'ఒంటరైన గాంధీజీ.. కీలక సమయంలో పక్కనబెట్టిన కాంగ్రెస్!'

author img

By

Published : Aug 5, 2022, 7:45 AM IST

mahatma gandhi indian independence
మహాత్మ గాంధీ ()

తెల్లవాడిపై సమరానికి హారంలో దారంలా చేరి.. ఉద్యమాల సారథులందరికీ వారధిలా మారి.. దారితెన్నూ లేకుండా సాగుతున్న జాతీయోద్యమాన్ని కొత్త బాట పట్టించి.. అహింస, సత్యాగ్రహం అనే సరికొత్త ఆయుధాలతో భారతావనిని స్వాతంత్య్రం దిశగా నడిపించిన గాంధీజీ.. ఉద్యమం చివరినాళ్లకొచ్చే సరికి ఒంటరయ్యారు. తన అంతఃకరణకు వ్యతిరేకంగా అంతా సాగిపోతుంటే.. ఒంటరిగా రోదించారు!

రెండో ప్రపంచయుద్ధం ముగిశాక.. బ్రిటన్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు మారి.. భారత్‌ నుంచి వైదొలగాలని ఆంగ్లేయులు నిర్ణయించుకున్నారు. అధికార బదిలీ ఎలా జరగాలో తేల్చడానికి కేబినెట్‌ మిషన్‌ను పంపించారు. దేశ విభజనకు గాంధీతోపాటు కేబినెట్‌ బృందమూ ససేమిరా అంది. కారణాలు ఏమైనా అంతిమంగా ఈ రాయబారం విఫలమైంది. అయినా.. ఆంగ్లేయులు భారత్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడటం లేదనే సంగతి అందరికీ అర్థమైంది. దాంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ల మధ్యే కాకుండా కాంగ్రెస్‌లోనూ అంతర్గతంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. ఫలితంగా 1946 చివరి నుంచి మెల్లమెల్లగా గాంధీజీని పక్కనబెట్టడం మొదలైంది. ఉదాహరణకు.. 1947 మార్చిలో పంజాబ్‌లో భారీ ఎత్తున హింస చెలరేగింది. ఆ నేపథ్యంలో సమావేశమైన జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. 'ఈ సమస్యకు పరిష్కారం పంజాబ్‌ విభజనే' అంటూ అభిప్రాయపడింది. ఆ సమయానికి బిహార్‌లో పర్యటిస్తున్న గాంధీజీకి ఈ విషయం పత్రికల ద్వారానే తెలిసింది. వెంటనే తన కాళ్లకింద భూమి కంపించినంత ఆందోళన చెందిన ఆయన మార్చి 20న నెహ్రూకు, తన కోడలు సుశీలకు లేఖ రాశారు. 'అధికార బదిలీ గురించి దేశంలో జరుగుతున్నది చూస్తుంటే.. నేనెక్కువ రోజులు బతకనేమో అనిపిస్తోంది. నామీద నాకే నమ్మకం పోతోంది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మార్చి 22న మౌంట్‌బాటెన్‌ వైస్రాయ్‌గా వచ్చారు. ఆయన్ను కలిసిన గాంధీజీ.. విభజన లేకుండా చూడాలని అనేక ప్రతిపాదనలు ముందుంచారు. అప్పటికే దేశ విభజనకు కాంగ్రెస్‌ ముందుకెళ్లింది. ఇటు నెహ్రూ, అటు జిన్నాల మద్దతుతో 1947 జూన్‌ 3న దేశ విభజన విధివిధానాలను ప్రకటించటానికి వైస్రాయ్‌ మౌంట్‌బాటెన్‌ ముహూర్తం పెట్టాడు. కానీ.. వారందరిలోనూ ఓ మూల గాంధీ భయం వెంటాడింది. అందుకే వైస్రాయ్‌ జులై 2న గాంధీజీతో భేటీ కోరాడు. అందుకు ఆయన నిరాకరించారు. ఆ రోజు సోమవారం.. మౌనవ్రతం ఆయనకు కలిసొచ్చింది. మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఆయనెవ్వరితోనూ మాట్లాడరు. కానీ.. రెండు సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చేవారు. ఒకటి.. రోగులను కలవాల్సి వచ్చినప్పుడు, రెండోది.. అత్యంత ఉన్నతస్థాయి వ్యక్తులతో అత్యవసరంగా సంభాషించాల్సిన అవసరం తలెత్తినప్పుడు! కావాలనుకుంటే.. వైస్రాయ్‌తో అత్యవసర విషయంపై చర్చించేందుకు వీలుంది. అయినా.. గాంధీజీ మౌంట్‌బాటెన్‌కు లేఖ రాస్తూ.. 'మన్నించండి నేను మాట్లాడలేను. నా మౌనవ్రతానికి రెండు మినహాయింపులున్నా.. నేను మౌనాన్ని వీడాలని మీరు కోరుకుంటున్నారనుకోను' అంటూ నర్మగర్భంగా తన మనసులోని ఆవేదనను వెల్లడించారు.

జూన్‌ 3న ఉదయం బాబూ రాజేంద్రప్రసాద్‌తో కలసి నడుచుకుంటూ.. 'నాకెందుకో వైస్రాయ్‌ ప్రకటిస్తాడంటున్న ప్రణాళికలో చెడు కనిపిస్తోంది. ఇక నేనెక్కువ కాలం బతకననటానికి తొలి సూచికగా నాలో ఓపిక నశిస్తోంది' అని గాంధీజీ వ్యాఖ్యానించారు. ఊహించినట్లే అదేరోజు మౌంట్‌బాటెన్‌ దేశాన్ని విభజిస్తున్నట్లు.. ఆగస్టు 15నే స్వాతంత్య్రం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిపై గాంధీజీ తన సాయంత్రం ప్రార్థన సమావేశాల్లో మాట్లాడతారేమోనని, విభజనను వెనక్కి తీసుకోవాలంటూ నిరాహార దీక్ష చేపడతారేమోననే ఆందోళన వ్యక్తమైంది. ఇదేవిషయమై.. నిరాహారదీక్ష చేపడతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'కాంగ్రెస్‌ చేసిన పిచ్చిపనికి నేను చావాలా?' అని ఎదురు ప్రశ్నించారాయన. తర్వాత కొద్దిరోజులకు విభజన విధివిధానాలపై చర్చించేందుకు వర్కింగ్‌ కమిటీ, ఏఐసీసీ సమావేశమయ్యాయి. ఇంతదాకా వచ్చాక చేసేదేమీ లేదని.. మెత్తబడాలంటూ ఏఐసీసీ సభ్యులంతా విన్నవించగా గాంధీజీ అయిష్టంగానే తలూపారు. బ్రిటన్‌ పార్లమెంటు భారత స్వాతంత్య్ర బిల్లును ఆమోదించటానికి ముందు గాంధీజీ మరో ప్రయత్నం చేశారు. సర్దార్‌ పటేల్‌ను ఉద్దేశించి.. "నువ్వుగనక విభజనకు అంగీకరించి ఉండకుంటే దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నేరాన్ని ఇప్పటికీ ఆపొచ్చు. ఒక్కసారి బిల్లు ఆమోదం పొందితే ఎవ్వరూ వినరు" అని లేఖ రాశారు. ఆయన అనుకున్నట్లు ఏదీ జరగలేదు. 1947 ఆగస్టు 15న బెంగాల్‌ అల్లర్ల బాధితుల మధ్య గడిపిన ఆయన సెప్టెంబరు 9న దిల్లీకి తిరిగి వచ్చారు. రైల్వే స్టేషన్‌లో ఆయన్ను స్వాగతించడానికి సర్దార్‌ పటేల్‌ తప్ప మరెవ్వరూ రాలేదు!

ఇవీ చదవండి: 11 నెలల ముందే భారత్​కు స్వాతంత్ర్యం ఇచ్చిన నేత.. 'మన అట్లీ'!

'ప్రధానిగా జిన్నా!'.. గాంధీ విఫలయత్నం.. దేశ విభజన ఇష్టం లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.