ETV Bharat / opinion

ప్రజాస్వామ్యానికి సంకెళ్లు! అత్యయిక స్థితికి 45 ఏళ్లు

author img

By

Published : Jun 25, 2020, 7:35 AM IST

స్వాతంత్య్రానంతరం సుమారు మూడు దశాబ్దాలపాటు సాఫీగా సాగిన భారత ప్రజాస్వామ్య రథానికి అత్యయిక పరిస్థితి రూపంలో 1975లో బ్రేకులు పడ్డాయి. అనువంశిక పాలన, నియంతృత్వ ధోరణి, వ్యక్తిపూజ వంటి దుర్లక్షణాలు కోరసాచాయి. 1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిర తీసుకువచ్చిన అత్యవసర పరిస్థితి.. మధ్య యుగ విలువలను దేశం నెత్తిన రుద్దింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిన ఆ ఘటనకు నేటికి నాలుగున్నర దశాబ్దాలు.

45 YEARS FOR EMERGENCY
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు! ఆత్యయిక స్థితికి 45 ఏళ్లు

రాజ్యాంగ విలువలు, సమన్యాయ సూత్రాల అమలు, సమున్నత ఆదర్శాలకు కట్టుబడిన శాసన న్యాయవ్యవస్థలు... ప్రజాస్వామ్య భారతావని కంఠాభరణాలు! స్వాతంత్య్రానంతరం సుమారు మూడు దశాబ్దాలపాటు సాఫీగా సాగిన భారత ప్రజాస్వామ్య రథానికి అత్యయిక పరిస్థితి రూపంలో 1975లో బ్రేకులు పడ్డాయి. అనువంశిక పాలన, నియంతృత్వ ధోరణి, వ్యక్తిపూజ వంటి దుర్లక్షణాలు కోరసాచాయి. 1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిర తీసుకువచ్చిన అత్యవసర పరిస్థితి.. మధ్య యుగ విలువలను దేశం నెత్తిన రుద్దింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిన ఆ ఘటన నేటికి నాలుగున్నర దశాబ్దాలు. ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పటికీ ఆ మకిలి అధ్యాయం తాలూకు ఛాయలు పాలనలో, పాలకుల్లో అక్కడక్కడా దర్శనమిస్తుండటం బెంబేలెత్తించే పరిణామం. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తూ పౌరుల వాక్‌స్వాతంత్య్రాన్ని సైతం కాలరాస్తున్న నాయకమ్మన్యులకు ఇప్పుడూ కొదవలేదు.

చీకటి అధ్యాయం

లోక్‌సభ సభ్యురాలిగా 1971లో ఇందిర గెలుపును సవాలు చేస్తూ ఆమెపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో అత్యయిక పరిస్థితికి బాటలు పడ్డాయి. ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదు కాబట్టి, ఆమె అధికారంలోనుంచి దిగిపోవాలని 1975 జూన్‌ 12న అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆమె ప్రధానిగా కార్యనిర్వహణ చేయడానికి వీలులేదని, శాసనసభ సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడటం, ఓటు వేయడం, లోక్‌సభ సభ్యురాలిగా జీతం పొందడం చేయకూడదు అన్న షరతులతో 'సుప్రీం' న్యాయమూర్తి కృష్ణ అయ్యర్‌ ఆమెకు బెయిలు మంజూరు చేశారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులకు సమయం అవసరమని భావించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పును ఇరవై రోజులపాటు వాయిదా వేస్తున్నట్లూ ప్రకటించింది. అదే ఈ దేశం కొంపముంచింది. ఆ నేపథ్యంలోనే సర్వోదయ ఉద్యమ నాయకులు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇందిర రాజీనామా కోరుతూ దేశవ్యాప్త సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. ఆ తరుణంలోనే అంతర్గత కల్లోలంనుంచి దేశాన్ని కాపాడాలన్న కారణం చెప్పి ఇందిర ప్రభుత్వం 'ఎమర్జెన్సీ' ప్రకటించింది. ఇందిరతోపాటు ఆమె చిన్న కొడుకు సంజయ్‌ గాంధీల నియంతృత్వం నడిచిన కాలమది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల పేరిట జరిగిన అరాచకాలు, పార్టీ కార్యకర్తల అండతో చోటుచేసుకున్న దాడులు, ఆదాయపుపన్ను శాఖను 'బ్లాక్‌ మెయిల్‌' చేసే యత్నాలు, పత్రికలపై ఉక్కుపాదం, పార్టీలోని భజనపరులు, తైనాతీలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం, ప్రతిపక్ష నాయకులను, మేధావులను, కవులు, రచయితలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళలో బంధించడం వంటి అన్యాయాలు అడ్డూ ఆపూ లేకుండా జరిగాయి.

రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చివేస్తూ పార్లమెంటుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టే సవరణలూ తీసుకువచ్చారు. పార్లమెంటు పదవీ కాలాన్ని అయిదేళ్లనుంచీ ఆరేళ్లకు పెంచారు. 'మిసా' (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం 1973) ద్వారా వేల సంఖ్యలో అసమ్మతి వాదుల్ని చెరసాలల్లో బంధించారు. వార్తా పత్రికల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పత్రికల్లో ఏం రాయాలో, ఏం రాయకూడదో ఆంక్షలు విధించారు. దీని ఫలితంగా కొన్ని దినపత్రికలు సంపాదకీయం ఉండాల్సిన చోటును ఏమీ రాయకుండా ఖాళీగా ఉంచి తాము అణచివేతకు గురవుతున్నామని పరోక్షంగా వెల్లడించేవి. ఆ ప్రయత్నాలపైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా లేనట్లు కనిపించిన పాత్రికేయులు, వ్యంగ చిత్రకారులు, ఛాయాచిత్రకారులతో సహా అనేకమంది గుర్తింపు పత్రాలను రద్దు చేశారు. పాత్రికేయులకు వర్తించే సౌకర్యాలను రద్దు చేయడంతోపాటు పత్రికా సమావేశాల్లో పాల్గొనకుండా వారిని నిషేధించారు. దేశ ప్రజాస్వామ్య, సామ్యవాద విలువల పరిరక్షణకే ఆ చర్యలన్నీ చేపట్టినట్లు ఆనాటి ప్రభుత్వం నిస్సంకోచంగా ప్రచారం చేసుకోవడం దురదృష్టకరం. అంతర్గత అత్యవసర పరిస్థితుల పేరిట ఇందిర జమానాలో తీసుకువచ్చిన చట్టాలపై జనతా పార్టీ అధికారంలోకి రాగానే 1977 ఆగస్టులో శ్వేతపత్రం సమర్పించింది. రాజ్యాంగానికి చేసిన వివిధ సవరణలతో పాటు అనేక చట్టాలను పూర్వ స్థితికి తీసుకు వచ్చారు.

భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం

వర్తమానంలోనూ ఈ తరహా అత్యవసర పరిస్థితులు అక్కడక్కడా కొనసాగుతూ ఉండటమే బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ భజనస్వామ్యం పొడగడుతోంది. పాలకుల్లో విమర్శను సహించలేనితత్వం తరచూ మోరచాస్తూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నవారిని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం, దాడులు చేసి నోరు మూయించడం, కేసులు పెడతామని చెప్పి తమవైపు తిప్పుకోవడం వంటివి ఇవాళ్టి ప్రజాస్వామ్యంలో చాలా సాధారణ అంశాలుగా మారిపోవడమే బాధకలిగించే పరిణామాలు. పార్టీ శ్రేణుల సాయంతో దాడులకు తెగబడటం వంటివి ప్రతిచోటా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య భారతావనిలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే అవకాశాలు కొరవడుతున్న తీరు చూస్తుంటే అత్యవసర పరిస్థితులు ఏదో స్థాయిలోనైనా గుర్తుకురాక మానవు. ప్రజలే పాలకులు కావలసిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల వ్యక్తిత్వ పరిపూర్ణతకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాణవాయువు వంటిది. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ మనజాలదు. నిర్మాణాత్మక చర్చలు, సూచనలు, విమర్శలతోనే పరిణత ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటుంది.

-- ఆనిసెట్టి శాయికుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.