'గాలి' కొత్త పార్టీ.. గెలిచే ఛాన్సుందా? భాజపాకు లాభమా? నష్టమా?

author img

By

Published : Dec 28, 2022, 4:41 PM IST

Gali Janardhana Reddy New party

కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు 'గాలి' సిద్ధమయ్యారు. వస్తూ వస్తూనే భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. తన తదుపరి వ్యూహం సైతం కమలాన్ని దెబ్బతీసేలా సిద్ధం చేసుకుంటున్నారు. మరి గాలి జనార్ధన రెడ్డి పోరాటం ఎంతవరకు? కొత్త పార్టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

గోలీలాటను రాజకీయాలతో ముడిపెడుతూ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు గాలి జనార్ధన రెడ్డి. కమలం పార్టీపై అసంతృప్తితో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. మరి తర్వాతేంటి? పార్టీ పేరు ప్రకటన వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి? ఏకంగా అమిత్ షాకే గాలి గురిపెట్టారా? జనార్ధన రెడ్డిది అసలైన పోరాటమా? భాజపాకు ఇది ప్రమాద సంకేతమా? లేదా కమలం పార్టీని గట్టెక్కించే వ్యూహమా?.. గాలి ఆరాటమంతా గాలివాటమేనా?

భాజపాలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న మైనింగ్ వ్యాపారవేత్త గాలి జనార్ధన రెడ్డి 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరుతో కొత్త పార్టీ పెట్టారు. గతంలో ఆపరేషన్ కమలం నిర్వహించి పార్టీని అధికారంలోకి తేవడానికి సహాయపడ్డ గాలి జనార్ధన రెడ్డి.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీని ఏర్పాటు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ఈ పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గాలి జనార్ధన రెడ్డి పార్టీని ఏర్పాటు చేసిన వెంటనే.. భాజపా లక్ష్యంగానే వాగ్బాణాలు సంధించారు. తనను కమలం పార్టీ సరిగా ఉపయోగించుకోలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో వ్యవహరించిన తీరునూ పరోక్షంగా ప్రస్తావించి విమర్శలు గుప్పించారు. తనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని గతంలో భాజపా అగ్రనేత చేసిన వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. ఇవి 2018లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గాలి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రావడం, సొంతంగా పార్టీ పెట్టడం.. భాజపాకు నష్టం చేస్తుందా? మేలు చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

గతంలో ప్రాంతీయ పార్టీలు పెట్టి మాజీ ముఖ్యమంత్రులంతా పెద్దగా రాణించింది లేదు. మాజీ సీఎంలు దేవరాజ, ఎస్ బంగారప్ప, బీఎస్ యడియూరప్ప గతంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ పార్టీలేవీ మెరుగైన ఫలితాలు సాధించలేదు. అయితే, భాజపాను మాత్రం గట్టిగానే దెబ్బతీశాయి. గాలి లక్ష్యం సైతం ఇదే అయి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డికి కర్ణాటకవ్యాప్తంగా పట్టు లేదని, మాజీ సీఎంల పార్టీల మాదిరిగానే ఓటర్లను ఆకట్టుకోవడంలో ఇది విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, గాలి పార్టీ వల్ల భాజపా లాభపడే అవకాశం కూడా ఉందని కర్ణాటక మీడియా అకాడమీ మాజీ అధ్యక్షుడు ఎం.సిద్ధరాజు అంచనా వేశారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పరిస్థితులు తర్వాత మారిపోవచ్చని అన్నారు.

భాజపా బలంగా ఉన్న ప్రాంతాల్లోనే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు గాలి ప్రకటించారు. కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాన్నే ఇటీవల పేరు మార్చి కల్యాణ కర్ణాటక అని పెట్టారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీ పేరునూ కల్యాణ రాజ్య ప్రగతిగా పెట్టుకున్నారు జనార్ధన రెడ్డి. దీంతో ఆయన హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని నియోజకవర్గాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. భాజపా బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఇవే. 2018 ఎన్నికల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని 19 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించింది. ఈసారి ఈ సమీకరణాన్ని మార్చేయాలని గాలి సంకల్పించుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనను విస్మరించిన భాజపాకు గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. భాజపా కంటే అధిక సీట్లు గెలవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.

వ్యూహం ఖరారు..
మొత్తంగా 41 అసెంబ్లీ సీట్లపై గాలి స్పెషల్ ఫోకస్ పెట్టారు. బళ్లారి, విజయనగర, కొప్పల్, కలబురగి, బీదర్, యాదగిరి, రాయచూర్ జిల్లాల్లో పాగా వేయాలని అనుకుంటున్నారు. గాలి కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. తన పరిచయాలను ఉపయోగించుకొని ఇక్కడ తన ఉనికి చాటాలని గాలి ఊవిళ్లూరుతున్నారని తెలుస్తోంది. భాజపాకు పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే వ్యూహం ఖరారు చేశారని సమాచారం. హైదరాబాద్ కర్ణాటకతో పాటు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చిత్రదుర్గ, దావణగెరె, గడగ్, హవేరి జిల్లాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గాలి భావిస్తున్నట్లు తెలుస్తోంది. భాజపా టికెట్ దొరకని అభ్యర్థులను తన పార్టీ తరఫున బరిలోకి దించాలని ఆయన ప్లాన్ వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.