తమిళ ఒడిలో తెలుగు నుడి

author img

By

Published : May 21, 2021, 8:50 AM IST

keera

ఎనిమిది వందల ఏళ్ల క్రితం రాయలసీమ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లిన తెలుగువారి చరిత్రను నవలా రూపంలో నమోదు చేసిన సాహితీవేత్త కీరా! తమిళంలో మాండలిక రచనల పితామహుడిగా గుర్తింపు పొందిన ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పదహారణాల తెలుగువారు. 'నా రచనలకు తమిళం శరీరమైతే ఆత్మ తెలుగే' అని సగర్వంగా చెప్పుకొనే కీరా- మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, కమల్‌హాసన్‌ తదితరులెందరికో అభిమాన రచయిత. తొంభై ఎనిమిదేళ్ల వయసులో ఈ నెల 17న ఆయన కీర్తి శేషులయ్యారు.

ఎనిమిది శతాబ్దాల క్రితం రాయలసీమ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లిన తెలుగువారి చరిత్రను నవలా రూపంలో నమోదు చేసిన సాహితీవేత్త కీరా! 'నాయన, భీష్మాచార్య'గా తమిళ సాహిత్యలోకం గౌరవించుకునే ఆయన అసలు పేరు రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌. తమిళంలో మాండలిక రచనల పితామహుడిగా గుర్తింపు పొందిన ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పదహారణాల తెలుగువారు.

'నా రచనలకు తమిళం శరీరమైతే ఆత్మ తెలుగే' అని సగర్వంగా చెప్పుకొనే కీరా- మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, కమల్‌హాసన్‌ తదితరులెందరికో అభిమాన రచయిత. తొంభై ఎనిమిదేళ్ల వయసులో ఈ నెల 17న కీర్తిశేషులైన ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నివాళి అర్పించి, రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు. కీరా పుస్తకాలు, వస్తువులు తదితరాలతో ఓ ప్రదర్శనశాలను ఏర్పాటుచేయాలని ఆదేశాలిచ్చారు.

"ఒకనాడు నా తల్లి నేలకు బయలెక్కితి. మా పెద్దవాండ్లు ఉండిన నేలమీద కాలిడుతూనే నా కండ్లలో నీరు. తెలుగుమాట రుచి తగిలితే నిండా బాగుండు. తెలుగునాడు తెలుగైతే నిండా నిండా బాగుండు"

-కీరా

తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి మండలం ఇడైచేవల్‌ గ్రామం కీరా స్వస్థలం. 1923 సెప్టెంబర్‌ 16న లక్ష్మమ్మ, కృష్ణ రామానుజ నాయకర్‌ దంపతులకు జన్మించారు. అయిదో తరగతితో చదువు ఆపేసినా జానపద గాథలు, మాండలిక పదాల పరిశోధనలో విశేష కృషి చేశారు. దానికి గుర్తింపుగా పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్య పదవినిచ్చి గౌరవించింది. రాజకీయ, సాంఘిక, మతకారణాలతో తెలుగువారు తమిళనాడుకు వలస వెళ్లారు. ఆయా కుటుంబాలు తమ వలసగాథలను తరవాతి తరాలకు మౌఖికంగా అందిస్తూ వచ్చాయి. వాటి ఆధారంగా 1976లో తెలుగు పదాలతో కూడిన దక్షిణ తమిళ మాండలికంలో కీరా 'గోపల్లెపురం' నవల రచించారు. కాలక్రమంలో ఎంతోమందికి ఆవాసమైన ఆ గ్రామం స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎలా ఉండేదో చెబుతూ 'గోపల్లపురత్తు మక్కళ్‌' పేరిట రెండో నవల వెలువరించారు. దీనికే 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవలలు తమిళ సాహిత్యలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

చారిత్రక గాథనంతా..

కీరా ఇంటిపేరు 'రాయంకుల' ప్రస్తుత కడప, అనంతపురం జిల్లాల్లో వినిపిస్తూ ఉంటుంది. తమ ఇంటి ఆడపడుచుపై కన్నేసిన స్థానిక పాలకుడి నుంచి తప్పించుకున్న తెలుగు కుటుంబాలు కొన్ని పాండ్య మండలానికి (తూత్తుకుడి జిల్లా) వలస రావడం, దారిలో వారికి ఎదురైన కష్టాలు, గ్రామాన్ని ఏర్పాటుచేసుకుని నల్లరేగడి అడవిని నరికి సాగులోకి తీసుకురావడం, దివిటీ దొంగల నుంచి తమ గ్రామాన్ని కాపాడుకోవడం, రెక్కలుముక్కలు చేసుకుని సేద్యంలో దీటైనవారుగా పేరుపొందడం, చివరికి ఆ ప్రాంతానికి నాయకర్లు (నాయకులు) కావడం... ఈ చారిత్రక గాథనంతా 'గోపల్లెపురం'లో కళ్లకు కట్టారు కీరా. ఎనిమిది వందల ఏళ్ల నాటి రాయలసీమ రైతు జీవితాలకు ఈ నవల అద్దంపడుతుంది. పెమ్మసాని, రావిళ్ల, మల్లిన, తోకల, కాకర్ల తదితర ఇంటిపేర్లు కలిగిన ఎన్నో తెలుగు కుటుంబాల సుఖదుఃఖాలు ఇందులో కనిపిస్తాయి. అడవిని దున్ని సేద్యం చేసిన కొత్తల్లోని ఉమ్మడి కమతాలు పోనుపోను సొంత పొలాలుగా ఎలా మారాయో ఈ రచన పట్టిచూపిస్తుంది.

నవలల్లో అచ్చతెలుగు మాటలు..

దీన్ని 'గోపల్లె' పేరిట నంద్యాల నారాయణరెడ్డి తెలుగులోకి అనువదించారు. స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న గోపల్లె ప్రజల గురించి 'గోపల్లపురత్తు మక్కళ్‌' వివరిస్తుంది. ఆచార్య జయప్రకాశ్‌ నారాయణ దీన్ని తెలుగులోకి తెచ్చారు. కూడు, సంగటి, కూటినీళ్లు, కొర్రన్నం, దుడ్డు, పెనిమిటి, నాడు (దేశం), సేద్దం, గాసి (కష్టం), కపిలబావి, ఎలిమి (ఆనందం), మునుములు (జంతువులు), ఒత్తాసు (సాయం), మందల (సమాచారం), పాటిడి (మర్యాద), గానులు (చక్రాలు), తొలివేల్పు (బ్రహ్మ), పెరిమలు (మహిమలు), ఎండతరి (వేసవి), అలవి (బలం), నాల్కాలి (కుర్చీ), వేల్పువెలది (దేవతాస్త్రీ), ముడువు (నిర్ణయం), ఒలకబోసుకొని (స్నానం చేసి) వంటి ఎన్నో అచ్చతెలుగు మాటలు ఈ రెండు నవలల నిండా పరుచుకుని ఉంటాయి. 'కడువు' కథా సంకలనం, తమిళనాట గ్రామీణ కథైగల్‌, నాట్టుపుర కథైగళ్‌(జానపద కథలు) తదితర పుస్తకాలతో పాటు మాండలిక నిఘంటువును సైతం కీరా వెలువరించారు.

మనకు తెలియని మనవాళ్ల వలస చరిత్రకు సృజనాత్మక సాహితీరూపమిచ్చిన కీరాకు తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. 'తమిళనాట తెలుగువారికి సంబంధించిన ఎన్నో జనపద కళారూపాలు, పాటలు, కథలు, సామెతలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని పరిశోధిస్తే ప్రాచీన తెలుగు పదస్వరూపాలు, వాక్యనిర్మాణ విశేషాలు, అనేక చారిత్రక అంశాలు వెలుగులోకి వస్తాయి' అని చెబుతుండేవారు. తెలుగు పరిశోధకులతో పాటు ప్రభుత్వాలూ దీనిపై దృష్టిపెడితే మన భాష మూలాలు మరింతగా అవగతమవుతాయి!

- డాక్టర్‌ సగిలి సుధారాణి

ఇదీ చూడండి: పల్లెలపై కొవిడ్‌ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.