ETV Bharat / opinion

క్వాడ్‌ కొత్త కూటమి.. భారత్‌కు బలిమి!

author img

By

Published : Oct 20, 2021, 5:41 AM IST

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఈ మేరకు అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్ మంత్రులతో సమావేశమయ్యారు.ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయాల్లో పరస్పర సహకారంపై చర్చలు సాగించారు.

jaishankar
జైశంకర్

పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి (క్వాడ్‌) అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామాత్యులు ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్‌ లాపిడ్‌తో కలిసి అమెరికా, యూఏఈ సచివులు ఆంటొనీ బ్లింకెన్‌, అబ్దుల్లా బిన్‌ జాయేద్‌లతో వర్చువల్‌గా సమావేశమైన జైశంకర్‌- ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయాల్లో పరస్పర సహకారంపై చర్చలు సాగించారు. వాతావరణ మార్పులు, ఇంధన సహకారం, సముద్ర భద్రతలపై దృష్టిసారించిన ఆ నలుగురు- ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ దిశగా సమష్టి కృషికి పిలుపిచ్చారు. అంతకు మునుపు యూయిర్‌ లాపిడ్‌తో జైశంకర్‌ భేటీలో ప్రధానాంశాలెన్నో చర్చకు వచ్చాయి. పదేళ్లుగా సంప్రదింపుల దశలోనే మగ్గిపోతున్న స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని 2022 జూన్‌కల్లా కొలిక్కి తీసుకురావాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో పరస్పర సహకారంపైనా ఆశాజనక చర్చలు చోటుచేసుకున్నాయి. 1992లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య విలువ కేవలం 20 కోట్ల డాలర్లు! రెండింటి నడుమ పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు నెలకొన్న తరవాత మూడు దశాబ్దాల్లో అది 414 కోట్ల డాలర్లకు పైగా ఎగబాకింది. భద్రతా రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు పారిశ్రామిక పరిశోధనలు, సాంకేతిక సృజనలు, వైద్యారోగ్య అంశాల్లో ఉభయతారకమైన ఒప్పందాలెన్నో లోగడ సాకారమయ్యాయి. ఇండియాతో తమ అనుబంధానికి ఆకాశమే హద్దు అని ఇజ్రాయెల్‌ పూర్వ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అభివర్ణించారు. ఆయన హయాములో బలపడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠీకరించే లక్ష్యంతో జైశంకర్‌ తాజా పర్యటన చేపట్టారు. నాఫ్తాలి బెన్నెట్‌ నేతృత్వంలో టెల్‌ అవీవ్‌లో కొలువుతీరిన నూతన ప్రభుత్వం ఆయనను సాదరంగా స్వాగతించింది. పశ్చిమాసియాలో ఇండియా కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించింది. అమెరికా మార్గదర్శకత్వంలో నిరుడు సయోధ్య బాటపట్టిన ఇజ్రాయెల్‌, యూఏఈలతో ఈ చెలిమి- భారత్‌కు నిస్సందేహంగా కలిసి వచ్చేదే!

పాలకుల దార్శనికతే పెట్టుబడిగా ఎడారి నేలలో అభివృద్ధి ఫలాలను పండించిన స్ఫూర్తిదాయక చరిత్ర యూఏఈ సొంతం. 34లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులకు కర్మభూమి అయిన ఆ దేశంతో ఇండియాది చిరకాల అనుబంధం!

దేశీయ ఇంధన అవసరాలను తీర్చడంలో కలిసి రావాల్సిన యూఏఈ- ఎగుమతులు, దిగుమతుల పరంగానూ భారత్‌తో దృఢతర బంధాన్ని అభిలషిస్తోంది. సేవ, సముద్ర రవాణా, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో 1100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులతో భారతావని ప్రగతి ప్రస్థానంలో ఆ అరబ్‌ దేశం ప్రధానపాత్ర పోషిస్తోంది. ఇండియా, ఇజ్రాయెల్‌, యూఏఈ త్రైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 11వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా! మూడు దేశాల మిత్రత్వంతో కృత్రిమమేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌డేటాలతో పాటు ఇతర సాంకేతిక, సమాచార రంగాలు, ఆరోగ్యసేవలు తదితరాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కే అవకాశాలున్నాయి! అటు కశ్మీరంలో నెత్తుటి నెగళ్లు రాజేయడానికి పాకిస్థాన్‌ కుటిల యత్నాలు చేస్తోంది. దానికి వంతపాడుతూ అంతర్జాతీయ వేదికలపై టర్కీ అవాకులు చెవాకులు పేలుతోంది.

చైనాతో ఇరాన్‌ దోస్తీ సైతం భారత్‌కు ఇబ్బందికరమవుతోంది. ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి కొత్త క్వాడ్‌- ఇండియాకు కచ్చితంగా అక్కరకొస్తుంది. భాగస్వామ్య పక్షాల క్రియాశీలక చొరవతో కూటమి బలోపేతమైతే- పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాలకు బాటలు పడతాయి. ఆ క్రమంలో అరబ్‌ దేశాల్లోకెల్లా ఆర్థికంగా మేరునగమైన సౌదీ అరేబియాతో ఇతోధిక సమన్వయ సాధనలో భారత్‌ నెగ్గుకురావాలి!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.