80కి పడిపోయిన 'రూపాయి'.. బతుకులు భారం.. ఎగుమతులు పెరగకుంటే ఇక అంతే!

author img

By

Published : Jul 16, 2022, 10:09 AM IST

Updated : Jul 16, 2022, 10:21 AM IST

rupee value
రూపాయి విలువ ()

భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. ఒక డాలర్​ సుమారు రూ.80కి చేరుకున్న నేపథ్యంలో మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు ఈ పరిస్థితులపై ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ దుస్థితి నుంచి దేశం గట్టెక్కడంపై నిపుణులు ఏమంటున్నారంటే..

కొన్ని రోజులుగా భారత రూపాయి పతనావస్థలో ఉంది. ప్రస్తుతం ఒక అమెరికన్‌ డాలర్‌ ఇంచుమించు 80 రూపాయలదాకా పలుకుతోంది. దేశచరిత్రలో ఇదే రికార్డు స్థాయి పతనం. రూపాయి మరింతగా క్షీణిస్తుందేమోనన్న చర్చ విశ్లేషకుల్లో కొనసాగుతోంది. 2013లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రూపాయి పతనాన్ని నివారించలేకపోతున్నారని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా సైతం రూపాయి నేల చూపులను నిలువరించలేకపోతోంది. జనవరి నుంచి ఇండియా రూపాయి డాలర్‌తో పోలిస్తే దాదాపు ఆరు శాతం పతనమైంది. అధిక ద్రవ్యోల్బణం, ధరల విపరీత పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో సామాన్యుల జీవనం భారంగా మారింది. 2029 నాటికి ఒక్కో యూఎస్‌ డాలరు రూ.94 నుంచి రూ.95 పలుకుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అదే జరిగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరింతగా బహిర్గతమవుతుంది.

బతుకులు భారం
మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్‌ అధికం. భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. మన్మోహన్‌ సింగ్‌ హయాములో ఒకసారి బ్యారెల్‌ ముడిచమురు ధర 140 డాలర్లకు చేరింది. ఆయన పదవీ కాలం మొత్తం అది 100 డాలర్ల కంటే అధికంగానే ఉంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ముడిచమురు ధర సగటున 40 నుంచి 50 డాలర్ల మధ్యనే ఉంది. గత ఫిబ్రవరి తరవాతే 100 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 2021-22లో మన జీడీపీలో సీఏడీ 1.2శాతం ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి చేరొచ్చని అంచనా ఉంది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికం. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై నమ్మకం లేనందువల్ల విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ద్రవ్యోల్బణం మరింతగా పెరిగితే వడ్డీ రేట్లను పెంచాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)పై ఒత్తిడి పెరగవచ్చు. వడ్డీరేట్లు అధికమైతే రుణగ్రహీతలకు సంకట స్థితి ఎదురవుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు మన రూపాయల్లో జరిగేందుకు వీలుగా వాణిజ్య బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరవాలని ఇటీవల ఆర్‌బీఐ ఆదేశించింది. దానివల్ల డాలర్ల అవసరం తగ్గి, రూపాయి బలపడే అవకాశం ఉంది. మరోవైపు గ్రామీణ పేదలు ఆర్థిక వృద్ధి ప్రయోజనాన్ని సరిగ్గా పొందలేకపోతున్నారు. దాదాపు 7.8 కోట్ల ఇళ్లకు నేటికీ విద్యుత్తు సదుపాయం లేదు. జనాభాలో 33శాతం రోజుకు ఒక డాలర్‌ కంటే తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్నారు. ఇండియాలో ఉత్పత్తి అయిన పండ్లలో 40శాతం మార్కెట్లకు చేరకుండానే కుళ్ళిపోతుండటం- మన సరఫరా పరిమితులు, అసమర్థతలకు నిదర్శనం.

అవినీతి భూతం
భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 30శాతం వాటా వాటిదే. మొత్తం ఎగుమతుల్లో 40శాతం వాటి నుంచే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 11కోట్ల మందికి ఎంఎస్‌ఎంఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. దానికి వడ్డీరేట్లను తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లతో పోటీపడుతూ మరింతగా ఎగుమతులను పెంచే అవకాశం ఉంది. భారత్‌లో కొన్ని వ్యాపారాలకు రుణాలు ఇవ్వడానికి భద్రతాపరమైన అంశాలు అవరోధంగా ఉంటున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆస్తుల తనఖా విధానాన్ని తొలగిస్తే రుణాలు లభించి ఉత్పత్తులను పెంచడానికి ఆ సంస్థలు ప్రయత్నిస్తాయి. ఎంఎస్‌ఎంఈలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమూ మరో ప్రధాన అంశం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ఇండియాలో వ్యాపార నిర్వహణ పరంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. సంస్థలకు అవినీతి తలనొప్పిగా మారుతోంది. మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే విదేశీ పెట్టుబడులు అవసరం. వాటిని ఆకర్షించడానికి అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలి.

ఆర్థిక వ్యవస్థ దుస్థితి
కీలకమైన ఆర్థిక సూచీలన్నింటా భారత్‌ బలహీనంగానే ఉంది. వృద్ధి రేటు పెరగడం లేదు. ద్రవ్యోల్బణం ఎనిమిది శాతానికి చేరింది. నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగింది. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని వెల్లడిస్తున్నాయి. ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో ద్రవ్యలోటును పూడ్చేందుకు మూలధన ప్రవాహాలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది.

ఏం చేయాలి?
దిగుమతులపై పరిమితి..: దేశీయంగా పోటీతత్వాన్ని, ఎగుమతులను పెంచడానికి సరఫరా విధానాలను మెరుగుపరచాలి. మన చమురు అవసరాల్లో 80శాతానికి దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించాలి. బంగారం కొనుగోలును నిరుత్సాహపరచడానికి దిగుమతి సుంకాన్ని పెంచినా- సీఏడీని తగ్గించడానికి దిగుమతుల పరిమాణంపై పరిమితిని విధించాల్సిన అవసరం ఉంది.

షరతులు సడలిస్తే..: అనవసరమైన వస్తువుల దిగుమతులను నివారిస్తే డాలర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. ఎగుమతులను పెంచితే డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. అది రూపాయి క్షీణతను నియంత్రిస్తుంది. బాహ్య వాణిజ్య రుణాల (ఈసీబీ) షరతులను సడలిస్తే విదేశీ కరెన్సీల్లో ఎక్కువ రుణాలను పొందవచ్చు. అది విదేశ ద్రవ్య నిల్వలను పెంచడంతో పాటు రూపాయి విలువ పెరగడానికి ఉపకరిస్తుంది.

ప్రపంచ విపణిలో పాగా..: స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేయడంతోపాటు అధిక ఆదాయ దేశాల్లోకి మన మార్కెట్‌ చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకోవాలి. భూమి, విద్యుత్తు, మూలధనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. చైనా మాదిరిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. వాటికితోడు ఎగుమతి ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు, కార్మిక సంస్కరణల అమలు ద్వారా దేశీయంగా పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ సంస్థలను ఆకర్షించవచ్చు.

.

ఇదీ చూడండి : 'రూపాయి' భారీ పతనం.. సామాన్యుడి బతుకు మరింత భారం!

Last Updated :Jul 16, 2022, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.