ETV Bharat / opinion

Parliament Special Session History : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చరిత్ర ఏం చెబుతోంది?.. అదే అజెండానా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 8:03 AM IST

Updated : Sep 18, 2023, 8:38 AM IST

Parliament Special Session History : సోమవారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నిసార్లు పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఎందుకు జరిగాయో తెలుసుకుందాం.

parliament-special-session-history-analysis-on-special-parliament-sessions
parliament-special-session-history-analysis-on-special-parliament-sessions

Parliament Special Session History : గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎన్నో ఊహాగానాలు..
ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలపై ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. తొలుత ఎజెండా గురించి ప్రకటనలేమీ లేకపోవడం వల్ల సోనియా గాంధే స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. దీంతో గత బుధవారం తాత్కాలిక ఎజెండాను ప్రకటించింది కేంద్రం. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. వీటిని ప్రధాన ప్రతిపక్షం ఏ మాత్రం నమ్మడం లేదు. చివరి నిమిషంలో ఏవో బాంబులను పేల్చే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తోంది.

  • గతంలో సమావేశాలకు కొన్ని రోజుల ముందుగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎజెండాను వివరించడం ఆనవాయితీగా ఉంది. కానీ ఈసారి 18వ తేదీన సమావేశాలుంటే 17నే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం.
  • పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను సాధారణంగా జాతీయ ప్రాధాన్యమున్న కార్యక్రమాలకు, మైలురాళ్ల సాధన సమయంలో నిర్వహిస్తారు.
  • 2008లో మన్మోహన్‌ ప్రభుత్వానికి లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బల నిరూపణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఒక్క రోజు ఏర్పాటు చేశారు.
  • జీఎస్టీ బిల్లుకు ఆమోదం కోసం 2017లో మోదీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
  • రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి రెండు సార్లు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక క్యాలెండర్‌ ఏమీ లేదు..
పార్లమెంటు సమావేశాలకు ప్రత్యేక క్యాలెండర్‌ అంటూ ఏమీ లేదు. లోక్‌సభ కమిటీ 1955లో బడ్జెట్‌ సమావేశాలకు తేదీలను సూచించింది. ఫిబ్రవరి 1నుంచి మే 7వ తేదీ మధ్యలో వీటిని నిర్వహించాలని తెలిపింది. వర్షాకాల సమావేశాలను జులై 15, సెప్టెంబరు 15 మధ్య నిర్వహించాలని పేర్కొంది. శీతాకాల సమావేశాలను నవంబరు 5 నుంచి గానీ, దీపావళి ముగిసిన నాలుగో రోజు నుంచి గానీ ప్రారంభించాలని సూచించింది. డిసెంబరు 22లోగా ముగించాలని వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం రెండు పార్లమెంటు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు.

జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లోనే..
ఈ సమావేశాలను జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లో నిర్వహిస్తుంటారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఇందులో వదిలేస్తారు. అత్యవసర పరిస్థితిని నిర్వచించే ఆర్టికల్‌ 352.. సభ ప్రత్యేక భేటీకి అవకాశం కల్పిస్తుంది.

ప్రత్యేక సమావేశాలంటే..
కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి రాజ్యాంగం అధికారమిచ్చింది. ప్రత్యేక సమావేశాలపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పేరుతో ఎంపీలకు ఆహ్వానం అందుతుంది. అయితే 'ప్రత్యేక సెషన్‌' అని రాజ్యాంగంలో ఏమీ లేదు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85(1) ప్రకారం.. ఈ సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు.

7 సార్లు..
ఇప్పటిదాకా ఏడు సార్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. వీటిల్లో మూడు జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లో నిర్వహించినవి. మరో రెండు రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. మిగిలిన వాటిలో ఒకటి విశ్వాస పరీక్షకు, ఇంకోటి జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఏర్పాటు చేసినవి.

  1. 1977: నాగాలాండ్‌, తమిళనాడులలో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు రాజ్యసభ ప్రత్యేకంగా సమావేశమైంది.
  2. 1991: హరియాణాలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రెండు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
  3. 1992: క్విట్‌ ఇండియా ఉద్యమ 50వ దినోత్సవం కోసం ఆగస్టు 9న అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరిగింది.
  4. 1997: భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల కోసం ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 దాకా సమావేశాలు జరిగాయి.
  5. 2008: లెఫ్ట్‌ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల విశ్వాస పరీక్ష కోసం మన్మోహన్‌ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
  6. 2015: 125వ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల కోసం సభ ప్రత్యేకంగా సమావేశమైంది.
  7. 2017: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అర్ధరాత్రి పార్లమెంట్​ సమావేశం జరిగింది.

History of Parliament House of India : 75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్ర.. తగ్గుతున్న యువతరం.. పెరిగిన మహిళా బలం..

Vishwakarma Scheme 2023 : 'విశ్వకర్మ' స్కీమ్​.. వారికి రూ.2లక్షల లోన్​.. రోజుకు రూ.500తో శిక్షణ.. అర్హులెవరంటే?

Last Updated :Sep 18, 2023, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.