ETV Bharat / opinion

Minerals in Afghanistan: వనరులు పుష్కలం.. ప్రగతి శూన్యం

author img

By

Published : Aug 24, 2021, 7:30 AM IST

ఆర్యులకు నెలవైన అఫ్గానిస్థాన్‌(Afghanistan news) ఆర్యానా, గాంధార, కాంభోజ దేశంగా, ఖొరసాన్‌గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. అక్కడ ఖనిజాల(Minerals in Afghanistan) తవ్వకాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందనడానికి అనేక ఆధారాలున్నాయి. చరిత్ర ప్రస్తుతించిన ఎందరో రాజుల కంఠాభరణాలుగా మారిన ఖరీదైన పచ్చలు, నీలమణులు, మాణిక్యాలు, వైడూర్యాలు అఫ్గాన్‌ గనుల(Afghanistan Mines) నుంచి వచ్చినవే.

afghan
అఫ్గానిస్థాన్

అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల పునరాగమనంతో ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు అఫ్గానిస్థాన్‌(Afghanistan news) వైపు మళ్ళింది. ఇంతకాలం అఫ్గాన్‌ ఖనిజ సంపదను, ఇతర వనరులను అక్రమంగా అనుభవిస్తూ వచ్చిన తాలిబన్లకు(Taliban Afghanistan) ఇక వాటిని సాధికారికంగా చేజిక్కించుకొనే అవకాశం దక్కింది. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాలిబన్లు దేశంపై తమ ఉచ్చును మరింత బిగించేందుకు, దక్షిణాసియాలో అశాంతికి ఆజ్యం పోసేందుకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం ఆందోళన రేపుతోంది. ఆర్యులకు నెలవైన అఫ్గానిస్థాన్‌ ఆర్యానా, గాంధార, కాంభోజ దేశంగా, ఖొరసాన్‌గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. అక్కడ ఖనిజాల(Minerals in Afghanistan) తవ్వకాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందనడానికి అనేక ఆధారాలున్నాయి. చరిత్ర ప్రస్తుతించిన ఎందరో రాజుల కంఠాభరణాలుగా మారిన ఖరీదైన పచ్చలు, నీలమణులు, మాణిక్యాలు, వైడూర్యాలు అఫ్గాన్‌ గనుల నుంచి వచ్చినవే. ఇప్పటికీ అక్కడ అక్రమంగా విలువైన మణుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

అఫ్గాన్‌లో కాంస్య యుగం (క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల) నాటికే బంగారు గనుల తవ్వకం, ఆభరణాల తయారీ కొనసాగుతున్నట్లు పురావస్తు ఆధారాలు చాటుతున్నాయి. బ్యాక్ట్రియన్‌ జ్యుయలరీగా ప్రసిద్ధి చెందిన పురాతన అఫ్గాన్‌ బంగారు ఆభరణాలెన్నో అక్కడి బమియాన్‌, కాందహార్‌ తదితర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి. పురాతన పారశీక సామ్రాజ్యంలో భాగంగా ఉన్న రోజుల్లో అఫ్గానిస్థాన్‌ను గాంధార దేశంగా పిలిచేవారు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో గ్రీకు యోధుడు అలెగ్జాండర్‌ దండెత్తివచ్చిన నాటికే ఆ ప్రాంతం బంగారం, సీసం తదితర గనులకు ప్రసిద్ధి.

అపార సహజ సంపద

అఫ్గానిస్థాన్‌ నేలలో అనేక లోహ, పారిశ్రామిక ఖనిజ నిక్షేపాలున్నాయని అఫ్గాన్‌, అమెరికా భౌగోళిక సర్వేక్షణ సంస్థలు ఏనాడో గుర్తించాయి. ఈ రెండు సంస్థలు రూపొందించిన నివేదిక ప్రకారం అఫ్గాన్‌ భూమిలో యాస్‌బెస్టాస్‌, బారైట్‌, బాక్సైట్‌, బెరీలియమ్‌, క్రోమియమ్‌, రాగి, ఫెల్డ్‌స్పార్‌, జెమ్‌స్టోన్స్‌, బంగారం, వెండి, ఇనుము, సీసం, లిథియం, మెగ్నీషియమ్‌, పాలరాయి, సీసం, మైకా, నికెల్‌, గంధకం, జింక్‌ వంటి ఇంధనేతర ఖనిజాలున్నాయి. విస్తారంగా బొగ్గు, సహజవాయువు, యురేనియం నిక్షేపాలకు సైతం అఫ్గాన్‌ నెలవు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, లేజర్లు, బ్యాటరీల్లో వినియోగించే అరుదైన మృత్తికా మూలకాలు (రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌) కూడా అఫ్గాన్‌ నేలలో నిక్షిప్తమై ఉన్నాయి. రక్షణ రంగంలోనూ వీటి వాడకం కీలకం. ట్యాంక్ నేవిగేషన్‌, క్షిపణి రక్షణ సామగ్రి తయారీలోనే కాకుండా ఉపగ్రహాల నిర్మాణంలోనూ అరుదైన మూలకాలు వినియోగిస్తారు. ప్రపంచంలో ఈ మూలకాలు, లోహాలు అత్యధికంగా అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నాయని అమెరికా అంచనా వేసింది.

నవరత్నాల్లో ముఖ్యమైనదిగా భావించే వైడూర్యం అఫ్గాన్‌కే ప్రత్యేకం. దాదాపు 49 లక్షల టన్నుల బాక్సైట్‌, 6.6 కోట్ల టన్నుల రాగి, 264 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం, సుమారు కోటిన్నర ఘనపుటడుగుల సహజవాయువు, 130 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిక్షేపాలు అఫ్గాన్‌ నేలలో ఉన్నాయి. ఇంతటి అపార సహజ సంపదలున్నా దశాబ్దాల అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత, అంతులేని అవినీతి అఫ్గాన్‌ ఆర్థికాన్ని పూర్తిగా కుంగదీశాయి. ప్రస్తుతం అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, దాదాపు 20లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం పేర్కొంది. అఫ్గాన్‌ ప్రజానీకంలో దాదాపు మూడో వంతు దారిద్య్రరేఖకు దిగువన మగ్గుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అన్ని రంగాల్లోనూ అఫ్గానిస్థాన్‌ది(Afghanistan Taliban) దయనీయ పరిస్థితే. పౌష్టికాహార లేమితో అక్కడి పిల్లల్లో సగం మంది సరైన శారీరక, మానసిక వికాసం సాధించలేకపోతున్నారు.

భవిష్యత్తు ఏమిటి?

ప్రజా సంక్షేమంపై దృష్టి సారించేలా సుస్థిర ప్రభుత్వం లేకపోవడంతో ఇన్నాళ్లూ అఫ్గాన్‌ ప్రజలు తమ దేశ సహజ వనరుల ప్రయోజనాలను పొందలేకపోయారు. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకోగలిగితే అఫ్గానిస్థాన్‌ దారిద్య్రం నుంచి విముక్తమై ఆధునిక పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెందుతుంది. కొన్ని దశాబ్దాలుగా ముజాహిదీన్లు, తాలిబన్లు ఆయుధాలను సమకూర్చుకోవడానికి అక్రమ ఖనిజ తవ్వకాలను ప్రోత్సహిస్తూ వచ్చారని అఫ్గానిస్థాన్‌ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నివేదిక పేర్కొంటోంది.

అక్కడ వేలాది గనులను అక్రమంగా తవ్వుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు(Taliban Afghanistan) అధికారంలోకి రానున్నారు. అన్ని రంగాల్లో భారత్‌ పట్ల వైరభావం ప్రదర్శిస్తున్న చైనా తాలిబన్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రాపకంతో అఫ్గాన్‌ సహజ సంపదను చైనా వశం చేసుకుంటుందా? ఖనిజాలను తవ్వుకొనే హక్కును తాలిబన్లు ఎవరికి కట్టబెడతారు? తద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా వినియోగిస్తారు? ఈ ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి. అంతులేని సహజవనరులున్నా విదేశీ సాయంపై ఆధారపడిన పేదదేశంగా మిగిలిపోయిన అఫ్గాన్‌ ఇంకెంతకాలం ఉగ్ర మూకల దోపిడికి గురవుతుందో, అసలు దాని భవిష్యత్తు ఏమవుతుందో కాలమే తేల్చాల్సి ఉంది.

- ఎన్‌.ఎమ్‌.ముకరమ్‌

ఇదీ చదవండి:Afghanistan Taliban: మాదకద్రవ్య కర్మాగారంగా అఫ్గాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.