ETV Bharat / opinion

Afghan news: అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!

author img

By

Published : Sep 1, 2021, 7:56 AM IST

సామ్రాజ్యాల శ్మశానంగా పేరొందిన అఫ్గాన్‌లో(Afghanistan news) ఏ దేశమూ లాభపడింది లేదన్న చేదునిజాన్ని చరిత్ర చెబుతోంది. అఫ్గాన్‌ను చెరపట్టిన తాలిబన్లను(Afghanistan Taliban) గుర్తించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఎంతో ఉత్సాహంగా పోటీపడ్డాయి. తాలిబన్ల చేతిలో పరాభవంతో అమెరికా హడావుడిగా మూటాముల్లే సర్దుకోవడంతో, చైనా అఫ్గాన్‌పై ఆసక్తి చూపుతోందనేది అంతర్జాతీయ నిపుణుల అంచనా. బహుళ జాతుల సామ్రాజ్యాన్ని నెట్టుకొస్తున్న చైనాకు ఇతర దేశాలతో పోలిస్తే, అఫ్గాన్‌ వ్యవహారాలను చక్కబెట్టడం తేలికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాలు చావుదెబ్బ తిన్న తరహాలో చైనా అఫ్గాన్‌(China Afghan) ఉచ్చులో చిక్కుకోకపోవచ్చని చెబుతున్నారు.

china  afghan
చైనా అఫ్గాన్

అఫ్గానిస్థాన్‌.. మధ్య, దక్షిణ ఆసియా దేశాలకు చౌరస్తా. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న భూభాగం. సామాజ్య్ర విస్తరణ, రవాణా, వాణిజ్యం, సహజ వనరులు వంటివాటా.. పరంగా పూర్వం నుంచీ అన్ని రాజ్యాలకూ దీనిపై ఎనలేని ఆసక్తి. ఎన్నో సామ్రాజ్యాలు, రాజ్యాలు దండయాత్రలు చేశాయి. భారత్‌ను ఏలిన బ్రిటిషర్లు సైతం అఫ్గాన్‌తో(Afghanistan latest news) యుద్ధంచేసి చేదు అనుభవాన్ని మిగుల్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఒకప్పటి శక్తిమంతమైన సోవియట్‌కూ ప్రతికూల ఫలితాలే దక్కాయి. ఇప్పుడు ఆ వరసలో అమెరికా చేరింది.

సామ్రాజ్యాల శ్మశానంగా పేరొందిన అఫ్గాన్‌లో ఏ దేశమూ లాభపడింది లేదన్న చేదునిజాన్ని చరిత్ర చెబుతోంది. అఫ్గాన్‌ను చెరపట్టిన తాలిబన్లను(Afghanistan Taliban) గుర్తించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఎంతో ఉత్సాహంగా పోటీపడ్డాయి. తాలిబన్ల చేతిలో పరాభవంతో అమెరికా హడావుడిగా మూటాముల్లే సర్దుకోవడంతో, చైనా అఫ్గాన్‌పై ఆసక్తి చూపుతోందనేది అంతర్జాతీయ నిపుణుల అంచనా. బహుళ జాతుల సామ్రాజ్యాన్ని నెట్టుకొస్తున్న చైనాకు ఇతర దేశాలతో పోలిస్తే, అఫ్గాన్‌ వ్యవహారాలను చక్కబెట్టడం తేలికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాలు చావుదెబ్బ తిన్న తరహాలో చైనా అఫ్గాన్‌(Afghanistan China border) ఉచ్చులో చిక్కుకోకపోవచ్చని చెబుతున్నారు. ఈ లెక్కన డ్రాగన్‌ చరిత్రను తిరగరాస్తుందా, పాత ఫలితాలనే మూటగట్టుకుంటుందా అనేది కాలమే చెప్పాలి.

ఊరిస్తున్న ఖనిజాలు

చాలాకాలంగా అఫ్గాన్‌పై పట్టు సాధించేందుకు చైనా యత్నిస్తోంది. అక్కడ అపారంగా ఉన్న సహజ వనరులు, లక్ష కోట్ల డాలర్ల విలువైన ఖనిజ సంపద డ్రాగన్‌ను ఊరిస్తున్నాయి. బంగారం, రాగి, ఇనుము, యురేనియం, లిథియం, థోరియం, కోబాల్ట్‌, మెర్క్యురీ, గ్యాస్‌ నిల్వలు అపారం. ఇప్పటికే లోగార్‌ ప్రావిన్సులోని మెస్‌ అయినక్‌లోని రాగి నిల్వలపై చైనాకు 30 ఏళ్ల లీజు ఉంది. 2011లో చైనా జాతీయ పెట్రోలియం కార్పొరేషన్‌ మూడు చమురు క్షేత్రాలను 25 ఏళ్లపాటు డ్రిల్లింగ్‌ చేసుకోవడానికి 40 కోట్ల డాలర్ల విలువైన బిడ్‌ను పొందింది. ఇంతేకాదు, ప్రతిష్ఠాత్మక ప్రపంచ రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు- బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) విజయం సాధించాలంటే అఫ్గాన్‌ సహకారం కావాల్సిందే. ఈ ప్రాజెక్టులో అఫ్గాన్‌ కీలక భాగస్వామి. చైనా, పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)ను అనుసంధానించే కాబుల్‌-పెషావర్‌ హైవేను పూర్తిచేయాలనేది చైనా లక్ష్యం.

అపార ఖనిజ సంపద ఉండటంతో అఫ్గాన్‌లోని గనులు, ఇంధన రంగాల్లో చైనా కంపెనీలు భారీయెత్తున పెట్టుబడులు పెట్టాయి. ఇదంతా బాగానే ఉన్నా, చైనా ప్రాజెక్టులు దీర్ఘకాలంలో ముందుకు సాగేందుకు తాలిబన్లు ఎంతమేర సహకరిస్తారనేది పెద్దప్రశ్నే. మౌలిక సదుపాయాల ప్రణాళికలు, పెట్టుబడులు వంటివి గాలిలో దీపాల్లా మారతాయేమోననే సందేహమూ డ్రాగన్‌ను పీడిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అందరి చేతిలో పావుగా మారి ఛిద్రమైన అఫ్గాన్‌ను ఖనిజ సంపద మరింత గందరగోళంలోకి నెట్టే ప్రమాదం పొంచిఉంది.

చిక్కులూ ఎక్కువే

మరోవైపు, అఫ్గాన్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో చైనా, అమెరికా సంబంధాల్లోనూ మార్పులు చోటుచేసుకొనే అవకాశాలున్నాయి. సుదీర్ఘకాలంగా అఫ్గాన్‌లో యుద్ధ వాతావరణంతో సతమతమవుతున్న అమెరికా భారీయెత్తున నిధుల్ని, శక్తియుక్తుల్ని వెచ్చించింది. ఇంకోవైపున, దీన్ని సావకాశంగా పరిగణించిన చైనా అప్రతిహతంగా ఎదిగింది. ఇప్పుడు సైనిక ఉపసంహరణతో అగ్రరాజ్యం చైనాపై వ్యూహాలను పదునెక్కించే అవకాశం ఉంది. ఇది డ్రాగన్‌కు కొంతమేర ప్రతికూల పరిణామమే. అఫ్గాన్‌లోని ప్రైవేటు భద్రతా బలగాలు, రక్షణ కాంట్రాక్టర్లు, రాజకీయ వర్గాల ద్వారా షింజాంగ్‌లో సమస్యలు లేవదీయవచ్చని చైనా అనుమానిస్తోంది. అఫ్గాన్‌పై ఆధిపత్యం విషయంలో చైనాకు ఇతర దేశాల నుంచీ చిక్కులు లేకపోలేదు. లద్దాఖ్‌లో కవ్వింపులతో వేధిస్తున్న డ్రాగన్‌కు భారత్‌ పరోక్షంగా అఫ్గాన్‌లో సమస్యలు సృష్టించవచ్చని చైనా నిపుణులు అనుమానిస్తున్నారు.

హక్కానీ నెట్‌వర్క్‌తో చైనా సంబంధాలు ప్రపంచానికి తెలిసివచ్చేలా చేయడం వెనక భారత్‌ నిఘా సంస్థల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాలిబన్లతో సఖ్యత కోసం చైనా ఇప్పటికే యత్నాలు మొదలుపెట్టిందనే వార్తలూ వినవస్తున్నాయి. తమ గడ్డపై నుంచి ఇతర దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాల్ని అనుమతించబోమని తాజాగా తాలిబన్‌ ప్రతినిధి స్పష్టం చేసినా, ఆచరణలో ఎంతమేర కట్టుబడి ఉంటారనేది అనుమానమే. మరోవైపు ఇప్పటికే అమెరికాతో సంబంధాలు చేదెక్కిన చైనాకు, మరోసారి అగ్రరాజ్యం ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావచ్చు. తాలిబన్ల వంటి ఉగ్రసంస్థలకు సహకారం అందించడం వల్ల ఇతర దేశాల్లోనూ పరువు ప్రతిష్ఠలకు భంగకరంగా మారే ప్రమాదం ఉంది. డ్రాగన్‌ తన కార్యకలాపాలతో ఇతర దేశాల నుంచి ఇప్పటికైతే సమస్యలు ఎదుర్కోకపోయినా, అఫ్గాన్‌ పరిణామాల కారణంగా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సహజ స్వభావమైన విస్తరణ కాంక్ష చైనాను ఊరిస్తున్నా... అఫ్గాన్‌లో డ్రాగన్‌కు పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

వేర్పాటువాదుల సమస్య

అమెరికా ఉపసంహరణతో అఫ్గాన్‌లో చైనాకు ఎదురే ఉండదన్న అభిప్రాయాలున్నా, ఇందులో మరో కోణం కూడా ఉంది. అమెరికా తన ఆర్థిక, సైనిక బలంతో అఫ్గాన్‌ పరిస్థితులను(Afghanistan crisis) సుస్థిరపరచే చర్యలు కొనసాగించింది. వాటి మాటున చైనా అఫ్గాన్‌లో పెట్టుబడులు పెంచుతూ, అభివృద్ధి పేరిట సహాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడక్కడ ప్రశాంత వాతావరణం చెదిరితే చైనాకు ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల పరంగా అనుకున్నంత స్థాయిలో సానుకూల వాతావరణం ఉంటుందా అన్నదీ అనుమానమే. ఇదేకాకుండా, తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్‌- వీగర్‌ వేర్పాటువాదులు, తూర్పు టర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమకారులకు (ఈటీఐఎం) సురక్షిత స్థావరంగా మారవచ్చనే ఆందోళన డ్రాగన్‌ను వేధిస్తోంది. ఈ రెండు వర్గాలు చైనా షింజాంగ్‌ ప్రాంతంలో సవాలుగా మారాయి. అల్‌ఖైదా సహాయంతో 1996లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తాలిబన్లు ఈటీఐఎంకు శిక్షణ, సైనిక తోడ్పాటు, నిధుల సహాయం, ఆశ్రయం కల్పించడం వంటి సహాయ సహకారాలను అందించారు. షింజాంగ్‌ ప్రాంతంలో ఈటీఐఎం అల్లర్లు, దాడులు వంటి ఘటనలకూ పాల్పడింది.

2004లో తాలిబన్లు పలువురు చైనా నిర్మాణ కార్మికులనూ హతమార్చారు. ఈ కారణంగానే అగ్రరాజ్యం నిష్క్రమణ తరవాత, ఈటీఐఎం, తాలిబన్ల ఆధిపత్యం పెరగడమే కాకుండా, ఉగ్రభావజాల వ్యాప్తి, శరణార్థుల సమస్య పొరుగు దేశాలకూ పాకే ప్రమాదం ఉంటుందనే ఆందోళన డ్రాగన్‌ను వేధిస్తోంది.

- శ్రీనివాస్‌ దరెగోని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.