ETV Bharat / opinion

నయా బిజినెస్​.. స్పేస్ టూరిజంలో కాసుల వర్షం

author img

By

Published : Jul 25, 2021, 8:11 AM IST

చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 11న ఒక ప్రైవేటు సంస్థ (వర్జిన్‌ గెలాక్టిక్‌) ప్రయోగించిన రాకెట్‌లో యాత్రికులు భూకక్ష్యలోకి ప్రవేశించారు. ప్రస్తుతం 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష వ్యాపార పరిమాణం 2040కల్లా లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా. ఈ వ్యాపారంలో ప్రధాన పోటీదారులు.. ప్రైవేటు కంపెనీలే..

space tour business
స్పేస్ టూరిజం

ఇటీవలి వరకు ప్రభుత్వాలు, సైన్యాలు, టెలికమ్యూనికేషన్‌ సంస్థల గుత్త సొత్తుగా ఉన్న అంతరిక్షంలోకి ఇప్పుడు ప్రైవేటు కంపెనీలూ దిగాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 11న ఒక ప్రైవేటు సంస్థ (వర్జిన్‌ గెలాక్టిక్‌) ప్రయోగించిన రాకెట్‌లో యాత్రికులు భూకక్ష్యలోకి ప్రవేశించారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష కావడం తెలుగు వారికి గర్వకారణం. ఆమెతో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భారతీయ సంతతి మహిళలు అంతరిక్షయానం చేయడం జాతిని ఉత్తేజపరుస్తోంది.

శిరీషకు ముందు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ రోదసిలోకి దూసుకెళ్లారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బేజొస్‌ కన్నా తొమ్మిది రోజుల ముందే అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. వీరిద్దరి విజయాలు ఇకపై అపర కుబేరుల అంతరిక్ష విహారానికి బాటలు వేయనున్నాయి. అమిత ధనవంతులకు కొండంత ధరలకు అంతరిక్ష ప్రయాణ టికెట్లు విక్రయించడం వర్జిన్‌, అమెజాన్‌ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశమవుతుంది. రోదసిలో ఈ రెండు సంస్థల మధ్య వ్యాపార పోటీ ఊపందుకోనున్నది.

సూక్ష్మ ఉపగ్రహ వ్యాపారం

ప్రస్తుతం 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష వ్యాపార పరిమాణం 2040కల్లా లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా. ఈ వ్యాపారంలో ప్రధాన పోటీదారులు ప్రభుత్వాలు కాబోవు- ప్రైవేటు కంపెనీలే. రక్షణ, వైమానిక-అంతరిక్షరంగాలతోపాటు సమాచార సాంకేతిక రంగం, టెలికమ్యూనికేషన్లు, అంతర్జాల మౌలిక వసతులు ఎంతగానో పురోగమిస్తున్నాయి. భూగోళ పరిశీలక ఉపగ్రహాలు, జాతీయ భద్రతా ఉపగ్రహాలు, చంద్రుడిపైన, గ్రహశకలాలపైన ఖనిజ వనరుల అన్వేషణ, అంతరిక్ష నౌకలకు ఇంధనం, ఇతర సరఫరాలను అందించే రోదసీ డిపోలతో అంతరిక్ష వ్యాపారం వర్ధిల్లనున్నది. అసలు 2040కల్లా 50 శాతం అంతరిక్ష వ్యాపారం ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ అంతర్జాల సేవల్లోనే జరగనున్నదని మోర్గాన్‌ స్టాన్లీ లెక్కగట్టింది. ఈ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ సేవలను అందించే ఉపగ్రహ ప్రయోగాలు కొత్త వ్యాపారంగా వృద్ధిచెందుతాయి. మళ్ళీ మళ్ళీ ప్రయోగించదగిన రాకెట్లు ఉపగ్రహ ప్రయోగాలను ముమ్మరం చేస్తాయి. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగానికి 20 కోట్ల డాలర్లు ఖర్చయితే, ఇప్పుడు అది ఆరు కోట్ల డాలర్లకు దిగివచ్చింది.

ఉపగ్రహ తయారీ..

మున్ముందు ఉపగ్రహ తయారీ ఖర్చు ఇప్పుడున్న 50 కోట్ల డాలర్ల నుంచి అయిదు లక్షల డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉంది. సూక్ష్మ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలు భారీ వ్యాపారంగా అవతరించనున్నాయి. ఈ బుల్లి ఉపగ్రహాలు కీలక సమాచారాన్ని భూతలానికి పంపుతాయి. ఆ సమాచారం ట్రాఫిక్‌ నియంత్రణతోపాటు స్వయంచాలిత రవాణా వ్యవస్థలను, పారిశ్రామికోత్పత్తి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. భూమిపై నౌకలు, ట్రక్కులు, ఇతర వాహనాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పటికప్పుడు కచ్చితంగా కనిపెట్టడానికీ నానో ఉపగ్రహాలు ఉపకరిస్తాయి. వీటిని క్యూబ్‌ శాట్స్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తులు, సంస్థలు పంపుకొనే సంకేతాలను (సిగ్నల్స్‌) నానో ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు పసిగట్టగలవు. దేశ భద్రతకు ప్రమాదకరమైన సంకేతాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసారమవుతున్నాయో కనిపెట్టగలవు. ఎంతటి గుప్త (ఎన్‌క్రిప్టెడ్‌) సంకేతాల ప్రసారాన్నైనా ఆరా తీస్తాయి. ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు నానో ఉపగ్రహాలు ఎంతో అక్కరకొస్తాయి.

భారరహిత స్థితిలో ఉత్పత్తి!

భూమి మీద నుంచి రోదసిలోకి, అంతరిక్షం నుంచి భూమి మీదకు, ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సరకులు, మనుషుల రవాణా పెద్ద వ్యాపారంగా ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం దేశాల మధ్య, దేశం లోపల సరకులను రవాణా చేస్తున్న ఫెడెక్స్‌, యూపీసీ వంటి కంపెనీలు రేపు రోదసిలోనూ అవతరిస్తాయి. కొన్ని పరిశ్రమలకు భూమికన్నా అంతరిక్షమే అత్యంత అనువైనది. శూన్యంలో, భారరహిత స్థితిలో ఉత్పత్తి అయ్యే కొన్ని సున్నితమైన, కీలకమైన వస్తువులకు బాగా గిరాకీ ఉంది. చంద్రుడు, కుజుడు, గ్రహశకలాల నుంచి ముడిసరకులను తెచ్చి అంతరిక్షంలోనే ఉత్పత్తి చేసే పరిశ్రమలు మున్ముందు విస్తరిస్తాయి. 2025కల్లా చంద్రుడిపై మానవ ఆవాసాలు, ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కావచ్చు. అత్యంత కీలకమైన హీలియం-3 ఇంధన నిక్షేపాలు లక్ష టన్నుల వరకు చంద్రుడిపై ఉన్నాయని అంచనా. భూమిపై ఒక టన్ను హీలియం-3 ధర 700 కోట్ల డాలర్లు ఉంటుంది. చంద్రుడి నుంచి అంతరిక్ష నౌకల ద్వారా కుజ గ్రహం మీదకు మానవులను, సరకులను రవాణా చేయాలని అమెరికాకు చెందిన 'నాసా' పథకాలు రచిస్తోంది.

అంతరిక్ష ప్రయాణాలు

బంగారం, ప్లాటినం, వెండి, నికెల్‌, కోబాల్ట్‌ వంటి విలువైన ఖనిజాలు ఉన్న గ్రహ శకలాలు అంతరిక్షంలో దాదాపు 3,000 వరకు ఉన్నాయి. వాటి మీదకు వ్యోమనౌకలను పంపి తవ్వకాలు జరపడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇవి భవిష్యత్తులో మరింత ఊపందుకొంటాయి. కొన్ని గ్రహ శకలాల్లోనైతే నీరు, మంచు కూడా ఉన్నాయి. ఈ నీటిని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌గా విడగొట్టి అంతరిక్ష రాకెట్లకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. భూమి నుంచి ఇతర గ్రహాలకు ప్రయాణించే వ్యోమ నౌకలకు ఈ గ్రహశకలాలు ఇంధనం నింపే కేంద్రాలుగా ఉపకరిస్తాయి. ప్రస్తుతం భూమి మీద పర్యాటక రంగ విలువ 10 లక్షల కోట్ల డాలర్లని అంచనా. ఇది అమెరికా జీడీపీలో సగానికి సమానం. రేపు పర్యాటక రంగం రోదసిలోకీ విస్తరిస్తుంది. వర్జిన్‌, అమెజాన్‌ సంస్థలు దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష ప్రయాణాలు ప్రారంభించాయి. అంతరిక్ష పర్యాటకుల కోసం రోదసిలో హోటళ్లు, విహార యాత్రలు ఊపందుకొంటాయి. ప్రభుత్వాల మధ్య, ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ, సహకారాలు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదుతాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అంతరిక్షంలోకీ విస్తరించాలి.

భారత్‌ మేలుకోవాలి

అంతరిక్షంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా భారత్‌ తన జీడీపీని ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవచ్చు. దీనికోసం మన యువతరాన్ని సిద్ధం చేయాలి. మన పాఠ్య ప్రణాళికల్లో అంతరిక్ష విజ్ఞాన కోర్సును ప్రవేశపెట్టాలి. అసలు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోనే ఖగోళ, అంతరిక్ష సైన్సులపై కనీసం ఒక పాఠాన్నైనా బోధించాలి. దీనివల్ల బాల్యం నుంచే అంతరిక్షంపై ఆసక్తి పెరుగుతుంది. అయిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం మన పాఠశాలల్లో ఖగోళ ప్రయోగశాలలను ఏర్పాటుచేయాలి. వాటిలో టెలిస్కోపులు అందుబాటులో ఉంచి సౌర కుటుంబ పరిశీలనకు వీలు కల్పించాలి. ఇలా బాల్యంలో నాటిన ఆసక్తి బీజం రేపు యౌవనదశలో మహా వృక్షమై దేశానికి సిరులు కురిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.