సంక్షోభాల సంద్రంలో చుక్కాని కరవైన కాంగ్రెస్

author img

By

Published : Aug 28, 2022, 9:08 AM IST

congress crisis india

అసలు కాంగ్రెస్‌లో నెహ్రూ కుటుంబీకులు తప్ప వేరే నాయకులు లేరు. సారథ్యం వహించగల సమర్థులూ కరవయ్యారు. ఈ నేపథ్యంలో ఇతర నేత పార్టీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైనా అతడు లేదా ఆమె స్వేచ్ఛగా ఏ పనీ చేపట్టలేరు. తమదైన పంథాలో కాంగ్రెస్‌ను మళ్ళీ బలోపేతం చేయలేరు.

Congress leadership crisis : కాంగ్రెస్‌ పార్టీ కష్టాలకు అంతే లేనట్లుంది. తాజాగా గులాంనబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ను వీడినా దానివల్ల ఆ పార్టీ ఎన్నికల అవకాశాలు కొత్తగా దెబ్బతినేదేమీ ఉండదు. అయినా సరే అంపశయ్య మీదున్న కాంగ్రెస్‌ ప్రతిష్ఠకు ఇది విఘాతమే. సోనియా కుటుంబేతరుడిని కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయడమనే నాటకాన్ని ఈమధ్య చేపట్టినా, దాన్ని అర్ధాంతరంగా నిలిపి, సోనియా గాంధీ విదేశాలకు పయనమై వెళ్ళారు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఇటలీలో అస్వస్థురాలైన తన తల్లిని పరామర్శించడానికీ సోనియా విదేశీ యాత్ర చేపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడంతో సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయినా పార్టీపై రాహుల్‌, ఆయన అంతేవాసుల పెత్తనమే కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో సోనియా కుటుంబ సభ్యులకు బదులు వేరే వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నా అద్భుతాలేమీ జరిగిపోవు. అసలు కాంగ్రెస్‌లో నెహ్రూ కుటుంబీకులు తప్ప వేరే నాయకులు లేరు. సారథ్యం వహించగల సమర్థులూ కరవయ్యారు. ఈ నేపథ్యంలో ఇతర నేత పార్టీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైనా అతడు లేదా ఆమె స్వేచ్ఛగా ఏ పనీ చేపట్టలేరు. తమదైన పంథాలో కాంగ్రెస్‌ను మళ్ళీ బలోపేతం చేయలేరు.

అంతర్గత ప్రజాస్వామ్యం మృగ్యం
ఆది నుంచీ హస్తం పార్టీలో బలమైన నాయకత్వం లేకుండా నెహ్రూ కుటుంబం జాగ్రత్త పడటం వల్ల, తిరిగి ప్రజాదరణను కూడగట్టగల నాయకులు లేకుండా పోయారు. అయినా, కుటుంబేతరుడికి పార్టీ పగ్గాలు అప్పజెబుతామనడం వట్టి ప్రహసనం తప్ప మరేమీ కాదు. బయటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ అది పనికిరాదు. అలాంటి వ్యక్తి పేరుకే పార్టీ అధ్యక్షుడవుతారు, వెనక నుంచి సోనియా కుటుంబమే చక్రం తిప్పుతుంది.

కాంగ్రెస్‌ నాయకత్వంపై గులాంనబీ ఆజాద్‌ ప్రకటించిన ఛార్జిషీట్‌లో ఈ అంశాలనే నొక్కిచెప్పారు. ఆజాద్‌ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలా హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్‌ అధిష్ఠానం సహజంగానే నిందిస్తుంది. పార్టీ తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదనే నిరాశ ఆయనకు ఉండటమూ సహజమే. మూడు తరాల నెహ్రూ-గాంధీ కుటుంబానికి సేవలు అందించానంటూ ఆజాద్‌ వాపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ ప్రస్తుత దుస్థితికి ఆ కుటుంబ నాయకత్వ వైఫల్యమే కారణమని ఆజాద్‌ విమర్శించడాన్ని తప్పుపట్టలేం. కాంగ్రెస్‌ పూర్తిగా నాశనం కావడానికి రాహుల్‌ గాంధీలో స్థిర చిత్తం లోపించడమే కారణమని, వేరే వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించినా కేవలం కీలుబొమ్మలా మిగులుతారని ఆజాద్‌ తన రాజీనామా లేఖలో వ్యాఖ్యానించారు.

పార్టీ పగ్గాలు చేపట్టాలనే ఆసక్తి, ఉత్సాహం రాహుల్‌లో లేవని జగమంతటికీ తెలిసిపోయింది. పార్టీ లోటుపాట్లపై అవగాహన పెంచుకొని వాటిని సరిదిద్దడానికి పూర్తి శ్రద్ధాసక్తులను కేటాయించే ఓపిక, తీరిక ఆయనకు లేకుండా పోయాయి. కాబట్టి కాంగ్రెస్‌ దురవస్థ రాహుల్‌ స్వయంకృతమేనని తేలిపోతోంది. అయినా, సోనియా పుత్ర ప్రేమ రాహుల్‌ను బలవంతంగా పార్టీలోకి లాక్కొస్తోంది. తమ వంశాంకురమే కాంగ్రెస్‌ సింహాసనం అధిష్ఠించాలని, పార్టీపై తరతరాలు తమ ఆధిపత్యమే కొనసాగాలని సోనియా ఉబలాటపడటం కాంగ్రెస్‌కు చేటుతెచ్చింది. పతనం అంచున ఊగిసలాడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ను తక్షణమే పునరుత్తేజితం చేయాల్సి ఉంది. అయినా నామమాత్ర అధ్యక్షుడిని ముందుపెట్టి, వెనకనుంచి వ్యవహారం నడిపించాలని చూడటం సోనియా కుటుంబం చేస్తున్న అతి పెద్ద పొరపాటు. దానివల్ల ఆ పార్టీ మళ్ళీ కోలుకోవడం కష్టం. సోనియా, రాహుల్‌ అస్తవ్యస్త విధానాలు కాంగ్రెస్‌కు వినాశం తెచ్చిపెడితే భాజపాకన్నా సంతోషించేవారు మరెవరూ ఉండరు.

ప్రతిపక్ష బాధ్యతల్లో విఫలం
ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయకుండా కాపాడటానికి, ప్రభుత్వ తప్పులను పట్టిచూపి గాడిన పెట్టడానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్‌ ఆ బాధ్యతను తీసుకోవడం లేదు. బలీయ ప్రతిపక్షంగా ఎదగాలన్న స్పృహే కనిపించడం లేదు. అలాంటి సంకల్పమే ఉంటే- ప్రత్యామ్నాయ ఆర్థిక అజెండాతో ముందుకొచ్చి ఉండేది. పౌర హక్కులు, లౌకికవాద సంరక్షణకు పటిష్ఠమైన విధానాలను ప్రకటించి అందరినీ తనతో కలుపుకొని పోయేది. పార్లమెంటు లోపల, వెలుపల ప్రతిపక్ష బాధ్యతలను నిర్వహించడంలో కాంగ్రెస్‌ విఫలమవుతోందన్నది చేదు వాస్తవం. నిస్తేజం, నిష్క్రియల నుంచి బయటపడటానికన్నట్లు కాంగ్రెస్‌ సెప్టెంబరు ఏడున భారత్‌ జోడో యాత్రను మొదలుపెడతానని ప్రకటించింది. నాయకత్వ లేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌ వెంట ఈ యాత్రలో నడిచేవారెవరనేది ప్రశ్న. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార యంత్రాంగాల జోక్యంతో కొంత అట్టహాసం కనిపించవచ్చు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాహుల్‌ ఈ యాత్రను విజయవంతం చేస్తారనే నమ్మకం అంతంతమాత్రమే. యాత్రలో పాల్గొనవలసిందిగా 110కి పైగా పౌర సంస్థలను రాహుల్‌ ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అటు కాంగ్రెస్‌ను, ఇటు పౌర సంస్థలను నిర్వీర్యపరచడంతో ఉభయులూ ఒక్క వేదిక మీదకు వస్తున్నట్లుంది. అయితే, ఆజాద్‌ పేర్కొన్నట్లుగా భారత్‌ జోడో యాత్రకన్నా ముందు కాంగ్రెస్‌ జోడో యాత్రను చేపట్టి ఉండాల్సింది. ప్రతిపక్షాలను కలుపుకొని ఉంటే పెద్దయెత్తున జనసమీకరణ సాధ్యమై జోడో యాత్రకు ఊపు వచ్చేది. ఆ పని చేయకపోవడం ద్వారా రాహుల్‌ తనకు నాయకత్వ లక్షణాలు లేవని బయటపెట్టుకున్నారు. భారత్‌ జోడో యాత్ర జనంలేక బోసిపోతే కాంగ్రెస్‌కు మరింతమంది నాయకులు రాజీనామా చేయవచ్చు. వరస కష్టాల్లో ఉన్న హస్తం పార్టీకి అది ఏమాత్రం మేలు చేయదు.

ప్రజాదరణకు దూరం
రాష్ట్రాల్లో బలమైన నాయకులను ఇందిరాగాంధీ సహించేవారు కారు. ఫలితంగా ప్రతి చిన్నదానికీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఆధారపడాల్సి వచ్చేది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నా ఇందిరాగాంధీయే దిక్కయ్యేవారు. పెత్తనమంతా కేంద్ర నాయకుల చేతుల్లో ఉండేది. ముఖ్యమంత్రుల పేర్లను సీల్డ్‌కవర్లలో పంపే సంస్కృతి కాంగ్రెస్‌లో పెరిగిపోయింది. రాష్ట్రాల లెజిస్లేచర్‌ పార్టీల్లో, మంత్రివర్గంలో నియామకాలు అధిష్ఠానం కనుసన్నల్లో జరిగేవి. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొద్దో గొప్పో సొంత బలం ఉన్న అశోక్‌ గెహ్లోత్‌ సైతం సోనియా కుటుంబ పెత్తనాన్ని కాదని ఒక్క నిమిషమూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేరు. నెహ్రూ కుటుంబం కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులను మరుగుజ్జుల స్థాయికి కుదించి, యంత్రాంగాన్ని పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం వల్లనే పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. ప్రజాదరణనూ కోల్పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.