ETV Bharat / opinion

ఆకలి సమస్యకు అదే పరిష్కారం!

author img

By

Published : Oct 18, 2021, 7:20 AM IST

భారత్​లో క్షుద్బాధ, పోషకాహార లోపాలు పెరిగాయంటూ ప్రపంచ ఆకలి సూచిక వెల్లడించింది. అయితే ఈ నివేదిక తప్పులతడకగా ఉందంటూ కేంద్రం పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నార్తులకు అంతచక్కగా తోడ్పాటు, మానవీయ సహాయం లభిస్తుంటే దేశంలో ఇంకా ఆకలిచావులు ఎందుకు సంభవిస్తున్నాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

global hunger index
ఆకలి సమస్యకు పరిష్కారం

'ఆకలి రక్కసి కబంధ హస్తాల్లోంచి స్వేచ్ఛ సాధించడమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం'- భారత తొలి ఆహార, వ్యవసాయ శాఖామాత్యులు బాబూ రాజేంద్రప్రసాద్‌ 1947 ఆగస్టు 15న జాతికి ఇచ్చిన పిలుపు ఇది! స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న ఈనాటికీ- ఆ భూతం బారి నుంచి ఇండియా విముక్తి పొందలేకపోయింది. 116 దేశాల తాజా అంతర్జాతీయ క్షుద్బాధా సూచీ(జీహెచ్‌ఐ)లో భారత రత్నగర్భ 101వ స్థానంలో నిలిచింది. జనావళి ఆకలిదప్పులను తీర్చడంలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల కన్నా వెనకబడి తరగని దుష్కీర్తిని మూటగట్టుకుంది. ప్రజల్లో పోషకాహార లోపం, పిల్లల్లో దుర్బలత్వం, ఎదుగుదల లోపాలు, శిశుమరణాల ప్రాతిపదికగా జీహెచ్‌ఐ నివేదిక వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా క్షుద్బాధా సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో ఇండియా ఒకటని అది స్పష్టీకరించింది.

అశాస్త్రీయ విధానాల్లో అధ్యయనం సాగిందంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర ప్రభుత్వం- క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆ నివేదిక అద్దంపట్టడం లేదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా అయిదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేని వారు దాదాపు 35శాతమని, ఎత్తుకు తగిన బరువుకు నోచుకోని వారు 17.3 శాతమని కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి గత జులైలో లోక్‌సభలో వెల్లడించారు. పోషకాహార లోపంతో దేశవ్యాప్తంగా పసిప్రాణాలెన్నో కడతేరిపోతున్నట్లు లోగడ ఎన్నో పరిశోధనలు నిగ్గుతేల్చాయి. కొవిడ్‌ కారణంగా తెగ్గోసుకుపోయిన కుటుంబాదాయాలతో పేదరికం పడగనీడ విస్తరిస్తోంది. తత్ఫలితంగా క్షుద్బాధా పీడితుల సంఖ్య సైతం ఇంతలంతలవుతోంది. ప్రజల్లో పోషక విలువలను ఇనుమడింపజేస్తూ, వారి జీవన ప్రమాణాల వృద్ధికి బాటలు పరవడం పాలకుల విధి. ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్న 47వ రాజ్యాంగ అధికరణ స్ఫూర్తికి మన్నన దక్కితేనే- 'అన్నమో రామచంద్రా' అంటూ అలమటిస్తున్న అభాగ్యులకు సాంత్వన లభించి, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆసేతుహిమాచలం 80 కోట్ల మందికి పైగా క్రమం తప్పకుండా ఆహారధాన్యాలు చేరుతున్నట్లు సర్కారీ లెక్కలు సాక్ష్యమిస్తున్నాయి. అన్నార్తులకు అంతచక్కగా తోడ్పాటు, మానవీయ సహాయం లభిస్తుంటే దేశంలో ఇంకా ఆకలిచావులు ఎందుకు సంభవిస్తున్నాయి? ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలతో లబ్ధిదారులకు చేరాల్సిన ఆహారధాన్యాలు పక్కదారి పడుతున్నాయని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల ఆక్షేపించింది. ఎఫ్‌సీఐ గోదాముల్లో గడచిన మూడేళ్లలో 10వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యపురాశులు పాడైపోవడాన్నీ అది ఎత్తిచూపింది. పస్తులతో జనం అల్లాడుతున్న దేశంలో తిండిగింజల వృథాను అరికట్టడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని విమర్శించింది. సామాజిక భద్రతా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై 2030 వరకు ఏడాదికి రూ.5.5 లక్షల కోట్ల చొప్పున భారతదేశం వెచ్చిస్తేనే- ఆకలి కోరల్లోంచి బయట పడగలుగుతుందని ఐరాస గతంలో సూచించింది. సాగుభూములు తరిగిపోతూ, అన్నదాతలు అంతకంతకూ సమస్యల ఊబిలో మునిగిపోతూ దేశీయంగా వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుల కడగండ్లు తీర్చి ప్రభుత్వం వారికి అండగా నిలిస్తేనే- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తిస్తూ, అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జనావళి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొడుగుపట్టాలి. పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించినట్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠీకరించడమూ కీలకమే! సంక్షేమం, ఉపాధి కల్పనలను జోడుగుర్రాలుగా పరుగుతీయిస్తేనే- జాతి జవజీవాలను తోడేస్తున్న ఆకలి సమస్యకు పరిష్కారం లభిస్తుంది!

ఇదీ చూడండి : భారత్​ను వెంటాడుతున్న పోషకాహార సమస్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.