ETV Bharat / opinion

పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలంటే..

author img

By

Published : Sep 12, 2021, 5:00 AM IST

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి. పార్టీ ఫిరాయింపులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం అమలులో ఉన్నా.. ఈ పోకడలో ఎలాంటి మార్పురాలేదు. ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలంటే ప్రస్తుతం ఉన్న చట్టంలో పలు కీలక మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

law against party switching
రాజకీయ కప్పగంతులకు అడ్డుకట్ట పడాలంటే..

'టర్న్‌కోట్స్‌' అంటూ ఆంగ్లంలో ఆవేశపడినా.. 'ఆయారాం-గయారాం' అని హిందీలో ఎత్తిపొడిచినా.. 'గోడ మీద పిల్లుల'ని అచ్చ తెలుగులో వేళాకోళమాడినా భారతీయ నాయకులు అసలు బాధపడరు. కండువాలు మార్చడంలో తమ ఖండాంతర ఖ్యాతిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. అధికారమే ఏకైక అజెండాగా ఎప్పటికప్పుడు కొత్త జెండాలను కప్పుకోవడానికి దొడ్డిదారులను వెతికి పట్టుకుంటూనే ఉంటారు. గోడలు దూకడంలో గోల్డు మెడలిస్టులైన ఇటువంటి నేతాశ్రీలతో దేశ రాజకీయాలు మూడు కుర్చీలు ఆరు పదవులుగా కళకళలాడిపోతున్నాయి!

'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడు వాడు ధన్యుడు' అన్నది సుమతీ శతకకారుడి అభివర్ణన. ఎప్పుడు ఏ పార్టీ రాజ్యమేలుతుంటే ఆ పక్షం తీర్థం పుచ్చుకొనే వారే లౌక్యులన్నది మన మాన్య మహోదయ నాయకరత్నాల అంతరాలోచన. అందుకు తగినట్లుగానే గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 1633 మంది నేతలు సొంత పార్టీలకు సలాము కొట్టి పరపక్షాల పంచన చేరిపోయారు. వీరిలో 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదిక సారాంశం. రాజకీయాల్లో విలువలు లుప్తం కావడం, నేతాగణాల్లో నిజాయతీ నేతిబీర చందంగా మారిపోవడం తదితరాలతోనే ఈ దుస్థితి రాజ్యమేలుతోందని ప్రజాస్వామ్య హితైషులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొల్లగొట్టడం.. ఆపై వడ్డీతో సహా అంతకంతా వసూలు చేసుకోవడమే ప్రజాసేవకు పరమార్థంగా స్థిరపడి దశాబ్దాలు దాటిపోయింది. ఆసేతుహిమాచలం నిస్వార్థ నాయకులే అరుదైపోయిన వర్తమాన రాజకీయాల్లో విలువలను ఆశించడం వట్టి వెర్రితనం అనిపించుకుంటుంది. సిద్ధాంతాలు, ఆదర్శాలకు అంకితమైపోతే అధికార భోగాలు దక్కవన్నది నేతల గట్టి నమ్మకం!

పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నా..

'రాజకీయ ఫిరాయింపుల జాడ్యాన్ని పరిమార్చకపోతే- అది దేశ ప్రజాస్వామ్య పునాదులనే కాదు, మౌలిక సూత్రాలనూ దెబ్బతీస్తుంది' అని పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం విస్పష్టంగా పేర్కొంటోంది. అయితే మాత్రం ఏమిటి? 2014-21 మధ్య 177 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌లోంచి వలసపోయారు. వివిధ పార్టీలకు చెందిన 173 మంది ప్రజాప్రతినిధులు భాజపాలోకి వచ్చి చేరారు. ఇప్పుడంటే కాలం కలిసి రాక కుదేలైపోతోంది కానీ, దేశంలో ఇటువంటి దుర్రాజకీయాలకు అంటుకట్టింది హస్తం పార్టీయే! 1967-83 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 2700 మంది వరకు సొంత పార్టీలకు జెల్లకొడితే- వారిలో దాదాపు 1900 మంది కాంగ్రెస్‌లోనే ఐక్యమయ్యారు.

ఈ రాజకీయ కప్పగంతులపై అప్పటికి రెండు దశాబ్దాలుగా చర్చ సాగుతుండటం వల్ల రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పట్టాలెక్కించింది. వ్యక్తిగత ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసిన ఆ శాసనం- మూకుమ్మడి గోడదూకుళ్లకు దారిచూపింది. వాటిని నియంత్రించడానికి ఆ తరవాత 91వ రాజ్యాంగ సవరణ చేసినా ఫలితం లేకపోయిందనడానికి ఇన్నేళ్లలో ఎన్నో దృష్టాంతాలు పోగుపడ్డాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో గోడ మీద పిల్లుల పుణ్యమా అని ఇటీవలి కాలంలో ప్రభుత్వాలే కూలిపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడే పార్టీలు- అధికారంలోకి రాగానే వాటికి ఉప్పుపాతరేస్తూ చెలరేగిపోతున్నాయి. సామ దాన భేద దండోపాయాలతో ప్రత్యర్థి శిబిరాలను కకావికలం చేస్తున్నాయి. ప్రజాతీర్పును పలుచన చేస్తూ అంకెలగారడీతో అధికారాన్ని అందిపుచ్చుకొంటున్న పార్టీలు- ప్రజాస్వామ్యాన్నే నవ్వులపాల్జేస్తున్నాయి!

ఆరేళ్లలో మారిన ప్రభుత్వ వైఖరి..

పార్టీ మారిన చట్టసభల సభ్యులపై అనర్హత వేటు పడాల్సిందేనని కేంద్ర హోంమంత్రిగా ఎల్‌.కె.అడ్వాణీ లోగడే స్పష్టంచేశారు. లోపాలను పరిహరించి ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని బలోపేతం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ స్థాయుల్లో చర్చించి చట్టంలో అవసరమైన మార్పుచేర్పులు చేస్తామని 2010లో కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. కానీ, ఆరేళ్లు గడిచేసరికి ప్రభుత్వం ఆలోచన మారిపోయింది. ఫిరాయింపులను నిరోధించడంలో ఆ చట్టం ఆశించినంతగా అక్కరకు రావడం లేదన్న విషయం తమ దృష్టికి రాలేదని 2016లో లోక్‌సభలో సెలవిచ్చింది. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను నియంత్రించడానికి తగిన నిబంధనలు చట్టంలో ఉన్నాయని నమ్మబలికింది. రంగులు మార్చడంలో ఊసరవెల్లులకే పాఠాలు నేర్పేంత ప్రతిభావంతులైన నేతలకు బుద్ధిచెప్పడంలో ఈ చట్టమెంత 'బలమైందో' అర్థం చేసుకోవడానికి లాల్డుహోమ ఉదంతమొక్కటి చాలు!

మిజోరం రాష్ట్రానికి చెందిన ఆయన పూర్వాశ్రమంలో ఐపీఎస్‌ అధికారి. ఆ తరవాత కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అయ్యారు. ఆపై పార్టీకి తిలోదకాలు వదలడం వల్ల ఫిరాయింపు నిషేధ చట్టం కింద 1988లో ఉద్వాసనకు గురయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి లోక్‌సభ సభ్యుడిగా చరిత్రకెక్కారు! ఆ ఖ్యాతితోనే ప్రజాసేవలో కొనసాగిన లాల్డుహోమా- ఎమ్మెల్యేగా నిరుడు మళ్ళీ అవే దుర్రాజకీయాలతో అదే చట్టం కింద అనర్హత వేటుకు గురయ్యారు. కానీ, ఏం లాభం? అయిదు నెలలు తిరిగేసరికి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు! ఫిరాయింపుదారుల చట్టసభల సభ్యత్వాన్ని రద్దు చేయడం సహా కనీసం అయిదేళ్ల పాటు తిరిగి ఎన్నికల్లో పోటీచేయకుండా నిబంధనలు రాటుతేలాలని రాజ్యాంగ నిపుణులు ఏనాటి నుంచో సూచిస్తున్నారు. కానీ, ఆలకించేవారేరీ?

అడ్డుకట్ట వేయాలంటే..

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యులపై చర్యలు తీసుకునే సర్వాధికారాలు స్పీకర్లకు దఖలుపడ్డాయి. కానీ, రకరకాల రాజకీయాల నడుమ అనర్హత పిటిషన్లను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్న శాసనసభాపతులతో చట్టం స్ఫూర్తే దెబ్బతినిపోతోంది. 'రాజ్యాంగవిహితమైన కర్తవ్యదీక్షలో తటస్థంగా ఉండాల్సిన స్పీకర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నార'ని అత్యున్నత న్యాయస్థానమే నిరుడు ఆందోళన వ్యక్తంచేసింది. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై సభాపతులు మూడు నెలల్లోగా సముచిత నిర్ణయం తీసుకోవాలని అభిలషించింది. అంతేకాదు, ఆ పిటిషన్లపై విచారణకు శాశ్వత ట్రైబ్యునల్‌ లేదా మరేదైనా స్వతంత్ర వ్యవస్థ రూపకల్పనపైనా ఆలోచించాలని పార్లమెంటుకు సూచించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉటంకించిన స్పీకర్ల అధికారాన్ని పునర్‌ నిర్వచించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సైతం ఇటీవల అభిప్రాయపడ్డారు. ఆ షెడ్యూల్‌లోని నిబంధనలను రూపొందించిన కాలంలో నాయకులు తమ పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పెదవి విరిచారు. ఫిరాయింపుల నిషేధ చట్టంలోని లోపాలను పరిహరించనంత కాలం మకిలి రాజకీయాలు పచ్చగా వర్ధిల్లుతూనే ఉంటాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా పెచ్చరిల్లుతున్న ఈ పెడపోకడలకు అడ్డుకట్ట పడాలంటే- చట్టం కోరలు పదునుతేలాల్సిందే. కానీ, పార్టీలన్నీ ఆ తానుముక్కలే అయినప్పుడు- పిల్లిమెడలో గంట కట్టేదెవరు?

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చూడండి : నోట్లో దాచి దాటేద్దామనుకున్నాడు.. అంతలోనే చిక్కాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.