ETV Bharat / opinion

యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

author img

By

Published : Aug 30, 2020, 5:15 PM IST

ఎత్తైన కొండలు, మంచు ప్రాంతాలు ఉండే సరిహద్దుల్లో సైనికుల గస్తీ అంటే ఆషామాషీ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద సైనికదళం ఉన్న దేశాల్లో ఒకటైన భారత్​కూ అది ఓ సవాలే. ఎందుకంటే లద్దాఖ్​, లేహ్​, సియాచిన్​ ప్రాంతాల్లో గడ్డకట్టే చలిలో సైనికులు పనిచేస్తుంటారు. ఇక చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడకు వేల మంది సైనికులను తరలించింది భారత సైన్యం. దాదాపు రెండు లక్షల మందికిపైగా అక్కడ ఉన్నారు. మరి వారికి నిత్యావసరాలు అందించడం ఎంత కష్టమో తెలుసా..? సరైన రహదారి మార్గాలు లేక, మరోవైపు మంచు కష్టాలు ఎదుర్కొంటూ వారికి సదుపాయాలు అందించడం యుద్ధ తంత్రం కంటే ఎంతో క్లిష్టమైనది. ఓసారి అక్కడ జరిగే ప్రక్రియను తెలుసుకుందాం రండి..

LAC and the logistics required
భారత దళాల సత్తా.. యుద్ధమే కాదు అంతకుమించి

తూర్పు లద్దాఖ్​లో చైనా-భారత్​ మధ్య ఘర్షణ జరిగి 100 రోజులు పూర్తయినా.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. వివాదాస్పద ఫింగర్స్​ ప్రాంతంలో తిష్ఠవేసిన డ్రాగన్​ వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడం వల్ల.. దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు సత్ఫలితాలను ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో భారత్​ కూడా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ సుదీర్ఘ పోరులో భాగంగా శీతాకాలంలోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను ఉంచనుంది భారత్​. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటు ప్రజా పద్దుల సంఘానికి సమర్పించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్​ బిపిన్​ రావత్​. అయితే గడ్డకట్టిన మంచుకొండలు, తీవ్రమైన చలి ప్రాంతంలో బలగాలు అక్కడ ఉండటం చాలా కష్టమైన పని. వాటితో పాటు కొన్ని సమస్యలు కూడా భారత సైన్యానికి సవాల్​ విసురుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

శీతాకాలంతోనే ఓ యుద్ధం...

లద్దాఖ్​లో శీతాకాలంలో చలితీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సైనికులు శత్రువులతో కంటే గడ్డకట్టించే చలితోనే పెద్ద యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎత్తైన పర్వత ప్రాంతం కావడం వల్ల ఆక్సిజన్​ స్థాయిలు చాలా కనిష్ఠంగా ఉంటాయి. అంటే సరిగ్గా గాలి పీల్చుకొనే పరిస్థితి ఉండదు. అంతా మంచుతో నిండి ఉండటం వల్ల మంచినీరు తాగాలన్నా కష్టమే. హిమపాతం కారణంగా రహదారులు మూతపడి ప్రతి ఏడాది ఐదు లేదా ఆరు నెలలు లద్దాఖ్​ ప్రాంతం.. భారత్​లోని మిగతా భాగంతో సంబంధాలే కోల్పోతుంది. లద్దాఖ్​కు వెళ్లే రెండు దారులు(రోహ్తంగ్​, జోజి లా) శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పి ఉంటాయి.

శీతాకాలంలో సైనికుల కార్యకలాపాలకు చాలా ఇబ్బందులు ఉంటాయి. దానితో పాటు రహదారి మూసివేత వల్ల ఆ సమయంలో వారికి కనీస సదుపాయాలు సమకూర్చడం కూడా చాలా కష్టమే. ఇవన్నీ చేయడానికి ఉండే మిలటరీ ప్లానర్లు విపరీతమైన సవాళ్లు ఎదుర్కొంటారు. అందుకే తర్వాతి శీతాకాలం రాకముందే నిత్యావసరాలన్నింటినీ తెచ్చిపెడుతుంది భారత సైన్యం. దీన్ని అడ్వాన్స్ వింటర్ స్టాకింగ్ (ఏడబ్ల్యూఎస్​) అని పిలుస్తారు. ఈ సమయంలో చేసే సరకు తరలింపు సైన్యం చేపట్టే అతిపెద్ద ఎక్సర్​సైజ్​గా పేర్కొంటారు. రహదారులు మూసివేసి ఉండే ఆ ఆరు నెలల కోసం సైనికులకు అవసరమయ్యే ప్రతి వస్తువు సేకరణ నుంచి రవాణా చేయడం వరకు ఇందులో భాగంగా ఉంటాయి.

ఇలా సన్నాహాలు..

సాధారణంగా మంచు ఉండే ఈ ప్రాంతంలో బలగాలకు ఇబ్బందులు లేకుండా బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ రోడ్ల వెంబడి మంచు తొలగిస్తూ తీరిక లేకుండా ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మే నెలలో రహదారుల్లో ప్రయాణాలకు అనుమతిస్తారు. అప్పడు పఠాన్​కోట్​, జమ్మూలోని డిపోల నుంచి లద్దాఖ్​కు సరకు రావాణా మొదలవుతుంది. చలికాలానికి నెలల ముందే మొదలయ్యే ఈ తరలింపు ప్రక్రియ కఠినమైనది. టూత్ బ్రష్​, దుస్తులు,రేషన్​, ఇంధనం, మందులు, మందుగుండు సామగ్రి, సిమెంట్, గుడారాలు ఏర్పాటు చేసుకునే వస్తువులు సహా అన్నిరకాల నిత్యావసరాలు అక్కడకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

10 నుంచి 14 రోజుల ప్రయాణం...

జోజి లా మీదుగా లేహ్​కు వెళ్లి రావాలంటే 10 రోజులు పడుతుంది. అదే రోహ్తంగ్​ మార్గంలో వెళ్లొస్తే 14 రోజులు పడుతుంది. ఆ రవాణా సమయంలో డ్రైవర్లు రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు ఈ రెండు మార్గాల్లో రవాణా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈ రెండు వారాల ప్రయాణంలో ప్రతి రాత్రి ఒక డ్రైవర్ వేరు వేరు ప్రదేశాల్లో నిద్రిస్తాడు. ఈ యాత్ర పూర్తయ్యాక మళ్లీ రెండు రోజులు సెలవు ఉంటుంది. ఆ తర్వాత రెండో ట్రిప్​కు డైవర్లు సిద్ధం అవుతారు. అలా ఆరు నెలల పాటు వారు అటూ ఇటూ రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. ఒక్క సీజన్​లో ఒక వ్యక్తి దాదాపు 10 వేల కిలోమీటర్లు డ్రైవింగ్​ చేస్తాడు. కొండప్రాంతంలో జరిగే ఈ ప్రయాణం కోసం మిలటరీ ట్రాన్స్​పోర్ట్​తో పార్టు సివిల్ ట్రక్కులు, ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​కు చెందిన ఇంధన ట్యాంకర్లను అద్దెకు తీసుకొని వినియోగిస్తారు.

ఇది మరో యుద్ధం..

సరకులన్నీ లద్దాఖ్​ రావడం ఒక ఎత్తయితే.. వాటిని ఫార్వర్డ్​ పోస్టులకు తరలించడం అంతకుమించిన కష్టం. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కార్గిల్​ సెక్టార్​, సియాచిన్​ ప్రాంతాలకు వాహనాలు వెళ్లేందుకు అవకాశమే ఉండదు. పెద్ద పెద్ద వస్తువులను చిన్నవిగా ప్యాక్​ చేసి మోసుకెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు పెద్ద ట్యాంకర్​లోని ఇంధనాన్ని 20 లీటర్ల క్యాన్లలో నింపి ఆయా పోస్టులకు తరలిస్తారు.

స్థానికంగా ఉండే కూలీలు, గుర్రాల సేవలను వేల సంఖ్యలో సైన్యం వినియోగించుకుంటుంది. అక్కడి ఫార్వర్డ్​ దళాలకు వీరంతా ఓ జీవనరేఖ​ లాంటివాళ్లు. సైనిక విభాగం ఇందులో భాగస్వామ్యం వహిస్తూ ఉంటుంది. ఇక మాంసం కోసం జంతువులను తరలించే సిబ్బంది అయితే ఎత్తయిన కొండల్లో ప్రయాణిస్తారు. ఒక వ్యక్తి సీజన్​లో దాదాపు 1000 కిలోమీటర్లు నడుస్తాడు.

గడ్డకట్టే చలిలో నిర్మాణాలు..

శీతాకాలంలో నిర్మాణ పనులు చేసే అవకాశం ఉండదు కాబట్టి వేసవి కాలంలోనే సైనికుల ఆవాసాలను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తారు. చైనాతో ఉద్రిక్తతల వల్ల ఆయా ప్రాంతాల్లో భారీగా సైనికులను మొహరించారు. ఫలితంగా ఇప్పుడు ఎక్కువ స్థావరాలు కట్టాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి అదనపు దళాలకు స్థావరాల ఏర్పాటు ఈ ఏడాది అతిపెద్ద సవాలు కానుంది. సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా వాటిని నిర్మించాలి. అందుకోసం అవసరమయ్యే వస్తువుల సేకరణ, తరలింపు, తక్కువ సమయంలో వాటి నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్నది.

లక్షల మంది సైన్యం...

వస్తువుల తరలింపుతో పాటు దళాల తరలింపు ఓ పెద్ద యుద్ధ ప్రక్రియే. వేసవిలో దాదాపు 2 లక్షల మంది లద్దాఖ్​ నుంచి బయటకు వస్తే.. అంతే మంది పోస్టింగ్​లు, యూనిట్లకు తిరిగివెళ్తారు. ఇళ్లకు వెళ్లేవారు, వచ్చేవారికి రవాణా చాలా కష్టమైనది. అందుకే విమానం ప్రయాణంలో వెళ్లి, వచ్చే సైనికుల కోసం దిల్లీ, చంఢీగఢ్​లో ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

ఈ ప్రాంతంలో భారత వైమానిక దళ పాత్ర చాలా అమూల్యమైనది. చంఢీగఢ్​​ వైమానిక స్థావరంలో తెల్లవారుజాము నుంచే వైమానిక దళాలు పనులు ప్రారంభిస్తాయి. లద్దాఖ్​కు సరకు తరలింపు, అత్యవసర వస్తువులను తీసుకెళ్లడం, సెలవు నుంచి తిరిగి వచ్చే దళాలను స్థావరాలకు చేర్చడం వంటి పనులు చేస్తుంటాయి.

లేహ్ ఎయిర్‌ఫీల్డ్, సియాచిన్ బేస్ క్యాంప్​లకు.. ఎమ్​ఐ-17, ధ్రువ్, చిరుత హెలికాప్టర్లు సేవలందిస్తూ ఉంటాయి. సియాచిన్ సెక్టార్‌లోని సుదూర పోస్టులకు ఇవే సరకులను తీసుకువెళ్తాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎగిరే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు అక్కడి వైమానికదళ అధికారులు. ఏడాది పొడవునా భారత వాయిదళం సరకు రవాణాలో మద్దతుగా ఉంటుంది. ఇక శీతాకాలంలో రోడ్లన్నీ మంచుతో కప్పి ఉండటం వల్ల లద్దాఖ్​ను కలిపే ఏకైక రవాణా సదుపాయం వాయు మార్గం మాత్రమే.

ఏడబ్ల్యూఎస్​ అనేది ఒక ప్రణాళికతో కూడిన ఎక్స్​రైసైజ్​. మే నెలలో మొదలయ్యే ఈ తరలింపు ప్రక్రియ.. నవంబర్​ నాటికి పూర్తవుతుంది. అయితే నార్తర్న్​ కమాండ్​, లేహ్​ వద్ద ఈ ఏడాది భద్రతా దళాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఇదంతా ఓ యుద్ధప్రక్రియే. సైన్యం, వైమానిక దళాలు ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తాయి. ఎందుకంటే అక్కడ పనిచేసే అధికారులు సైన్యానికి గుండెకాయ లాంటివాళ్లు.

(రచయిత- లెఫ్టినెంట్​ జనరల్​ డీఎస్​ హుడా, నార్తర్న్​ కమాండ్​ మాజీ చీఫ్​, 2016 సర్టికల్​ స్ట్రైక్​కు సారథ్యం వహించిన అధికారి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.