పతకాలు కావాలంటే పద్ధతి మారాలి!

author img

By

Published : Aug 8, 2021, 5:40 AM IST

Olympics

నేటి (ఆదివారం)తో ఒలింపిక్స్​ ముగియనుంది. గత విశ్వ క్రీడలతో పోలిస్తే ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసింది భారత్. అయితే మన దేశ జనాభాలో నాలుగోవంతైనా లేని దేశాలు పదుల సంఖ్యలో పతకాలను ఎగరేసుకుపోయాయి. మన క్రీడారంగ దుస్థితికి కారణం బహిరంగ రహస్యమే. పతకాలు గెలుపొందినవారిని ఆకాశానికి ఎత్తేయడంలో పోటీపడే ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో మౌలిక వసతుల పరికల్పన, ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన బాధ్యతలను గాలికి వదిలేస్తున్నాయి.

విశ్వ క్రీడోత్సవాన పతకాల వేటలో చైనా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలకు తిరుగులేదని చాటుతూ టోక్యో ఒలింపిక్స్‌ నేడు(ఆదివారం) ఘనంగా ముగియబోతున్నాయి. రికార్డు స్థాయిలో నూటపాతిక మందికి పైగా బృందంతో తరలివెళ్ళి 18 క్రీడాంశాల్లో తలపడిన భారత్‌ మొత్తం ఏడు పతకాల్ని ఖాతాలో జమ చేసుకుంది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా అద్భుత ప్రతిభ దేశానికి అథ్లెటిక్స్‌లో మొదటి పతకాన్ని, అదీ స్వర్ణాన్ని అందించింది. బరువులెత్తడంలో రజతం ఒడిసిపట్టిన మీరాబాయి చాను, బ్యాడ్మింటన్‌ బాక్సింగ్‌లలో కాంస్యాలతో తెలుగుతేజం పీవీ సింధు, లవ్లీనా మహిళా శక్తిని చాటారు. కుస్తీ పోటీల్లో రవి, బజరంగ్‌ల పట్టు రెండు పతకాల్ని రాబట్టగా- మన ఇరు హాకీ జట్లూ అంచనాలకు మించి రాణించాయి. 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణానంతరం పురుషుల హాకీ జట్టు జర్మనీని నిలువరించి కాంస్యం గెలుపొందడం అసంఖ్యాకుల్ని ఆనందడోలికల్లో ఓలలాడించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌ దశకు చేరిన భారత మహిళల హాకీ జట్టు కడకు వట్టి చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ సీఎం ఆదర్శనీయం..

ఎట్టకేలకు జాతీయ క్రీడలో పరువు నిలబెట్టారని ఇప్పుడు మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందంపై అభినందనల విరివాన కురుస్తున్నా- మూడేళ్ల క్రితం జట్టు బాగోగుల్ని పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. అందరూ చేతులెత్తేసిన దశలో పురుషుల, మహిళల జాతీయ హాకీజట్లను స్పాన్సర్‌ చేసిన ఘనత ఒడిశా ముఖ్యమంత్రిది. వెనకబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ అంత చేయగా లేనిది ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎందుకు చొరవ కనబరచలేకపోయాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత పాతికేళ్లలో ముమ్మార్లు ఒక్కో ఒలింపిక్‌ పతకంతోనే సరిపుచ్చుకొన్న భారత్‌- 2008లో మూడు, 2016లో రెండు మెడల్స్‌ రాబట్టగలిగింది. 2012 ఒలింపిక్స్‌లో స్కోరు ఆరుగా నమోదైంది. వాటితో పోలిస్తే టోక్యోలో మన ప్రదర్శన కొంత మెరుగే అయినా- వ్యవస్థాగత తోడ్పాటు, ప్రణాళికాబద్ధ కార్యాచరణ జతపడి ఉంటే మరిన్ని పతకాలు కచ్చితంగా దఖలుపడేవి!

సానపట్టాలే గాని..

వ్యాయామ విద్య, శారీరక పటుత్వం ఏకాగ్రతను వికసింపజేసి ఆత్మవిశ్వాసాన్ని, ఉమ్మడి తత్వాన్ని పెంపొందింపజేస్తాయన్న యథార్థాన్ని గుర్తెరిగిన దేశాలెన్నో పటిష్ఠ క్రీడా సంస్కృతికి ఓటేస్తున్నాయి. ఏ క్రీడాంశంలో పోటీకైనా ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమవుతూ ప్రతిష్ఠాత్మక వేదికలపై దర్జాగా పతకాలు కైవసం చేసుకుంటున్నాయి. భారత జనాభాలో నాలుగోవంతైనా లేనివీ అమేయ క్రీడాశక్తులుగా వెలుగొందుతున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ ఏళ్ల తరబడి పతకాలకు తీవ్ర కాటకం దాపురించడానికి కారణాలేమిటో బహిరంగ రహస్యం. పతకాలు గెలుపొందినవారిని ఆకాశానికి ఎత్తేయడంలో పోటీపడే ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో మౌలిక వసతుల పరికల్పన, ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన బాధ్యతలను గాలికి వదిలేస్తున్నాయి. చైనా వంటివి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక క్రీడా ప్రాంగణాలను నెలకొల్పి చిన్న వయసులోనే ప్రతిభావంతుల్ని గుర్తించి అత్యుత్తమ శిక్షణతో రాటు తేలుస్తున్నాయి. అదే ఇక్కడ- వసతుల కొరతకు, అవినీతికి, బంధుప్రీతికి నెలవులుగా ఎన్నో క్రీడాసమాఖ్యలు, సంఘాలు భ్రష్టుపడుతున్నాయి. ఆణిముత్యాల్లాంటి సహజసిద్ధ ప్రతిభా సంపన్నులకు దేశంలో కరవు లేదు. పేదరికం, కులపరమైన దుర్విచక్షణ, వసతుల లేమిలో కునారిల్లుతున్న ముడి కోహినూర్‌ వజ్రాల్లాంటి వాళ్లను వెలికితీసి సానపట్టాలే గాని, ఎందరెందరో మేటి ఒలింపియన్లుగా రూపొందగల వీలుంది.

మొగ్గ దశలోనే తీర్చిదిద్దాలి..

విశ్వంలోనే మరెక్కడా లేనంతటి అత్యధిక యువత కలిగిన భారత్‌ దిగ్గజ క్రీడాశక్తిగా ఎదగడానికి పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది పడాలి. క్రీడావైద్యం, అథ్లెట్లకు కావాల్సినవి తక్షణం సమకూర్చే వ్యవస్థ, శిక్షకుల్ని రాటుతేల్చే ఏర్పాట్లు, క్రీడా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ఒలింపియన్ల సృజన విద్యాసంస్థలు, సర్కారీ యంత్రాంగాల ఉమ్మడి బాధ్యతగా విలసిల్లే వాతావరణంలోనే బహుముఖ క్రీడావికాస సృష్టికి బంగరు బాటలు పడతాయి!

ఇదీ చూడండి:క్రీడలకు దూరంగా బాల్యం.. మానసిక ఒత్తిళ్లలో చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.