వలస వేదన: శ్రామికుల్ని ఆదుకోలేమా?

author img

By

Published : May 25, 2020, 7:05 AM IST

IMPACT OF LOCK DOWN ON MIGRANT LABOURER
వలస శ్రామికుల్ని ఆదుకోలేమా? ()

'కరోనా వైరస్‌ చాలదన్నట్లు అంతకు మించి ప్రభుత్వం మమ్మల్ని చావకొడుతోంది' అంటూ కన్నీటి పర్యంతమైన వలస కార్మికుల ఆవేదనలకు స్పందించి ఈ నెలారంభం నుంచి శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను కేంద్రం నడుపుతోంది. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలూ లేకున్నా కాళ్లనే నమ్ముకొని వందల మైళ్లు నడవడానికి సిద్ధపడిన అభాగ్యులెందరినో రోడ్డు ప్రమాదాలు కర్కశంగా బలిగొన్నాయి.

రెండు నెలల లాక్‌డౌన్‌ వలస జీవుల పాలిట పిడుగుపాటై మానవ మహా విషాద చరిత్రను రక్తాశ్రువులతో లిఖిస్తోంది. కరోనా మహమ్మారి కట్టడే ఏకైక లక్ష్యంగా ఎక్కడి వారిని అక్కడే ఉంచాలంటూ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చి చివరి వారంలోనే ఆదేశించినా.. సొంత ఊళ్లో అయినవాళ్ల బాగోగులపై బెంగతో లక్షలాది వలస కూలీల మహా పాదయాత్ర మొదలైంది. 'కరోనా వైరస్‌ చాలదన్నట్లు అంతకు మించి ప్రభుత్వం మమ్మల్ని చావకొడుతోంది' (కరోనా నా మార్‌ రహీ హై జో ఊపర్‌ సే సర్కార్‌ మార్‌ దాలేగి) అంటూ కన్నీటి పర్యంతమైన వలస కార్మికుల ఆవేదనలకు స్పందించి ఈ నెలారంభం నుంచి శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను కేంద్రం నడుపుతోంది. తొలి మూడు వారాల్లో 35 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చామని, బస్సుల ద్వారా మరో 40 లక్షల మంది స్వరాష్ట్రాలకు చేరారంటున్న కేంద్రం.. వచ్చే పదిరోజుల్లో మరో 2,600 రైళ్లు నడిపి ఇంకో 36 లక్షల మందిని ఆయా రాష్ట్రాలకు చేరవేసే కార్యాచరణ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య అర్థవంతమైన సమన్వయం ఉండాలని, పిన్నలు, పెద్దలు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రయాణికుల పారిశుద్ధ్యం, ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ.. పాటించాల్సిన ప్రామాణికాల్ని కొన్నాళ్ల క్రితం నిర్దేశించింది. అవేవీ అమలు కాకపోబట్టే దిల్లీ రైల్వేస్టేషన్లో ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్ల లూటీ, బిహార్‌ వెళుతున్న రైలులో ఆహారం కోసం కొట్లాటలు నమోదయ్యాయి. పదినుంచి 20 గంటల పాటు రైళ్లలో మగ్గిపోతున్నా, ఆహారం కాదు కదా, మంచినీరూ అందుబాటులో లేని దుస్థితి వలస కార్మికుల్ని క్షోభిల్లజేస్తోంది. రద్దీ దృష్ట్యా కొన్ని మార్గాల్లో రైళ్లను గంటల కొద్దీ నిలిపివేయడం, చుట్టూ తిప్పి తీసుకెళ్లడంతో 30-40 గంటలు మించుతున్న ప్రయాణకాలం ప్రత్యక్ష నరకాన్ని అనుభవంలోకి తెస్తోంది. జాతి సౌభాగ్యానికి భుజం కాస్తున్న శ్రామికుల బాగోగుల పట్ల మానవీయంగా స్పందించలేమా అన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది!

కాళ్లనే నమ్ముకొని...

ఇండియాలో అంతర్గత వలసలు సుమారు 14 కోట్లని 2011నాటి జనగణన ప్రకటించగా, పిమ్మట అయిదేళ్లపాటు ఏటా సగటున 90 లక్షలమంది వలసపోయారని 2017నాటి ఆర్థిక సర్వే వివరించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ల వెన్నంటి మధ్య ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్‌ బంగ, జమ్మూకశ్మీర్‌లనుంచి వలసలు పోటెత్తుతుంటాయి. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ వంటివి వారికి ప్రధాన గమ్య స్థానాలవుతున్నాయి. మహమ్మారి సోకితే అనాథలుగా పోతామన్న భీతి, సొంత ఊళ్లో ఆత్మీయుల బతుకు తెరువు పరిస్థితి.. స్వస్థలాలకు వలస కార్మికుల్ని మానసికంగా తరుముతున్నాయి.

ఎలాంటి ప్రయాణ సౌకర్యాలూ లేకున్నా కాళ్లనే నమ్ముకొని వందల మైళ్లు నడవడానికి సిద్ధపడిన అభాగ్యులెందరినో రోడ్డు ప్రమాదాలు కర్కశంగా బలిగొన్నాయి. సరకు రవాణా రైళ్లు నడుస్తున్నాయని తెలియక పట్టాలపై సొమ్మసిల్లిన 26 మంది ఉసురుతీసిన యూపీ దుర్ఘటన, కన్నతండ్రిని సైకిల్‌పై కూర్చోపెట్టుకొని 1,200 కిలోమీటర్లు తొక్కిన ఓ బాలిక ఉదంతం.. వలస జీవి బతుకు చిత్రం ఎంతగా చితికిపోయిందో వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబులనుంచి 30 శాతానికి మించి వలస శ్రామికుల పయనం సాగలేదని, ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి 140 ప్రత్యేక రైళ్లలో రెండు లక్షలమందిని తరలించనున్నారని వార్తాకథనాలు చాటుతున్నాయి. కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వమే గమ్య స్థానాలకు చేర్చాలని తెలంగాణ హైకోర్టు, ఒకవైపు ఛార్జీల్ని మినహాయించాలని లేదా రాష్ట్రాలనుంచి వసూలు చేసుకోవాలని గుజరాత్‌ హైకోర్టు ఆదేశించాయి. భిన్న శాఖల మధ్య సరైన సమన్వయంతో, వలస జీవులకు ఆకలి దప్పుల్లేని ఆరోగ్యవంత ప్రయాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూచీపడాల్సిన సమయమిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.