ETV Bharat / lifestyle

RELATIONSHIP: చెప్పమంటోంది.. నా మనసు

author img

By

Published : Aug 14, 2021, 11:37 AM IST

మంచి ఉద్యోగం. లక్షల్లో ప్యాకేజీ. ఇంకేమి కావాలి అనుకుంటూ ఆ తల్లిదండ్రులు కొడుకుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ కరోనా రావడం... ఉద్యోగం పోవడం రెండూ జరిగిపోయాయి. ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి తల్లిదండ్రులు ఉద్యోగం పోయిందనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి ఫిక్స్ చేసేశారు. దాని తరువాత ఏమైందంటే..

RELATIONSHIP
పెళ్లి కూతురుకి తెలిస్తే ఎలా

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పని చేసేవాణ్ని. గతేడాది లాక్‌డౌన్లో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇవన్నీ దాచిపెట్టి మావాళ్లు నాకో సంబంధం ఫిక్స్‌ చేశారు. ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పారు. నవంబరులో పెళ్లి. ఇది వాళ్లని మోసం చేయడమే కదా అంటే ఈలోపు ఏదో ఒక జాబ్‌ దొరుకుతుందిలే అంటున్నారు మావాళ్లు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలా?

కె.ఎస్‌., కరీంనగర్‌

జ. కరోనా విపత్తు ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేసింది. మనుషుల జీవనశైలిపై శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రభావం చూపించింది. ఆ మహమ్మారి మన జీవితాల్ని ప్రభావితం చేయడమే కాదు.. ఎన్నో జీవిత పాఠాలు నేర్పించింది కూడా.

మీ విషయానికొస్తే.. పెళ్లి చేయాలనే తొందరలో మీరు జాబ్‌ చేస్తున్నారని మీవాళ్లు అబద్ధం చెప్పడం సబబు కాదు. కానీ రెండు, మూడు నెలల్లో మీరు మరొక ఉద్యోగం సంపాదించగలరనే నమ్మకంతో అలా చెప్పి ఉండొచ్చు. పెద్దల నమ్మకాన్ని అంత తేలికగా తీసిపారేయలేం! పెళ్లైన తర్వాతే జీవితంలో స్థిరపడ్డవాళ్లు చాలామంది ఉన్నారు.

అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యని కాబోయే జీవిత భాగస్వామితో తప్పకుండా చెప్పండి. ఇద్దరూ చర్చించుకుంటే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు ఉండొద్దు. పైగా పెళ్లయ్యాక సంసార బాధ్యతలు మొదలవుతాయి. మీరిద్దరూ ఆనందంగా ఉండాలంటే ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. మిమ్మల్నే నమ్ముకుని మీ జీవితంలోకి వచ్చిన తనూ కష్టాలు పడాల్సి ఉంటుంది. ముందే అన్ని విషయాలూ ఓపెన్‌గా మాట్లాడుకొని, మీ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది.

నిజాన్ని నిర్భయంగా చెబితే మీలోని నిజాయతీ ఆమెకు నచ్చి మీకో మంచి పరిష్కారం కూడా సూచించవచ్చు. ఒక్కోసారి ఎదుటి వాళ్లతో చర్చిస్తే అద్భుతమైన ఆలోచనలు వచ్చి మన జీవితం కూడా మారిపోతుంటుంది. వీటన్నింటికన్నా ముందు మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. ఉరకలేసే వయసు, కాలంతో పోటీపడగల సామర్థ్యం ఉన్నాయి. కొత్త ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. నమ్మకంతో అడుగేస్తే విజయం సొంతమవుతుంది. జీవిత భాగస్వామిని మోసం చేయకూడదనే మీ మంచి ఆలోచనే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.