ETV Bharat / opinion

సఫాయీ కర్మచారీల బతుకు చిత్రం మారేదెన్నడు?

author img

By

Published : Sep 17, 2020, 6:51 AM IST

మలమూత్రాలను ఎత్తిపోసే పనిని విడనాడాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్‌ పిలుపునిచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. నేటికీ భారతదేశంలో ఎన్నోచోట్ల మానవ మలమూత్రాలను మనుషులే శుభ్రం చేసే పద్ధతి కొనసాగుతోంది. దీని నిర్మూలనకు తెచ్చిన చట్టాలు చట్టుబండలవుతున్నాయి. ఏటా వందల మంది మరణిస్తున్నారు.

safayi
సఫాయీ కర్మచారీ

"మానవ విసర్జితాలను సాటి మనుషులే ఎత్తిపోసే పని అత్యంత దుర్భరమైనది, అమానవీయమైనది. ఈ వృత్తితో మీరు సమాజానికి సేవ చేస్తున్నారంటూ చెప్పే మెచ్చుకోలు మాటలు నమ్మొద్దు" అంటూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దశాబ్దాల కిందటే హెచ్చరించారు. ఈ వృత్తిని తక్షణం బహిష్కరించాలంటూ "భాంగీ... జాడూ చోడో (పారిశుద్ధ్య కార్మికుడా... చీపురు వదిలేయ్‌)" అని నినదించారు. ఇలాంటి హీనమైన వృత్తిని గొప్పగా చూపవద్దని ఆయన హెచ్చరించారు.

అంబేడ్కర్‌ ఆ మాటలు అన్నాక దశాబ్దాలు గడిచిపోయాయి. నేటికీ భారతదేశంలో ఎన్నోచోట్ల మానవ మలమూత్రాలను మనుషులే శుభ్రం చేసే పద్ధతి కొనసాగుతోంది. దీని నిర్మూలనకు తెచ్చిన చట్టాలు చట్టుబండలవుతున్నాయి. మానవ విసర్జితాలను శుభ్రం చేయడానికి మనుషులను వినియోగించడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 2013లో చట్టం చేసింది. అది ఇప్పటికీ బాలారిష్టాలను దాటలేదు.

ఆ చట్టానికి మరింత పదునుపెట్టేలా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరైనా మానవ విసర్జితాలను మనుషులతో శుభ్రం చేయిస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష లేదా అయిదు లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఇది సరిపోవడం లేదని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం శిక్ష, జరిమానాలను మరింత పెంచాలని కొత్త బిల్లులో ప్రతిపాదించింది.

ప్రాణాలు పోతున్నా...

మానవ విసర్జితాలను ఎత్తిపోసే పనికి సమాజంలో అణగారిన వర్గాలవారినే ఉపయోగించేవారు. తదనంతర కాలంలో మలమూత్రశాలల నిర్మాణంలో మార్పులు వచ్చినా వీరి జీవన స్థితిగతులేమీ మారలేదు. సెప్టిక్‌ ట్యాంకులు, మురుగుకాలువలు, మ్యాన్‌హోళ్లలో దిగి శుభ్రం చేయడం లాంటి పనులన్నీ వీరికి వారసత్వంగా సంక్రమించినట్లయింది. ఈ పనుల్లో ఇప్పటికే ఏటా వందలమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సభ్యసమాజానికి సిగ్గుచేటు. 2019లో ఈ పనుల్లో నిమగ్నమై 119 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో ప్రకటించింది. 2016 నుంచి 2019 నవంబరు వరకు దేశవ్యాప్తంగా 282 మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ ఘటనల్లో చనిపోయారని కేంద్రం ప్రకటించింది.

ఇవన్నీ పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదయిన అంకెలు మాత్రమేనని, ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారు ఇంతకు ఎన్నో రెట్లు ఉంటారని స్వచ్ఛంద సంస్థ సఫాయి కర్మచారీ ఆందోళన్‌ (ఎస్‌కేఏ) ఆరోపిస్తోంది. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ సఫాయీ కర్మచారీ (ఎన్‌సీఎస్‌కే) 2017 జనవరి నుంచి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా సెప్టిక్‌ ట్యాంకులు, మురుగుకాలువలు, మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేసే పనిలో 127 మంది చనిపోయారని ప్రకటించింది. అదే సమయంలో ఒక్క జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోనే 429 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని సఫాయీ కర్మచారీ ఆందోళన్‌ లెక్క కట్టింది.

వాస్తవానికి 2013 కంటే ఇరవై ఏళ్ల ముందే 1993లో ‘మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ డ్రై లెట్రిన్స్‌ (ప్రొహిబిషన్‌)’ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, రాష్ట్రాలు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. 2013 నాటి చట్టంలోనూ ఈ వృత్తిని నిర్మూలిస్తే దీనిలో పనిచేసేవారికి ఎలాంటి పునరావాసం కల్పించాలన్నదానిపై సరైన దిశానిర్దేశం లేదని సఫాయీ కర్మచారీ ఆందోళన్‌ కన్వీనర్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత విల్సన్‌ బెజవాడ చెబుతున్నారు. 2013లో చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ వృత్తిని పూర్తిగా నిర్మూలించి, ఇందులో ఉన్న కార్మికులకు పునరావాసం కల్పించడానికి రూ.4,825 కోట్లు అవసరమవుతాయని, అది కూడా చట్టం అమలులోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఆ మొత్తాన్ని ఖర్చుపెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ నిధిని సమకూర్చడంలో వైఫల్యం- చట్టం వచ్చి ఏడేళ్లు దాటినా కార్యాచరణ లోపించడానికి ప్రధానకారణంగా మారింది.

కార్యాచరణే ప్రధానం

నీతిఆయోగ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 170 జిల్లాల్లో 54,130 మంది ఈ వృత్తిలో ఉన్నారని లెక్కతేలినట్లు సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్‌ అథవాలే గతేడాది ఆగస్టులో రాజ్యసభలో ప్రకటించారు. వాస్తవానికి ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని ఈ వృత్తి నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మనుషులే శుభ్రం చేసే మలమూత్రశాలలు 21 లక్షలున్నాయని తేల్చడం దీనికో నిదర్శనం! 1992లో 5.88 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారని 2002-03 నాటికి ఆ సంఖ్య 6.76 లక్షలకు చేరిందని సామాజిక న్యాయశాఖే లెక్కలు చెప్పింది. ఆ తరవాతి సంవత్సరాల్లో వారి సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరిందని తెలిపింది.

ఇప్పటికే ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థలను ఆధునికీకరించడం, మానవ వ్యర్థాల శుద్ధి, రవాణా వంటివన్నీ పూర్తిగా యంత్రాలతోనే చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలన్నది ప్రభుత్వ యోచన. ఇందుకోసం స్థానిక సంస్థలను సిద్ధం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడాన్ని ఉద్యమంలా చేపట్టాలి. ఇందుకోసం ఈ పార్లమెంటు సమావేశాల్లో పెట్టే సవరణ చట్టాన్నయినా పదునైనదిగా రూపొందించడమే కాదు- పక్కా కార్యాచరణ తయారుచేసి అమలు చేయాలి. నోటిమాటలతో కాదు- నిధులు వెచ్చించి వారి జీవితాలను వధ్యశిలపై నుంచి కొత్త వెలుగుల వైపు నడిపించాలి.

(రచయిత- శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.