ETV Bharat / lifestyle

వావ్‌... వంకాయలు ఎరుపు రంగులో..!

author img

By

Published : May 9, 2021, 6:41 PM IST

‘తాజా కూరలలో రాజా ఎవరండీ.. ఇంకా చెప్పాలా వంకాయేనండీ..’ అని పాటలు పాడుతూ మరీ వంకాయ రుచిని ఆస్వాదిస్తాం. కానీ మనకెంతో చిరపరిచితమైన ఆ కూరగాయలో టొమాటోల్ని పోలిన ఎర్రని రకాలూ ఉన్నాయి. వాటినీ కొందరు అంతే ఇష్టంగానూ తింటుంటారు. అవేంటో చూద్దామా..!

ఎరుపు రంగు వంకాయలు
ఎరుపు రంగు వంకాయలు

ఎరుపు రంగు వంకాయలు..

వంకాయ.. పేరునే రంగుగా మార్చిన రుచికరమైన కూరగాయ. అలాంటి వంకాయలో ఎర్రగా పండేవీ ఉంటాయనేది ఊహించలేం. కానీ వంగ కుటుంబానికే చెందిన కొన్ని రకాలు ఎరుపూ నారింజ వర్ణాల్లో ఆకర్షణీయమైన రంగుల్లో ఉండటమే కాదు, ఆయా మొక్కల్లోని ఔషధ గుణాలు రోగాల్నీ నయం చేస్తాయట. ఎర్రగా ఉండే వంకాయల్లో ప్రధానమైనది ఇథియోపియన్‌ స్కార్లెట్‌ ఎగ్‌ ప్లాంట్‌.

శాస్త్రీయంగా జాతి వేరే అయినప్పటికీ అనేక విషయాల్లో ఇది వంగని పోలి ఉండటంతో దీన్నీ ఎగ్‌ప్లాంట్‌గానే చెబుతారు. ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా సంకరీకరించడంతో ఇది భిన్న రూపాల్ని సంతరించుకుంది. కానిబాల్‌ టొమాటో ఎగ్‌ప్లాంట్‌, బ్రెజీలియన్‌ ఓవల్‌ ఆరెంజ్‌, జిలో, కొరియన్‌ రెడ్‌, పంప్కిన్‌ ఆన్‌ ఎ స్టిక్‌, రెడ్‌ రఫెల్డ్‌, టర్కిష్‌ రెడ్‌, స్ట్రైప్‌డ్‌ టొగా... వంటివన్నీ అలా వచ్చిన రకాలే. వీటిల్లో కొన్ని అచ్చం టొమాటోల్లానే ఉంటాయి. అయితే ఎర్రగా పండే ఈ రకాలన్నింటినీ బాగా పండని దశలోనే- అంటే లేతగా ఉండగానే ఆకుపచ్చ లేదా తెలుపు రంగులో ఉన్నప్పుడే తింటారు. ఎర్రగా పండాక గింజల్లో చేదు గుణం పెరుగుతుంది. అయినప్పటికీ కొన్ని రకాల్ని పండాక వంటల్లోనూ సూపుల తయారీలోనూ వాడతారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా వాడే వీటిని ఈశాన్య భారతంలోనూ పండిస్తారు.

అందం కోసమూ...

అందం కోసమూ...
ఈ ఎర్ర వంకాయల్ని అచ్చంగా తినడానికే కాకుండా ఉద్యానవనాల్లో అందం కోసమూ పెంచుతారు. పంప్కిన్‌ ఆన్‌ ఎ స్టిక్‌ రకంలో పండ్లతో ఉన్న కొమ్మల్ని కోసి ఆకులన్నీ రాలిపోయాక, వాటిని బొకేల్లోనూ వేజ్‌ల్లోనూ అలంకరిస్తారు. అవి చాలాకాలంపాటు ఉంటాయట. పండిన వంకాయల్ని ఆఫ్రికన్లు పేగు క్యాన్సర్‌, బీపీ... ఇలా అనేక వ్యాధుల నివారణలో వాడతారు. వీటి ఆకుల రసాన్ని గర్భాశయ సమస్యలకీ; కషాయాన్ని మధుమేహానికీ పొట్టలోని నులిపాములు చనిపోవడానికీ వాడతారట.

ఇవే కాదు, పీ ఎగ్‌ టర్కీ బెర్రీ(అడవి వంకాయ)గా పిలిచే మరో రకం కూడా ఎర్రగా పండుతుంది. దీంతోనూ రకరకాల వంటలు చేస్తుంటారు. తెలుగులో ముళ్లముష్ఠి, కొండావుచింత అనీ తమిళంలో తూత్తువలై అనీ ఆంగ్లంలో పర్పుల్‌ ఫ్రూటెడ్‌ పీ ఎగ్‌ ప్లాంట్‌ అని పిలిచే మరో రకం చిట్టి వంకాయా పండాక ఎర్రగానే ఉంటుంది. దక్షిణాదిలో ఎక్కువగా పండే దీన్ని సిద్ధ వైద్యంలో వాడతారట. తమిళనాడులో జలుబూ దగ్గూ జ్వరం వచ్చినప్పుడు దీని ఆకులతో చేసిన కూర లేదా పచ్చడి తింటారట. వాటితో రసం పెడతారు. ఆ విషయాన్ని గుర్తించి ఈమధ్య ఈ ఆకుల పొడికి ఇతరత్రా దినుసులు జోడించిన సూప్‌ ప్యాకెట్లూ అమ్ముతున్నాయి కొన్ని కంపెనీలు. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఇది క్యాన్సర్లనీ హానికర సూక్ష్మజీవుల్నీ ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తుందట. టీబీ, ఆస్తమా, ఊపిరి సమస్యలు, సైనస్‌, ఛాతీలో కఫం... ఇలా శ్వాసకోశ వ్యాధులకి ఇచ్చే మందుల్లోనూ వాడతారు.

నిజానికి ఆఫ్రికా, ఐరోపా దేశాలవారికి మనదగ్గర పండే వంకాయ రంగు వంకాయలు మొదట్లో తెలియదట. తెలిశాక ఆ రంగు చూసి అవి తినడానికి పనికిరావనే ఉద్దేశంతో బ్యాడ్‌ ఆపిల్‌ అనీ ఆపిల్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ అని పిలుస్తూ అందానికి మాత్రమే పెంచేవారు. ఆయా దేశాల్లో పండే వంకాయలు తెల్లగా అచ్చం బాతుగుడ్లలా ఉండటం వల్లే వాటిని ఎగ్‌ప్లాంట్‌ అని పిలిచారట. అలా అంతటా వంకాయలకు ఆ పేరు వాడుకలోకి వచ్చిందన్నమాట. చూశారుగా మరి... ఎర్రని వంకాయల్లోనూ ఎన్నెన్ని ఔషధాలు ఉన్నాయో..!

వంకాయ తోట..
కట్​చేస్తే ఇలా..
వెరైటీ వంకాయలు..
టొమాటోల్ని పోలిన వంకాయలు..

ఇదీ చూడండి.. నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.