ETV Bharat / lifestyle

లక్ష్మీనివాసం... ఇలా ఉంటుంది!

author img

By

Published : Nov 14, 2020, 6:39 AM IST

‘మా నట్టింట అడుగు పెట్టమ్మా’ అంటూ అందరూ ఆమెను ఆహ్వానిస్తారు...‘నీ కడగంటి చూపు చాలు మాకు’  అంటూ ఆమె అనుగ్రహం కోసంపరితపిస్తారు...‘మా ఇంట సిరులు పొంగించవమ్మా’  అని అందరూ ఆమెను ప్రార్థిస్తారు...‘నువ్వు కాలుపెట్టిన నేల బంగారమాయెగా’ అంటూ పాటలు కట్టి పాడుకుంటారు.కానీ ఆమె మాత్రం  ‘నేను రావాలంటే’...అని షరతులు పెడుతుంది...‘నేను కొలువుండాలంటే’...  నిబంధనలు వర్తిస్తాయంటుంది.ధనం, ధాన్యం, సంతానం,ఆరోగ్యం, విద్య, సంస్కారం...అన్నిట్లో తానున్నానంటుంది...అన్నీ తానై ఉన్నానంటుంది...ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడుంటుంది?

Deepawali
లక్ష్మీనివాసం... ఇలా ఉంటుంది!

రుగ్వేదంలో ఒక ఆసక్తికరమైన రుక్కు ఉంది. ‘పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్‌ ప్రజానం భవసి మాత ఆయుష్మంతం కరోతుమామ్‌’ అని ఇందులో ఉంది. పుత్ర, పౌత్ర, ధనధాన్యాలను ప్రసాదించమని దీనర్థం. అందులోనే ఆయుష్షును ప్రత్యేక సంపదగా చెప్పారు. మిగిలిన సంపదలు అనుభవించాలంటే ఆయుర్థాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. మంచి ఆహారం, మంచి భావనలు, మంచి అలవాట్లు మంచి ఆరోగ్యానికి కారణమవుతాయి. అలాంటి ఆరోగ్యవంతులున్న చోట ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఆనందం తాండవిస్తుంది... అలా ఆనందం తాండవించే చోట తానుంటానంటుంది శ్రీమహాలక్ష్మి.

  • ‘శుచిత్వం మాతృ రూపేణా’ అంటుంది వేదం. శుచి, శుభ్రత మనల్ని కాపాడే తల్లి లాంటివి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా... అలాంటి ఆరోగ్యానికి ప్రధాన కారణం పరిశుభ్రత. పరిశుభ్రత, పచ్చదనం ఉన్నచోట ఆహ్లాదం పరిఢవిల్లుతుంది. అలాంటి ఇల్లు పచ్చగా కళకళలాడుతుంది. ఆడంబరమైన వస్తు సముదాయం ఎంత ఉన్నా, ఆ ఇంట్లో శుభ్రత కొరవడితే అక్కడ శుభాలకు, శాంతికి అవకాశమే లేదు. రోజంతా ఎన్ని పనుల మీద ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన కుటుంబ సభ్యులకు ఇల్లు ఓ ఆహ్లాద మందిరంగా తోచాలి. గూటికి చేరాలని మునిమాపు వేళ కోసం వేచి చూసే పక్షిలా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా! అని ప్రతి ఒక్కరి మనసూ ఆత్రుత పడాలి. అలాంటి పరిశుభ్రమైన, పచ్చని కోవెలలాంటి ఇంట్లో కచ్చితంగా కొలువు తీరతానని వరమిచ్చింది లక్ష్మీదేవి.
లక్ష్మీనివాసం... ఇలా ఉంటుంది!
  • ఇల్లు చిన్నదా, పెద్దదా... అని కాదు. ఎంత పొందిగ్గా ఉందనేది ముఖ్యం. ఇంటిని సర్దుకునే నేర్పు, అందులో మేళవించే సృజనాత్మకత ఆ ఇంటి వారి హృదయాలను ఆవిష్కరిస్తుంది. నాలుగు గోడల మధ్య తల్లి చూపే ప్రతిభ అందరి వికాసానికి తోడ్పడుతుంది. మాతృమూర్తిని చూసి వాళ్లు ఆ సృజనాత్మకతను చదువులో, ఇతర క్రీడా కళాంశాల్లో కనబరిచేందుకు ప్రయత్నిస్తారు. అది వంటగదిలోనే కావొచ్చు. కుండీలో పూల మొక్కలు పెంచడంలోనే కావొచ్చు. కానీ పరిమితమైన వనరులతో వనిత కనబరిచే కళాత్మక ప్రావీణ్యమేదో కుటుంబ సభ్యులందరి మనస్సులపై ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. సృజనాత్మకత అక్షరాలా లక్ష్మీస్వరూపమే.
  • సంస్కారం ఇంటి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుంది. వినయ, విధేయతలు, గౌరవ మర్యాదలు ప్రయత్నపూర్వకంగా బిడ్డలకు అలవరచడమే మాతృమూర్తి ప్రధాన బాధ్యత. దాన్ని ఆమె నిర్వర్తించలేకపోతే అమాయకులైన చిన్నారులు భవిష్యత్తులో అహంకార పూరితులవుతారు. ఎక్కడ అహంభావం, అభిజాత్యం ఉంటాయో అక్కడ మహాలక్ష్మి క్షణం కూడా ఉండదు. అహంకార పూరితులైనవారు ఆమెకు బద్ధ శత్రువులు.
  • అతిథులు, అభ్యాగతులు ఆదరణతో తిరిగి వెళ్లిన ఇల్లు పుణ్యతీర్థాలతో సమానం అంటారు పెద్దలు. ఆ పుణ్యఫలమంతా ఆ ఇంటి ఇల్లాలికే. పంచభక్ష్య పరమాన్నాలు వండి వడ్డించ లేకపోయినా, ఆత్మీయంగా నలుగురినీ పిలిచి ఆకలి తీర్చాలన్న అమ్మ మనసు అతివకు ఉండాలి. అప్పుడే ఆ ఇంటిపై ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు వర్షిస్తాయి. అందుకే ‘అతిథి దేవోభవ’ అని ప్రస్తుతించాయి మన ధర్మగ్రంథాలు. సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు పెట్టినా, నేటికీ అతిథిసేవకు అత్యంత ప్రాధాన్యముంది. అది ఇల్లాలి అభీష్టం, ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ సంప్రదాయం పిల్లలకు తల్లి ద్వారా సంక్రమిస్తుంది. వాళ్లకు ‘ఉన్నది నలుగురితో పంచుకోవాలన్న’ సంస్కారం అబ్బుతుంది. మానవీయ కోణం ఆవిష్కృతమవుతుంది.
  • ‘నహి జ్ఞానేన సదృశమ్‌...’ అంటోంది మన సనాతన ధర్మం. జ్ఞానానికి సరి అయినది ఏదీ లేదు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది సిరిసంపదలు కాదు జ్ఞానసంపద. అది చదువు ఒక్కటే కాదు. జీవితానికి ఉపయోగపడే ఏ విద్య అయినా జ్ఞానమే. వ్యక్తిత్వానికి, జీవన కళకు తోడ్పడే ఏ నిపుణత అయినా జ్ఞానమే. తండ్రి కన్నా ముందు తల్లి నుంచే ఆ జ్ఞానతృష్ణ బిడ్డలకు సంక్రమించాలి. అందుకే సరస్వతి ఉంటే అక్కడ ఆమె సోదరి లక్ష్మి ఆమెను అనుగమించి వస్తుందంటారు. నిరంతరం కుటుంబంలో ఆర్థిక సంబంధమైన చర్చల కన్నా, జ్ఞాన పరమైన సంభాషణలు కొనసాగాలి. అప్పుడు పిల్లల్లో జ్ఞానపిపాస అంకురిస్తుంది. దానికి ప్రధాన సారథ్యం వహించాల్సింది మాతృమూర్తే.
లక్ష్మీనివాసం... ఇలా ఉంటుంది!

సిరీహరీ కలిసున్న ఇంట్లో లోటుండదని పెద్దలు చెబుతారు. ఎక్కడ మంచి వాతావరణం, ఆనందం, ఉత్సాహం ఉంటాయో అక్కడ సంపద వర్షిస్తుంది. సత్కర్మల్లో, సదాశయాల్లో, సదాచారాల్లో తానుంటానని లక్ష్మీదేవి స్వయంగా చెప్పినట్లు మార్కండేయ పురాణం చెబుతుంది. మంచి పనులు ఎక్కడ జరుగుతుంటాయో అక్కడ అష్టైశ్వర్యాలు తప్పనిసరిగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపెడుతుందని జైమినీ భారతం వెల్లడించింది. లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందే చోటు ప్రముఖమైన లక్ష్మీస్థానమని చెప్పారు. అంటే శ్రమే సంపద.

లక్ష్మీదేవి కాంతికి, ఆనందానికి , అభ్యుదయానికి ప్రతీక. కాబట్టే దీపాల పండగను ప్రజలు లక్ష్మీ ఉత్సవంగా చేసుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీపూజ చేసుకునే సంప్రదాయం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. గుజరాతీలు ఆ రోజు వాహిపూజ పేరుతో తమ ఖాతా పుస్తకాలను పూజిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.