ETV Bharat / opinion

ఉరుముతున్న ఉగ్రముప్పు.. ఎనిమిది దేశాల 'ఉమ్మడి' పోరు!

author img

By

Published : Jun 6, 2022, 6:53 AM IST

kashmir terrorism meeting
kashmir terrorism meeting

DushanBey Meeting: అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంపై తజకిస్థాన్​లోని దుషాన్​బే వేదికగా ఇటీవలే కీలక సమావేశం జరగింది. ఇందులో భారత్​, చైనా, రష్యా సహా మరికొన్ని దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొని.. ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అఫ్గాన్‌ వల్ల పొరుగు దేశాలకు పొంచి ఉన్న ముప్పును దుషాన్‌బే సమావేశం తీవ్రంగానే పరిగణించి.. దాన్ని నివారించేందుకు ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించింది.

Terrorism Meeting: అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా కొన్నాళ్లుగా ఉగ్ర మిన్నాగుల కార్యకలాపాలు ఊపందుకొంటున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయమై తజకిస్థాన్‌లోని దుషాన్‌బే వేదికగా ఇటీవల కీలక సమావేశం జరిగింది. భారత్‌, చైనా, రష్యా, ఇరాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తజకిస్థాన్‌, కజకిస్థాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఇందులో పాల్గొన్నారు. అమెరికా దళాల ఉపసంహరణతో అఫ్గాన్‌ మళ్ళీ తాలిబన్ల వశమైంది. వారి ప్రేరేపిత ఉగ్ర సంస్థల నుంచి పొరుగు దేశాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాదం వల్ల ప్రాంతీయ భద్రతకు పొంచిఉన్న ముప్పుపై ఇందులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో పొరుగు దేశాలు
అఫ్గాన్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న జైషే మహమ్మద్‌, లష్కరే తొయిబా సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నియమించిన తాలిబన్‌ ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో వెల్లడించింది. అఫ్గాన్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న ఆ రెండు ఉగ్ర సంస్థలు తమ శ్రేణులను జమ్మూ కశ్మీర్‌ ప్రాంతాల్లోకి చొప్పించే ప్రమాదముందని తెలిపింది. ఈ తరుణంలో అఫ్గాన్‌ వల్ల పొరుగు దేశాలకు పొంచి ఉన్న ముప్పును దుషాన్‌బే సమావేశం తీవ్రంగానే పరిగణించింది. దాన్ని నివారించేందుకు ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించింది.

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ మార్పు సైతం ఈ ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి దోహదపడే అవకాశముంది. గతేడాది నవంబరులో భారత్‌లో నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనడానికి చైనా, పాకిస్థాన్‌లు నిరాకరించాయి. అప్పట్లో ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ప్రభుత్వానికి తాలిబన్‌ సర్కారుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తాలిబన్‌ ఉగ్ర ముఠాల నుంచి తలెత్తే ముప్పును నివారిస్తానని పాకిస్థాన్‌ హామీ ఇవ్వడంతో జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ భద్రత గురించి చైనా పెద్దగా పట్టించుకోలేదు. అఫ్గానిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న చైనా వ్యతిరేక ఈస్ట్‌ టర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ గురించీ చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇమ్రాన్‌ ప్రస్తుతం అధికారంలో లేరు. అఫ్గాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల మద్దతు చైనాలోని వీగర్‌ అనుకూల దళాలకు ఉంది. ఈ తరుణంలో చైనాకు సైతం అఫ్గాన్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. మరోవైపు అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉన్న హజారా ఆధిపత్య ప్రావిన్సుల్లో భద్రతాపరమైన భయం ఇరాన్‌ను వెంటాడుతోంది.

ఇటీవల అఫ్గానిస్థాన్‌లోని హజారా షియా ముస్లిములపై అక్కడి తీవ్రవాద ముఠాలు చేసిన దాడులు ఇరాన్‌లో తీవ్ర ఆందోళన కలిగించాయి. దాంతో అబాబిల్‌-2 పేరిట సైనిక డ్రోన్ల తయారీకి, ఆ సామర్థ్యాన్ని కలిగిన తజికిస్థాన్‌ను ఇరాన్‌ ఎంచుకుంది. అమెరికాకు, ఇరాన్‌లోని రివల్యూషనరీ గార్డ్స్‌కు విధేయతగా ఉన్నందువల్ల హజారా ముస్లిములు తాలిబాన్లనుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. రెండు దశాబ్దాల క్రితం హత్యకు గురైన తాలిబన్‌ వ్యతిరేక దళాల కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌, అనంతర కాలంలో అమ్రుల్లా సలేహ్‌ వంటి వారికి తజికిస్థాన్‌ స్థావరం కల్పించింది. భారత్‌, అమెరికాల మద్దతు కోరుతున్న అమ్రుల్లా సలేహ్‌- పంజ్‌షీర్‌ లోయ నుంచి ప్రస్తుతం మసూద్‌ తనయుడితో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తమ శత్రువులకు స్థావరాన్ని కల్పించినందువల్ల అఫ్గాన్‌ ఉగ్రమూకల నుంచి తజికిస్థాన్‌ ముప్పును ఎదుర్కొంటోంది. తాలిబన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థల నుంచి ప్రాంతీయ భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఓ సమష్టి కార్యాచరణ రూపొందించాలనే కృతనిశ్చయంతో ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి తజకిస్థాన్‌ వేదిక అయింది.

దౌత్యపరంగా ప్రయత్నాలు
తాలిబన్లకు పాకిస్థాన్‌ మద్దతు లేకపోతే భారత్‌ తన మిత్రదేశాలతో కలిసి అఫ్గాన్‌కు సరైన నాయకత్వాన్ని అందించే అవకాశముంది. పాక్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం భారత్‌కు చేరువ కావడానికి ప్రయత్నిస్తోందని ఇమ్రాన్‌ ఇటీవల ఆరోపించారు. కానీ, అఫ్గాన్‌ విషయంలో పాక్‌ నూతన ప్రభుత్వం భారత్‌కు సహకరించే అవకాశం కనిపించడం లేదు. శాంతికి విఘాతం కలిగించే ఉగ్ర సంస్థల కార్యకలాపాల నిరోధానికి భారత్‌ దౌత్య పరంగా ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో చైనాతో కనీసం తటస్థ సంబంధాలను నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాభవాన్ని తిరిగి చాటుకోవడానికి ఉగ్ర మూకలు కాచుకొని ఉన్న తరుణంలో జరిగిన దుషాన్‌బే సమావేశం ప్రాంతీయ శాంతికి గొడుగు పట్టడంలో కీలకంగా నిలవాలి. భాగస్వామ్య దేశాలన్నీ ఉగ్ర భయాలను పారదోలేందుకు సరైన కార్యాచరణ రూపొందించడంలో సమష్టి విజ్ఞత చూపాలి.

- బిలాల్‌ భట్‌
(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)

ఇవీ చదవండి: క్వాడ్ దేశాలకు చైనా సరికొత్త సవాల్

'రూపాయి' భారీ పతనం.. సామాన్యుడి బతుకు మరింత భారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.