ETV Bharat / opinion

పరిశోధనలే ప్రజారోగ్యానికి కీలకం

author img

By

Published : Mar 4, 2021, 7:11 AM IST

A special story on health equipment's facilities  in India
పరిశోధనలే ప్రజారోగ్యానికి కీలకం

కరోనా సంక్షోభంతో వైద్య పరికరాల అవసరం అందరికీ తెలిసొచ్చింది. దేశంలో వైద్య పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ.. దేశీయ ఉత్పత్తిరంగం తక్కువ విలువ కలిగిన ఉత్పత్తులకే పరిమితమైంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వైద్య రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొవిడ్‌ వ్యాప్తి, కఠినమైన లాక్‌డౌన్‌ల విధింపునకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సరఫరా గొలుసులపై అంతరాయాల ప్రభావం కనిపించింది. దానివల్ల వైద్య పరికరాలు సహా అత్యవసర ఉత్పత్తుల సరఫరాలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. అనంతరం చరిత్రలో ఎప్పుడూ లేనిస్థాయిలో ఆరోగ్యరంగానికి కొవిడ్‌ సవాలుగా నిలిచింది. తీవ్ర సంక్షోభాలను వేగంగా, సరికొత్త పద్ధతుల్లో ఎదుర్కోవలసిన అవసరాన్ని మహమ్మారి నొక్కి చెప్పినట్లయింది. భారత్‌లో వైద్య పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తిరంగం తక్కువ విలువ కలిగిన ఉత్పత్తులకే పరిమితమైంది. ఎలక్ట్రానిక్‌ వైద్య పరికరాలతో పోలిస్తే 'మెడికల్‌ డిస్పోజబుల్స్‌, కంజ్యూమబుల్స్‌' వంటి పరికరాల ఉత్పత్తిని దేశీయంగా చేపట్టేందుకు పెట్టుబడుల అవసరం తక్కువగానే ఉంటుంది. అయితే మూలధనాన్ని ముందస్తుగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఖరీదైన వైద్య పరికరాల అవసరాలకు 70-90శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇతర దేశాలకు మన వైద్య పరికరాలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించడం కంటే 'దిగుమతి ప్రత్యామ్నాయం'పై దృష్టి సారించడం ముఖ్యం.

దిగుమతుల ఉచ్చు

వైద్య పరికరాల రంగంలో భారత్‌ ఆసియాలో నాలుగో పెద్ద విపణిగా వెలుగొందుతోంది. మొదటి మూడు స్థానాల్లో జపాన్‌, చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా ఈ రంగంలో 20వ స్థానంలో ఉంది. ఇతర దేశాలు ఉత్పత్తులకోసం స్థానిక కంపెనీలను ప్రేరేపించే ప్రక్రియ రెండు మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. మన దేశంలో స్థానిక పరిశ్రమలను ఉత్పత్తుల దిశగా ఇప్పటికైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రానున్న అయిదు లేదా పదేళ్లలో- దిగుమతుల ఉచ్చు నుంచి దేశీయ వైద్య పరికరాల పరిశ్రమను కాపాడాలి. వైద్య సాంకేతిక రంగం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల విలువ కలిగిన విపణి. ఇది భవిష్యత్తులో మరింత ఉజ్జ్వలంగా రాణించేందుకు అవకాశాలు పుష్కలం. కొన్నేళ్లుగా ఈ రంగంలో ఇండియా అభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో వైద్యపరికరాల మార్కెట్‌ విలువ 1,100 కోట్ల డాలర్లు (80 వేల కోట్ల రూపాయలు). దేశీయ ఔషధ రంగం మూడు దశాబ్దాలకు ముందు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడి ఉండేది. సరిగ్గా అదే పరిస్థితిని ప్రస్తుతం దేశీయ వైద్య పరికరాల రంగం ఎదుర్కొంటోంది. 'భారత్‌లో తయారీ' ఉద్దేశానికి సార్థకత చేకూరేలా దేశీయ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం స్టెతస్కోపులు, గ్లూకోమీటర్లు వంటి సాధారణ స్థాయి పరికరాల నుంచి ఎంఆర్‌ఐ, సీటీ స్కానర్ల వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే- కస్టమ్స్‌ చట్టాలు అత్యంత సంక్లిష్టంగా ఉండటం. దురదృష్టవశాత్తు, వందల రకాల కస్టమ్స్‌ సుంకాలు అమలులో ఉన్నాయి.

ప్రజారోగ్యానికి ఉన్న ప్రాధాన్యమేమిటో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేసింది. 'భారత్‌లో తయారీ'పై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం వైద్య పరికరాల రంగం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో తయారీ మాత్రమే దేశీయ వైద్య పరికరాల అవసరాన్ని తీర్చగలదు. అది కూడా తక్కువ వ్యయంతో. ఏదేమైనా ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు కాస్త ప్రోత్సాహకాలు లభించడం ఊరట కలిగించే అంశం. పలు పరికరాలపై దిగుమతి సుంకాలు చాలా హెచ్చుస్థాయిలో ఉన్నాయి. నేడు వైద్య సాంకేతిక రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా దేశీయ కంపెనీలు ఎదిగేందుకు పరిశోధన-అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ)పై ప్రభుత్వం దృష్టి సారించాలి. పరిశోధనలకు భారీయెత్తున పెట్టుబడులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. వైద్యపరికరాల రంగంలో పరిశోధనలు, అభివృద్ధికయ్యే వ్యయంపై ప్రభుత్వం పన్ను మినహాయింపునూ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పెట్టుబడులపై కృషి

ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆర్‌ అండ్‌ డీ పాత్ర ఎంతో కీలకం. పరిశోధనలు ప్రాథమిక అంశమే అయినా, వాటినే పునాదులుగా చేసుకొన్న పరిశ్రమలు స్థిరంగా ఎదుగుతాయనే విషయాన్ని విస్మరించరాదు. అందుకే ప్రభుత్వం ఆర్‌ అండ్‌ డీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని పరిశ్రమలకూ పరిశోధనలు కీలమైనవే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వైద్య పరికరాల రంగంలో పరిశోధనల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. పరిశోధన, సాంకేతికత కోణంలో దేశీయ వైద్య పరికరాల రంగం మరెంతో వృద్ధిని సాధించాల్సి ఉంది. ఈ రంగం పురోభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలనూ కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. ఈ రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి. మౌలిక వసతులు సమకూరినప్పుడే పరిశోధన-అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆ ఫలాలు పరిశ్రమకు అందుతాయి. వైద్యపరికరాల ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలకు ‘ట్యాక్స్‌ హాలిడే’ ప్రకటిస్తే దేశీయంగా ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు అంతర్జాతీయ మేధాహక్కుల అభివృద్ధికి అవసరమైన పన్ను ప్రోత్సాహకాలు పరిశ్రమకు అందిస్తే ప్రజారోగ్య రంగంలో మేకిన్‌ ఇండియా స్వప్నం సాకారమవుతుంది!

రచయిత- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.