ETV Bharat / opinion

'అగ్నిపథ్'​తో యువతలో భయాందోళనలు.. అలా చేస్తేనే!

author img

By

Published : Jun 18, 2022, 9:54 AM IST

అగ్నిపథ్​
అగ్నిపథ్​

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్​ పథకం దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని యువత, ప్రతిపక్ష నేతలు డిమాండ్​ చేస్తున్నారు. అయితే పరిమితకాల శిక్షణతో అగ్నివీరులకు అలవరచడం సాధ్యమేనా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

'బాపూ, ఇస్‌ జన్మ్‌ మే నహీ బన్‌సకా.. అగ్లా జన్మ్‌ లియాతో ఫౌజీ జరూర్‌ బనూంగా' (నాన్నా, ఈ జన్మలో సైనికుణ్ని కాలేకపోయాను.. మళ్ళీ జన్మంటూ ఉంటే కచ్చితంగా అవుతాను)- ఏప్రిల్‌ నెలాఖరులో ఆత్మహత్య చేసుకున్న హరియాణాలోని భివాని జిల్లావాసి పవన్‌ పంఘాల్‌ ఆఖరి మాటలివి! సైన్యంలో నియామకాలు స్తంభించడం, వయోపరిమితి మించిపోవడంతో- కొన్నేళ్లుగా రోజూ తాను సాధన చేస్తున్న మైదానంలోనే ఆ ఇరవై మూడేళ్ల కుర్రాడు ఉరిపోసుకున్నాడు. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాకు చెందిన సైనిక ఉద్యోగార్థి ధనుంజయ్‌ మొహంతీ సైతం తాజాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'ఏడాదిన్నర క్రితమే శారీరక దారుఢ్య పరీక్షలో అతడు ఉత్తీర్ణుడయ్యాడు.. రాతపరీక్షను చాలాసార్లు వాయిదా వేశారు... అగ్నిపథ్‌ పథకం ప్రకటించి ఆఖరికిప్పుడు ఆ పరీక్షను రద్దుచేశారు.. వయసూ దాటిపోయింది.. అందుకే ప్రాణాలు తీసుకున్నాడు' అంటూ ధనుంజయ్‌ బంధుమిత్రులు భోరుమంటున్నారు. బిహార్‌ నుంచి తెలంగాణ వరకు 'అగ్నిపథ్‌'పై పెద్దయెత్తున పెల్లుబుకుతున్న నిరసనలకు అసలు కారణాలను కళ్లకుకట్టే దుర్ఘటనలివి.

సంవత్సరాల తరబడి కఠోరంగా శ్రమిస్తూ, ఏటా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలకోసం ఆశగా ఎదురుచూసేవారు ఒక్క యూపీలోనే నాలుగు లక్షల మంది దాకా ఉంటారని అంచనా. అధికారిక గణాంకాల ప్రకారం, గత సంవత్సరాంతానికి సైన్యంలో వివిధ స్థాయుల్లో పోగుపడిన ఖాళీలు లక్షకు పైనే. 2020-21లో దేశవ్యాప్తంగా 47 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను నిర్వహించినా, ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీఈఈ) పెట్టింది నాలుగు సందర్భాల్లోనే! మరుసటేడాది నాలుగు ర్యాలీలు జరిగాయి కానీ, ఎక్కడా 'సీఈఈ' ఊసేలేదు. దానికి కొవిడే కారణమని సర్కారు ఇన్నాళ్లుగా సెలవిస్తూ వస్తోంది. ఎవరూ కలవరపడనక్కర్లేదని, సైనికోద్యోగాల భర్తీ మళ్ళీ మొదలవుతుందని యూపీ ఎన్నికల వేళ రక్షణ శాఖామాత్యులు రాజనాథ్‌ సింగ్‌ సైతం అభయమిచ్చారు. ఉరుము లేని పిడుగులా 'అగ్నిపథ్‌' ప్రకటన వెలువడటంతో- అభ్యర్థులు ఆగ్రహోదగ్ధులవుతున్నారు. వారి భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎవరికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించాలి. వ్యవస్థలో పెనుమార్పులకు దారితీసే కొత్త విధానాన్ని నేరుగా పూర్తిస్థాయిలో అమలుచేయడం సరికాదంటున్న విశ్రాంత సైన్యాధికారుల సూచనలను మన్నిస్తూ, తన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలి!

సైన్యానికి దక్కుతున్న వార్షిక కేటాయింపుల్లో సింహభాగం రోజువారీ నిర్వహణ వ్యయాలు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది. ముఖ్యంగా పింఛన్లకు భారీ మొత్తాన్ని(ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల మేరకు రూ.1.19లక్షల కోట్లు) వెచ్చించాల్సి వస్తోంది. దాన్ని హేతుబద్ధీకరించాలన్న వాదనలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. 'సొమ్ము ఆదాకు అగ్నిపథ్‌ అక్కరకొస్తుంది. కానీ, కొన్ని సవాళ్లూ భయాలు ఉన్నాయి' అంటున్న విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా- దీర్ఘకాలం విధుల్లో ఉండేవారిలోని నీతి, నైతికత, ప్రేరణాశక్తులు అగ్నివీరుల్లో అంతే బలంగా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. 'శిక్షణా సంబంధిత వ్యవహారాలతో సంవత్సరం గడచిపోతుంది.. సర్వీసు చివరిలో పూర్తిచేయాల్సిన లాంఛనాలకు మరో ఆరునెలలు కరిగిపోతాయి.. నికరంగా అగ్నివీరులు పనిచేసేది రెండున్నరేళ్లు.. సైన్యంతో అనుబంధం పెంపొందిస్తూ, వారిలో క్రమశిక్షణకు ప్రోదిచేయడానికి ఆ కొద్దికాలం సరిపోదు' అని డెప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా (సిబ్బంది, వ్యవస్థలు) పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ జమీర్‌ ఉద్దీన్‌ షా విశ్లేషిస్తున్నారు. అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతల సమర్థ వినియోగాన్ని పరిమితకాల శిక్షణతో అగ్నివీరులకు అలవరచడం సాధ్యమేనా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల తరవాత వారిలోంచి బయటికొచ్చే 75శాతం సిబ్బంది భవితపైనా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏతావతా బలగాల పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా; వాటిలో సమరశీలత, కార్యకుశలతలను పెంపొందించేలా సంస్కరణలు సాకారం కావాలి. చైనా, పాకిస్థాన్‌ల రూపంలో దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న సమయంలో- పాలకులు సదా స్మరణలో ఉంచుకోవాల్సిన కీలక అంశమిది!

ఇదీ చూడండి: ఉరుముతున్న ఉగ్రముప్పు.. ఎనిమిది దేశాల 'ఉమ్మడి' పోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.