ETV Bharat / opinion

అంతా డ్రోన్ల మయం.. ఎగిరే యంత్రాలతో లాభాలెన్నో

author img

By

Published : Jul 27, 2021, 6:49 AM IST

కరోనా మహమ్మారితో అన్ని రంగాలూ దెబ్బతిన్న పరిస్థితుల్లో వస్తు రవాణా, వైద్య సేవలకు డ్రోన్ల సాంకేతికత బాగా అక్కరకొస్తుంది. అయితే.. డ్రోన్లతో లాభాలు చాలానే ఉన్నా, ప్రమాదాలూ అదే స్థాయిలో పొంచి ఉన్నాయి. అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

drones
డ్రోన్ల మయం

గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటివచ్చే డ్రోన్లతో దేశభద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నది నిర్వివాదాంశం. అటువంటి వాటిని కచ్చితంగా అడ్డుకోవాల్సిందే. అదే సమయంలో సామాజిక అవసరాల కోసం ఆ ఎగిరే బుల్లి యంత్రాలను సద్వినియోగం చేసుకోవడమూ అంతే అవసరం. కరోనా మహమ్మారితో అన్ని రంగాలూ దెబ్బతిన్న పరిస్థితుల్లో వస్తు రవాణా, వైద్య సేవలకు డ్రోన్ల సాంకేతికత బాగా అక్కరకొస్తుంది. వీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై సౌదీ అరేబియా వంటి దేశాలు దృష్టి సారించాయి. కొవిడ్‌ మొదటి, రెండు దశల్లో కొన్ని దేశాలు మందులు, ఇతర నిత్యావసరాల సరఫరాకు డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయెల్‌ వీటి ద్వారా ఏడాదిపాటు నిరంతరాయంగా పౌరసేవలు అందించింది.

భారత్‌లో కొత్త నిబంధనలు

నిత్యావసరాలు, ఔషధాల రవాణా, రసాయనాల పిచికారీ, సినిమా చిత్రీకరణల్లో ప్రస్తుతం డ్రోన్లు విరివిగా ఉపయోగపడుతున్నాయి. సాంకేతికంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న డ్రోన్లు ప్రస్తుతం 500 కిలోల బరువుండే వస్తువుల రవాణాకూ అక్కరకొస్తున్నాయి. భవిష్యత్తులో వస్తురవాణాలో (కార్గో సేవలకు) డ్రోన్ల వినియోగం మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత రవాణా విధానాలకు ఉన్న పరిమితుల వల్ల కొన్ని ప్రాంతాలకు సరకుల చేరవేత భారంగా మారుతోంది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే ఇందులో గణనీయమైన మార్పు వస్తుంది. ఖర్చు తగ్గడంతోపాటు సరకులను సకాలంలో చేరవేసే వెసులుబాటు ఉంటుంది. రహదారులు లేని చోట్ల సముద్ర తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అడవుల్లో నివాసం ఉండే సమూహాలకు సరకు రవాణా సులువు అవుతుంది. ఆంబులెన్సులు వెళ్ళలేని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఎయిర్‌ లిఫ్ట్‌ ఆంబులెన్స్‌ తరహా సేవలను అందించవచ్చని, ఆ మేరకు రాబోయే కాలంలో అవి అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.

విధివిధానాల రూపకల్పనపై..

సౌదీ అరేబియాలో భారీ వస్తు రవాణా డ్రోన్ల ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నారు. రువాండా, స్విట్జర్లాండ్‌, ఇండియాతో పాటు మరికొన్ని దేశాలు డ్రోన్ల వినియోగానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై దృష్టి సారించాయి. భారత పౌర విమానయాన శాఖ 'డ్రోన్ల నిబంధనలు 2021' ముసాయిదాను రూపొందించింది. ప్రస్తుతం దానిపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. వచ్చే నెల అయిదో తేదీ లోగా ఈ నిబంధనలపై అభిప్రాయాలను తెలపాలని ప్రజలను కోరింది. ఈ విధానంలో భాగంగా డ్రోన్ల వినియోగానికి సంబంధించిన అర్హత పత్రాలను 25 నుంచి ఆరుకు తగ్గించారు. నూతన నిబంధనల పరిధిలోకి వచ్చే డ్రోన్ల బరువును 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. సరకు రవాణా కోసం డ్రోన్‌ కారిడార్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే 'డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌' ఏర్పాటు అవుతుంది.

లాభాలతో పాటు ప్రమాదాలూ..

డ్రోన్లతో లాభాలు చాలానే ఉన్నా, ప్రమాదాలూ అదే స్థాయిలో పొంచి ఉన్నాయి. అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీనగర్‌ విమానాశ్రయంలోని వాయుసేన స్థావరంపై ఇటీవల జరిగిన ఉగ్రదాడే ఇందుకు ఉదాహరణ. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకునే పలు దేశాలు డ్రోన్ల తయారీ, వినియోగంపై ఆంక్షలు అమలుచేస్తున్నాయి. రువాండా ప్రభుత్వం సైతం గతంలో ఈ మేరకు కఠిన ఆంక్షలు విధించింది. కొన్నేళ్ల క్రితం జిప్‌లైన్‌ అనే స్టార్టప్‌ సహాయంతో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పెద్ద మొత్తంలో సరఫరాకు ఆ దేశం నడుంకట్టింది.

రక్తం, టీకాలు, మందులు వంటి వాటిని ఈ డ్రోన్లు గ్రామీణ ప్రాంత ఆసుపత్రులకు అత్యవసర సమయాల్లో చేరవేశాయి. దీంతో రువాండా ఇప్పుడు డ్రోన్ల వినియోగంపై ఉన్న ఆంక్షలను సడలించి- ఎక్కువ స్థాయిలో వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అమెరికాలో సైతం కొవిడ్‌ కాలంలో డ్రోన్ల ద్వారా వైద్య ఉపకరణాల సరఫరా ఊపందుకొంది. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు డ్రోన్లద్వారా టీకాలు, ఔషధాల పంపిణీకి సంబంధించి ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకొంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి ఏపీ సర్కారు తలపోస్తోంది. డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీకి స్విగ్గీ సమాయత్తమవుతోంది. దీంతో పాటు మరికొన్ని సంస్థలకూ ఈ మేరకు అనుమతులు లభించాయి.

ప్రోత్సాహం కీలకం

ఆధునిక సమాజంలో విప్లవాత్మకమైన మార్పులకు డ్రోన్లే శ్రీకారం చుడతాయని, దానికి ఎంతో సమయం పట్టదని అభివృద్ధి చెందిన దేశాలు చెబుతున్నాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా దేశీయంగా ఈ ఆధునిక సాంకేతికతను విరివిగా అందిపుచ్చుకోవాల్సి ఉంది. సమర్థ నిబంధనల రూపకల్పన ద్వారా ప్రభుత్వాధినేతలు దీనిపై దృష్టి సారించాలి. ఉగ్రవాద చర్యలకు డ్రోన్లు ఆయుధాలు కాకుండా నిలువరిస్తూనే- అత్యవసర సేవల వినియోగంలో వాటి ఆవశ్యకతను గుర్తించాలి. జనావళి జీవనప్రమాణాల పెంపుదలకు ఉపకరించే డ్రోన్ల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి. సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పటికే ఈ మేరకు వినూత్న ప్రణాళికలు రచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వస్తు రవాణాకు రహదారి వ్యవస్థ అనేది సమస్య కాకూడదనే రీతిలో డ్రోన్ల వినియోగంపై ఆయా ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి. రేపటి ప్రపంచ గమనానికి అవి కొత్త మార్గసూచికలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- నాదెళ్ల తిరుపతయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.