పనులు మందగిస్తున్న వేళ ఉపాధికేదీ గట్టి హామీ?

author img

By

Published : Aug 6, 2020, 7:27 AM IST

RURAL EMPLOYMENT
ఉపాధి ()

కరోనా కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్ల కారణంగా పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మూసుకుపోయి స్వస్థలాలకు చేరిన కోట్లమంది వలస కూలీలకే కాదు, విద్యావంతులకూ నిపుణ శ్రామిక కోటికీ ఉపాధి హామీ పథకమే బతుకు తెరువుగా మారింది. అయితే వానలు జోరుగా పడుతున్నందున పలు రాష్ట్రాల్లో ఉపాధి పనులూ మందగించాయి. వంద రోజుల పని పరిమితి తీరిపోవడంతో లక్షల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఆకలితో ఉన్నవారికి దేవుడు అన్నం రూపంలోనే కనిపిస్తాడన్నారు మహాత్మాగాంధీ. రెక్కాడితేగాని డొక్కాడని కోట్లాది బడుగు జీవులకు అన్నపూర్ణగా మారింది- జాతిపిత పేరిటే అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ! కరోనా కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్ల కారణంగా పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మూసుకుపోయి స్వస్థలాలకు చేరిన కోట్లమంది వలస కూలీలకే కాదు, విద్యావంతులకూ నిపుణ శ్రామిక కోటికీ ఉపాధి హామీ పథకమే బతుకు తెరువుగా మారింది.

బడ్జెట్లో కేటాయించిన రూ.61వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేలకోట్లు జోడించి గ్రామీణ ఉపాధికి మోదీ ప్రభుత్వం ఈ మధ్య భరోసా ఇచ్చినా, ఆ దిలాసా ఇంకెంత కాలం ఉంటుందన్న సందేహమే ఆలోచనాపరుల్ని బాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ముగిసింది నాలుగు నెలలే అయినా మొత్తం కేటాయింపులో రూ.48,500 కోట్లకు పైగా ఖర్చు అయిపోయింది. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తాజా అధ్యయనం ప్రకారం ఎన్నెన్నో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులు నిండుకున్నాయి. వానలు జోరుగా పడుతున్నందున పలు రాష్ట్రాల్లో ఉపాధి పనులూ మందగించాయి. వంద రోజుల పని పరిమితి తీరిపోవడంతో లక్షల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

గ్రామ పంచాయతీలు చేపట్టిన ప్రాజెక్టులు కూడా ఈ నెలాఖరుకు ముగిసిపోనుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉపాధి హామీని రెండొందల రోజులకు పొడిగించి, మరో లక్ష కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రస్తావిస్తోంది. యూపీ, బిహారులకు చెందిన 30 జిల్లాల్లో వలస శ్రామికుల నైపుణ్యాల నమోదును చేపట్టిన కేంద్రం- సమీప ప్రాంతాల్లోని పరిశ్రమలకు వారిని మానవ వనరులుగా అందించే పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల అవసరాలు శ్రామికుల నైపుణ్యాల నడుమ వారధి కాగల పోర్టల్‌ను రూపొందించి దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న యోచన మంచిదే అయినా, పల్లెపట్టుల్లో ఉపాధి దీపం కొండెక్కకుండా కాచుకోవడంపై తక్షణం దృష్టి సారించాలి!

వ్యవసాయంతో అనుసంధానిస్తే..

కష్టజీవుల ఉపాధి వేటలో చివరి ఆశాదీపంగా సుప్రీంకోర్టు లోగడ ప్రస్తావించిన గ్రామీణ ఉపాధి హామీ- దేశవ్యాప్తంగా సగటున ఏటా అయిదు కోట్ల కుటుంబాల జీవికకు ఆధారంగా మారింది. ఏడాదికి నూరు రోజుల ఉపాధికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీ గత పదిహేనేళ్లలో ఎప్పుడూ సక్రమంగా అమలు కానేలేదని, ఆయా రాష్ట్రాల కనీస వేతనాలతో పోలిస్తే ఉపాధి కూలీ రేట్లు దిగనాసిగా ఉన్నాయని పలు అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లోనూ లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చలేకపోతున్నట్లు సర్కారీ గణాంకాలే సాక్ష్యం చెబుతున్నాయి. దేశార్థిక వ్యవస్థ జవజీవాల్ని పీల్చేస్తున్న కరోనా కూలీనాలీ చేసుకునేవారి జీవికకే కొరత వేస్తున్న పాడు కాలమిది. కోట్లాది బడుగు జీవుల ఆకలి కేకలు మిన్నంటకుండా కాచుకోవడానికి నమ్మకంగా అక్కరకొచ్చే పథకం ఉపాధి హమీ!

జాబ్‌ కార్డుల వంటి బాదరబందీ లేకుండా అడిగినవారందరికీ నేరుగా పనిచూపించి, సాయంత్రానికల్లా కూలీ డబ్బులు అందించేలా పథకం తీరుతెన్నులు మార్చి, కొవిడ్‌ పీడ విరగడ అయ్యేదాకా ఉపాధి హామీ కాలపరిమితిని పూర్తిగా తొలగించాలి. నిర్వహణలో లొసుగులు ఎన్నిఉన్నా 32 శాతం మేర పేదరికాన్ని నియంత్రించిందని, దారిద్య్రకోరల్లో చిక్కుకోకుండా కోటీ 40లక్షల మందిని కాపాడిందంటున్న ఉపాధి హామీని- వ్యవసాయంతో అనుసంధానించడం ద్వారా రైతాంగానికీ మంచి మేలు తలపెట్టినట్లవుతుంది. ఉపాధి హామీవల్ల వ్యవసాయానికి కూలీల సమస్య ఉత్పన్నమైన మాట నిజం. దానికి విరుగుడుగా సేద్యానికి ఉపాధి హామీని అనుసంధానించాలంటూనే- వేతన భారంలో మూడొంతుల్ని రైతులే నిభాయించాలన్న నీతి ఆయోగ్‌ సూచన అసంబద్ధం. ఉరుముతున్న సామాజికార్థిక సంక్షోభాన్ని అధిగమించేలా వ్యవసాయానికి ఉపాధి హామీని జోడించి, కోట్లాది బడుగు జీవులకు బాసటగా నిలవడం- నేటి అవసరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.