ETV Bharat / opinion

మానసికారోగ్యం.. మంచి సమాజానికి సోపానం

author img

By

Published : Oct 10, 2022, 7:53 AM IST

Mental health day 2022 India : నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మానవులు తమ శక్తిసామర్థ్యాలను గుర్తెరిగి, సమస్యలను పరిష్కరించుకొంటూ ఉత్పాదకతలో భాగస్వాములైనప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లని నిపుణులు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భారత్‌లో వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వైద్య సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది.

mental health day 2022 india
మానసికారోగ్యం.. మంచి సమాజానికి సోపానం

Mental health day 2022 slogan : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది వెంటనే చికిత్స అవసరమైన మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారికంగా ప్రకటించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 25శాతాన్ని స్వల్ప స్థాయి నుంచి తీవ్రమైన మానసిక సమస్యలు వేధిస్తున్నాయని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో డబ్ల్యూహెచ్‌ఓ ఏటా అక్టోబర్‌ పదో తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'అందరికీ మానసిక ఆరోగ్యం - ప్రపంచ ప్రాధాన్యం' అనే అంశాన్ని ఈ ఏటి నినాదంగా ప్రకటించింది.

చికిత్సకు దూరంగా..
భారతదేశ జనాభాలో 7.5శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, కొవిడ్‌ అనంతరం ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. 'జాతీయ మానసిక ఆరోగ్య సర్వే-2016' ప్రకారం ఇండియాలో 13 నుంచి 17 ఏళ్ల బాలల్లో 7.3శాతం మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మధ్య వయస్కులు, పట్టణాల్లో నివసించేవారు, చదువు లేనివారు, అల్పాదాయ వర్గాల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్నట్లు నిగ్గుతేలింది. మానసిక సమస్యలు ఉన్నట్లు బయటికి చెబితే సమాజం చులకనగా చూస్తుందన్న భయంతో ఈ లక్షణాలను చెప్పుకొనేందుకు, వైద్య సహాయం పొందడానికి చాలామంది జంకుతున్నారు. భారత్‌లో బలంగా పాతుకుపోయిన మూఢనమ్మకాలు సైతం ఎన్నో వర్గాల ప్రజలను ఆధునిక మానసిక చికిత్స వైపు వెళ్ళకుండా చేస్తున్నాయి. ఇప్పటికీ మన సమాజంలో చికిత్స కోసం వైద్యులను, నిపుణులను కాకుండా భూత వైద్యులను సంప్రదించేవారే అధికం.

ఆధునిక సమాచార ప్రసార యుగంలో సామాజిక మాధ్యమాలు సైతం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని హరించడంలో భాగమవుతున్నాయి. కొన్ని ముఠాలు పనిగట్టుకొని అవాస్తవాలను, ఉద్రిక్తతలు తలెత్తే సమాచారాలను పోస్ట్‌ చేస్తూ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకొనే సమాచారం సైతం అపారంగా అందుబాటులో ఉంది. దాన్ని వినియోగించుకోవడం అత్యావశ్యకం. స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు, యువకులు నిద్రలేమితో సతమతమవుతున్నారు. చదువుకు, కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని వెచ్చించకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు.

దేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందింపజేయడంలో అనేక స్వచ్ఛంద సేవాసంస్థలు కృషి చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక సాధనాలను అవి సమర్థంగా వినియోగిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల మానసిక చికిత్స అవసరాల కోసం 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశాయి. అవి విస్తారంగా సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం మానసిక ఆరోగ్య సంరక్షణకు పెద్దయెత్తున మొబైల్‌ యాప్‌లు రంగప్రవేశం చేశాయి. రోగులకు అద్భుతమైన సేవలను అవి అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సేవలను అందించే మొబైల్‌ యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైగా అందుబాటులో ఉన్నాయని 'అమెరికన్‌ సైకాలజీ అసోసియేషన్‌' వెల్లడించింది. నిపుణులతో నేరుగా మాట్లాడే, వీడియో కాల్‌ ద్వారా వైద్యులను సంప్రదించే సదుపాయాలను అవి కల్పిస్తున్నాయి.

ఉమ్మడి కార్యాచరణ అవసరం
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు 15మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో మాత్రం ప్రతి లక్ష జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలకు మానసికారోగ్య చికిత్సలనూ అనుసంధానించాల్సిన అవసరం ఉంది. వైద్య సేవల్లో నాణ్యత, అధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సరైన మందుల వాడకం తప్పనిసరి.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ప్రక్రియలో నిరంతర పరిశోధనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోగులు నేరుగా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా- ఆన్‌లైన్‌ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి టెలిమెడిసిన్‌ వంటి పద్ధతులను జోడించి ఆధునిక చికిత్సను అందరికీ అందుబాటులోకి తేవాలి. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారికి గ్రామస్థాయిలోనూ చికిత్స అందేలా మౌలిక వసతులను పెంచాలి. వైద్య సిబ్బందికి మానసిక ఆరోగ్య అంశాల్లో తగిన శిక్షణ అందించాలి. ఆరోగ్య బీమా పథకాల్లో మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తులు సంపూర్ణ మానసిక ఆరోగ్యంతో ఉన్నప్పుడే పరిణతి కలిగిన సమాజం సాకారమవుతుందని పాలకులు గ్రహించాలి. అందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో పనిచేయాలి.
- సీహెచ్‌.రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.