పూర్తిస్థాయిలో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని కోరినా ఇంకా అయిదు లక్షల టన్నుల గత యాసంగి పంట మిగిలేఉంది. తెలంగాణ రైతులు ఈ వర్షాకాలంలో 62లక్షల ఎకరాల్లో వరి వేశారు. కోతలు మొదలయ్యాయి. వానాకాలం పంట కింద 1.70 కోట్ల టన్నుల వడ్లు రానున్నాయి. దీన్ని బియ్యంగా మార్చితే 1.10కోట్ల టన్నుల బియ్యం సిద్ధమవుతుంది. కానీ ఇప్పుడు దీన్ని తీసుకునే దిక్కులేదు. ఇందుకు సంపూర్ణ బాధ్యత కేంద్రమే వహించాల్సి ఉంటుంది. ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో ఒక ఏకరూప విధానం కేంద్రానికి లేదు. కనీసం తెలంగాణ లాంటి ఉత్పాదకత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు అధిక ప్రోత్సాహం ఇవ్వాలన్న సోయి సైతం లేదు. కేంద్ర పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు(Paddy purchase in telangana) జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు కొనుగోలు అధికారం లేదు. ఎగుమతుల అంశం కేంద్రం పరిధిలోనే ఉంది. కానీ కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను ధాన్యం సేకరణ సమస్యలకు బాధ్యులుగా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని చేపడుతూ, రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా కేంద్రం వ్యవహరిస్తోంది. పంజాబ్‌ మాదిరిగా పూర్తిగా తెలంగాణ వడ్లను కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్నాం. కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరి సాగులో తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగింది. ఇలా దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ రాష్ట్రంపై తమకు అలవాటైన దుర్విచక్షణను కేంద్రం కొనసాగించడమంటే- రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేయడమే. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న భాజపా నేతలకు పోటీగా రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, రైతులను సంక్షోభంలోకి నెట్టేందుకు తెలంగాణ భాజపా నేతలు సైతం పోటీ పడుతున్నారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, వరి పండించవద్దని, రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అంటున్నారు.

.

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరి ధాన్యం పండించాలంటూ కేంద్ర వైఖరికి విరుద్ధంగా రైతులను రెచ్చగొడుతున్నారు. ఇంకోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉప్పుడు బియ్యం కొనేదే లేదంటున్నారు. భాజపా నేతల వ్యాఖ్యలు- తెలంగాణ రాష్ట్ర క్షేత్రస్థాయి వ్యవసాయ పరిస్థితులపై వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. తెలంగాణలో యాసంగి పంట దిగుబడి మొత్తం ఉప్పుడు బియ్యం కిందకు మారుతుంది. పంట చేతికందే ఫిబ్రవరి మాసాంతం నుంచి తెలంగాణలో ఉండే సుమారు 35 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలవల్ల, ధాన్యాన్ని మర పట్టేటప్పుడు ఊక శాతం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యాన్ని ఉడికించి బియ్యంగా మార్చితేనే రైతుకు లాభం వస్తుంది. లేకుంటే కనీస పంట పెట్టుబడి కూడా రాదు. ఇలాంటి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎలాంటి అవగాహనా లేని భాజపా నాయకులు- యాసంగిలో మరోసారి వరి వేయాలంటూ ఇక్కడి రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కిలో ఉప్పుడు బియ్యాన్నీ తీసుకోబోమంటున్న కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ఇది ముమ్మాటికీ భాజపా నేతలకు రాష్ట్ర రైతాంగం పట్ల ఉన్న కుట్రపూరిత ద్వంద్వవైఖరికి నిదర్శనం. ఇన్నాళ్లూ కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని కూడా తీసుకుంది. ఇప్పుడు తీసుకునేది లేదని ఎందుకు అంటోంది? రైతులు పంటల మార్పిడికి అలవాటు పడేలా కొన్ని సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వాలి. వారిని చైతన్యవంతులుగా చేయాలి. చెప్పాపెట్టకుండా మధ్యలోనే అకస్మాత్తుగా చేతులెత్తేస్తే ఎలాగనే విషయంలో భాజపా నేతలు రైతులకు సమాధానం చెప్పాలి.

కుటిల రాజకీయాలు వద్దు

రైతులు బాగుండాలని, సుఖసంతోషాలతో జీవించాలని, వారి జేబుల్లోకి డబ్బులు రావాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది. కానీ భాజపా నేతలు రైతులను ముంచైనా సరే రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నరు. విభజన హామీలు మొదలు ఇంత వరకు భాజపా కేంద్ర సర్కారు రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటీ లేదు. ఇరవై ఏళ్ల తెరాస పార్టీ ప్రస్థానంలో ఎప్పుడు తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా బరిలో నిలిచి కొట్లాడింది. కేవలం తమ కుటిల రాజకీయాల కోసం రైతులను ఇబ్బందులు పెడితే తెలంగాణ రాష్ట్రసమితి ఉపేక్షించదు. ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇప్పటికే కేంద్రంపై రైతు సమస్యలపై సమరభేరి మోగించారు. ఆ కార్యాచరణలో భాగంగా శుక్రవారం ధర్నాలు చేస్తున్నాం. పార్లమెంటులోనూ మా పార్టీ ఎంపీలు ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తారు. అవసరమైతే దిల్లీలోనూ ఆందోళన చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ తెలంగాణకు సహకరించకపోతే ఎంతదాకానైనా వెళతాం... ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమవుతాం... ఉద్యమ పంథాలో రైతన్నలకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తెరాస పార్టీ శ్రేణులు నడుస్తాయి. రాష్ట్ర రైతాంగం కోసం చేపట్టే మా ప్రయత్నాలకు యావత్‌ తెలంగాణ సమాజం కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మా ప్రశ్నకు జవాబేదీ?

.

కేంద్రప్రభుత్వం వివేకం లేని విధానాలతో రైతులను దెబ్బతీస్తుంటే... ఇక్కడ తెలంగాణ స్థానిక భాజపా నేతలు రైతుల బతుకులతో రాజకీయ చెలగాటమాడుతున్నరు. బండి సంజయ్‌కి గానీ భాజపా నేతలకు గానీ దమ్ముంటే వారం రోజుల్లో 1.5కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ధాన్యం ఆర్డర్‌ తీసుకుని రావాలన్న మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాలుకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర రైతాంగం తరఫున మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. దిల్లీలో బియ్యం కొనేది లేదంటూనే, గల్లీలో మాత్రం రైతుల బతుకు ఆగం చేసేందుకు వరి పండించాలంటూ ఉరితాళ్లు పేనుతున్నారు. దిల్లీలో ధాన్యం కొనుగోలు చేయబోమంటూనే- ఇక్కడ యాసంగిలో వరి వేయమంటున్నారు. ఇది మోసం కాదా? రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి నట్టేట ముంచే కుట్ర కాదా?

(తెలంగాణ రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షులుగా రచయిత వ్యక్తపరిచిన అభిప్రాయాలివి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.