ETV Bharat / opinion

రైతుకు సాయంతోనే ఆత్మనిర్భర్‌

author img

By

Published : Feb 10, 2021, 7:40 AM IST

నూతన సాగు చట్టాలు మంచివా? చెడ్డవా? అనే వాదన కంటే ముఖ్యంగా.. ఆయా చట్టాలపై రైతుల్లో ఉన్న ఆందోళనలను తొలగించాల్సిన తక్షణ అవసరం కేంద్రంపై ఉందనేది నిజం. ఇందుకు సంబంధించి చర్చలు ఒక అడుగు ముందుకి.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. ఫలితంగా దేశ ఆహార భద్రత సహా.. ఆత్మనిర్భర్​ భారత్​ వంటి కీలక లక్ష్యాల సాధనకు దూరంగా జరుగుతున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన తరుణమిది.!

farmers agitation has to be consider it is the need of the hour in india agriculture reforms should come as per the farmers will that is aatmanirbhar bharat
రైతుకు సాయంతోనే ఆత్మనిర్భర్‌

'మేము రైతులం- మేము సైనికులం' అన్నది వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించిన అన్నదాతల నినాదం. నాగలితో నాగరికత నేర్పి వ్యవసాయాన్నే జాతి సంస్కృతిగా తీర్చిన రైతు, భారతావని ఆహార భద్రతను కాపాడే సైనికుడేనన్నది నిర్వివాదం! కాయకష్టాన్ని ప్రకృతి విపత్తులు కబళించినా, ఫలసాయాన్ని మార్కెట్‌ శక్తులు మింగేసినా గుట్టుగా రోజులు నెట్టుకురావడమో, పురుగు మందులతో గుండె మంటలార్చుకోవడమో చేసే రైతు- నేడు పోరాట పథంలో ఎందుకు కదం తొక్కుతున్నాడో ఆలోచించాలి.

అసలైన సంస్కరణలంటే..?

అన్నదాతల మేలుకోరే సాగు సంస్కరణలు తెచ్చామన్న ప్రధాని మోదీ- రెండున్నర ఎకరా కంటే తక్కువ ఉన్న రైతులు 1971లో 51శాతం ఉంటే, వారి సంఖ్య నేడు 68శాతానికి చేరిందని, రెండు హెక్టార్లకంటే తక్కువ కమతంగల వారు ఎకాయెకి 86శాతమని క్షేత్రస్థాయి వాస్తవాల్ని ప్రస్తావించారు. ఈ సన్న చిన్నకారు రైతులకు సమీపంలో ఉండీ సాంతం దళారులతో నిండి, అన్నదాతల ప్రయోజనాలకు సున్నం కొడుతున్న మండీలను సమూల క్షాళన చెయ్యడం సంస్కరణ అవుతుంది కాని- దేశమంతా ఏకీకృత మార్కెట్‌ అంటే, బడుగు రైతు బావుకొనేదేమిటి? పాతికేళ్లలో మూడు లక్షలమందికిపైగా రైతులు బలవన్మరణాల బలిపీఠమెక్కిన దేశంలో తీరైన సంస్కరణలు రావాలని అందరూ కోరుకొన్నా- ఏ దశలోనూ రాష్ట్రాలతోగాని, రైతు సంఘాలతోగాని సంప్రతించకుండా ఏకపక్షంగా పట్టాలకెక్కించిన సాగు చట్టాలు ఆ కోవలోనివి కావు.

కొత్త చట్టాలతో తమ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని రైతులు భీతిల్లుతుంటే- వాటివల్ల చెడు జరిగితే తన 'ఖాతా'లో వేయాలని ప్రధాని అనడం సరికాదు. మరే మాత్రం 'చెడు'ను భరించే శక్తి రైతాంగానికి లేదు. భేషజాలకు పోకుండా రాష్ట్రాలు, రైతులతో సంప్రదించి జాతిహితకర శాసనాల్ని రూపొందించాలిప్పుడు!

కార్పొరేట్​తో చేటు..

రైతు శ్రేయానికి ప్రభుత్వాలు పూచీపడిన దేశంలోనే సతతహరిత విప్లవం సాధ్యపడుతుంది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి హయాములో కనీస మద్దతు ధర, వాటిని నిర్ధారించే యంత్రాంగం, వ్యవసాయ మండీలు, ఎఫ్‌సీఐ కొనుగోళ్లు బడుగు రైతుకు బలమైన దన్నుగా నిలవబట్టే హరితవిప్లవం సాధ్యపడింది. శ్వేత విప్లవ పితామహుడిగా వర్ఘీస్‌ కురియన్‌ దార్శనికత- గ్రామీణార్థికానికి దన్నుగా రూ.8 లక్షల కోట్ల క్షీర సాగర మథనంతో పాడి రైతుకు బాసటగా నిలుస్తోంది. సేద్యానికి సంబంధించీ కేంద్ర రాష్ట్రప్రభుత్వాల్లో ఆ తరహా దార్శనికతే ప్రస్ఫుటం కావాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచబాటలు పరచే తాజా చట్టాలతో అందుబాటులోని మండీల వ్యవస్థ సాంతం కుదేలైపోతుందని, దాని వెన్నంటి ధాన్యం సేకరణ బాధ్యతనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దానితోపాటే కనీస మద్దతు ధరకూ మంగళం పాడతారనీ రైతులోకం భీతిల్లుతోంది. కొన్ని రాష్ట్రాలకు, కొన్ని పరగణాలకు పరిమితమైన ఆందోళనగా దానిపై సంకుచిత రాజకీయ ముద్రవేయకుండా- వ్యవసాయ రంగాన ఆత్మనిర్భరతా వ్యూహాన్ని కేంద్రం రచించాలి.

మౌలిక సదుపాయాలే కీలకం..

రైతులనుంచి ఉత్పత్తుల్ని కొని, విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి తగిన మౌలిక వసతులు లేవంటూ అందుకోసం నాబార్డ్‌ లక్షకోట్ల రూపాయల నిధుల్ని సేకరిస్తుందని నిరుడు మే నెలలో విత్తమంత్రి ప్రకటన చాటింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు వెళ్ళాయంటున్న కేంద్రం- ఆ మొత్తాన్ని మౌలిక సదుపాయాలకు మళ్ళించి ఉంటే శీతల గిడ్డంగుల వంటి సౌకర్యాలు అమరి బడుగు కర్షకులకెంతో ఉపయుక్తమయ్యేది. వివిధ పంటలపరంగా దేశీయ అవసరాల్ని, విదేశీ మార్కెట్లలో అవకాశాల్ని మదింపు వేసి పటిష్ఠమైన 'మాస్టర్‌ ప్లాన్‌'తో దేశ వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసే ప్రత్యేక వ్యవస్థ కొలువు తీరాలి.

డాక్టర్‌ స్వామినాథన్‌ సూచనల మేరకు అన్ని పంటలకు కనీస మద్దతును ప్రభుత్వమే అందించి, ఆ వ్యయాన్ని విదేశీ ఎగుమతుల ద్వారా రాబట్టుకొనే కార్యాచరణ యుద్ధ ప్రాతిపదికన రూపుదిద్దుకొన్నప్పుడే భారతీయ రైతు తెరిపిన పడగలిగేది!

ఇవీ చదవండి: చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడింది: తోమర్

'స్వామిత్వ'తో ఆర్థిక స్థిరత్వం- హక్కు పత్రాలతో ఆత్మవిశ్వాసం

'అక్టోబర్​ వరకు రైతు ఉద్యమాన్ని ఆపేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.