Challenges For ISRO: మరింత ఉన్నత కక్ష్యలోకి.. ఇస్రో

author img

By

Published : Jan 15, 2022, 8:43 AM IST

ISRO New chairman

Challenges For ISRO: మళ్లీమళ్లీ ఉపయోగించగల స్పేస్‌ షటిల్‌ కల నెరవేరేదాకా విశ్రమించడం తగదన్నది డాక్టర్‌ అబ్దుల్‌ కలాం నిర్దేశం. ఈ ఏడాది ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టుతోపాటు, గగన్‌యాన్‌కు సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగం చేపట్టాలని భారత రోదసి పరిశోధన సంస్థ ఉరకలెత్తుతోంది. స్వావలంబన దిశగా పురోగమించడమే ఇస్రోకు ప్రథమ సవాలు అంటున్న నూతన సారథి స్వీయ విధ్యుక్తధర్మ నిర్వహణలో ఏ మేరకు రాణిస్తారన్న అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది!

Challenges For ISRO: రోదసి ప్రయోగ రంగాన దిగ్గజ సంస్థగా ఎదిగిన ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సారథ్య బాధ్యతలు డాక్టర్‌ శివన్‌ నుంచి ప్రఖ్యాత రాకెట్‌ శాస్త్రవేత్త ఎస్‌.సోమనాథ్‌కు తాజాగా దఖలుపడ్డాయి. డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, ప్రొఫెసర్‌ సతీశ్‌ ధావన్‌, ప్రొఫెసర్‌ యు.ఆర్‌.రావు ప్రభృత లబ్ధప్రతిష్ఠులు నిర్వహించిన కీలక పదవి అది. దానికి ఎంపికైనవారిలో సోమనాథ్‌ పదో వ్యక్తి. శివుడన్నా, సోమనాథుడన్నా అర్థభేదం లేదు! పని రాక్షసుడని డాక్టర్‌ శివన్‌ పేరు పడ్డారు. ఆ ఒరవడిని సోమనాథ్‌ ఏ మేరకు కొనసాగిస్తారన్నది, ఇస్రో భావి గతిరీతుల్ని నిర్దేశించనుంది. నాలుగు దశాబ్దాల క్రితం 'ఇస్రో'లో చేరిన శివన్‌ ఉద్యోగ ప్రస్థానం పీఎస్‌ఎల్‌వీ విజయగాథకు సమాంతరంగా సాగింది. 'సితార' (సిక్స్‌ డి ట్రాజెక్టరీ సిమ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌) అభివృద్ధిలో, దక్షిణాసియా నుంచి మొట్టమొదటి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగ కసరత్తులో ఆయనది అత్యంత కీలక భూమిక. ఇస్రో వంటి సంస్థల్లో కొందరు వ్యక్తుల దశాబ్దాల నిబద్ధ కృషి ఫలం వట్టిపోదు. మున్ముందు చంద్రయాన్‌-2, ఆపై గగన్‌యాన్‌ విశిష్ట ప్రయోగాలను సజావుగా పట్టాలకు ఎక్కించడంలో శివన్‌ ప్రభావం నిశ్చయంగా ప్రస్ఫుటమవుతుందన్న అంచనాల వెనక తర్కమదే. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో, అక్టోబరు నవంబరు తుపాన్ల దృష్ట్యా- 2021 సంవత్సరంలో ఒక్క రాకెట్‌ ప్రయోగానికే ఇస్రో పరిమితమైంది. ఈ ఏడాది ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టుతోపాటు, గగన్‌యాన్‌కు సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగం చేపట్టాలని భారత రోదసి పరిశోధన సంస్థ ఉరకలెత్తుతోంది. స్వావలంబన దిశగా పురోగమించడమే ఇస్రోకు ప్రథమ సవాలు అంటున్న నూతన సారథి స్వీయ విధ్యుక్తధర్మ నిర్వహణలో ఏ మేరకు రాణిస్తారన్న అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది!

ISRO Aims And Objectives: ఉపగ్రహ ప్రయోగాల్లో ఇండియా ఏనాటికైనా సొంతకాళ్లపై నిలిచి నెగ్గుకు రాగలదా అనే వెక్కిరింతలు సుమారు మూడు దశాబ్దాల క్రితం తరచూ వినిపిస్తుండేవి. ఆ క్రమంలో ఇస్రో ఎన్నో వ్యయప్రయాసలు, అవహేళనలు, వైఫల్యాలను ఎదుర్కొని రాటుతేలింది. మళ్లీమళ్లీ ఉపయోగించగల స్పేస్‌ షటిల్‌ కల నెరవేరేదాకా విశ్రమించడం తగదన్నది డాక్టర్‌ అబ్దుల్‌ కలాం నిర్దేశం. నాసా (అమెరికా), రాస్కో మాస్‌ (రష్యా), జాక్సా (జపాన్‌), ఈఎస్‌ఏ (ఐరోపా అంతరిక్ష ఏజెన్సీ)లకే పరిమితమైన పునర్వినియోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టేదాకా ఇస్రో అవిశ్రాంతంగా పరిశ్రమించింది. స్క్రామ్‌జెట్‌ ఇంజిన్ల ప్రయోగంలో పట్టు సంపాదించడానికి అమెరికాకు మూడు దశాబ్దాలకుపైగా పట్టింది. ఆరేళ్లక్రితం, భూ వాతావరణంలోని గాలినే ఇంధనంగా వినియోగించుకునే స్క్రామ్‌జెట్‌ (సూపర్‌ సోనిక్‌ కంబస్టింగ్‌ రామ్‌ జెట్‌) ఇంజిన్లతో ప్రథమ యత్నంలోనే 'ఇస్రో' భేషనిపించుకుంది. అగ్రదేశాల సహాయ నిరాకరణకు వెరవకుండా మైనస్‌ 183 సెంటీగ్రేడ్‌ డిగ్రీల వద్ద ద్రవీకృత ఆక్సిజన్‌ను, మైనస్‌ 253 సెంటీగ్రేడ్‌ డిగ్రీల వద్ద ద్రవరూప ఉదజనిని వినియోగించే క్రయోజెనిక్‌ టెక్నాలజీ మెలకువల్నీ ఆకళించుకుంది. దురదృష్టవశాత్తు, గత ఆగస్టు నాటి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం- క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి విఫలమైంది. ఇటువంటి సాంకేతిక గండాల్ని అధిగమించడంతోపాటు వచ్చే ఏడాది చేపట్టదలచిన గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతమయ్యేలా సకల జాగ్రత్తలూ తీసుకోవడం ఇస్రో కొత్త నాయకుడి దక్షతకు గట్టి పరీక్ష కానుంది. 2030 సంవత్సరం నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని అవతరింపజేయాలన్నది భారతావని చిరకాల స్వప్నం. వాణిజ్య ప్రాతిపదికన ఉపగ్రహ ప్రయోగ సేవలు, రాకెట్లు తదితరాల నిర్మాణ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించాల్సి ఉంది. రోదసి పరిశోధనల్లో ప్రైవేటు పాత్ర ఇతోధికం కావాలని ప్రభుత్వం అభిలషిస్తోంది. ఇస్రో సమతూకంతో స్థిరంగా ముందడుగు వేయడానికి సోమనాథ్‌ కార్యసరళి దోహదపడాలన్నది- జాతి ఆకాంక్ష!

ఇదీ చదవండి: శత్రువులను ఏమార్చేలా.. భారత సైన్యానికి కొత్త యూనిఫాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.