ETV Bharat / lifestyle

'మనోవేధనతో కృంగిపోతున్నారు.. ఆలుమగల బంధం నుంచి విడిపోతున్నారు'

author img

By

Published : Jan 21, 2022, 8:59 AM IST

Breakup With Love Life: పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, వృత్తిపరమైన విభేదాలు రావడం, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గి పోవడం, వివాహేతర సంబంధాలు.. ఇలా వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో..!

wife-and-husband
ఆలుమగల బంధం

  • మాదాపూర్‌ ఐటీ కంపెనీల్లో ఇద్దరూ సహోద్యోగులు. రెండేళ్లపాటు సహజీవనం చేశారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలలకే కలసి ఉండలేమనే అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరూ కలసి ఉన్నపుడు బోర్‌ కొడుతుందనేది వారి సమాధానం.
  • పెళ్లయి మూడు నెలలు.. కుటుంబాలకు దూరంగా ఖరీదైన ఫ్లాట్‌లో నివాసం. కొత్త దంపతులు కదా! అని తల్లిదండ్రులు కూడా దూరంగా ఉన్నారు. ఇలాంటి భర్తతో కాపురం నా వల్ల కాదంటూ అమ్మాయి తేల్చి చెప్పింది.. కౌన్సెలింగ్‌లో ఆరాతీస్తే ‘ప్రేమతో ఇంటికొచ్చిన తన తండ్రి పట్ల భర్త దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.

Breakup With Love Life: పెద్ద చదువులు, ఉన్నత కొలువులు, అత్తమామల వేధింపులు లేవు, ఆర్థిక ఇబ్బందులు మచ్చుకైనా కనిపించవు.. కానీ ఆలుమగల మధ్య నిత్యం కలహాలు.. కలసి ఉండటం మా వల్ల కాదంటూ పోలీస్‌స్టేషన్లకు చేరుతున్నారు. సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పిల్లలున్న దంపతులు మాత్రమే కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఐటీ, కార్పొరేట్‌ సంస్థల్లో లక్షల సంపాదన.. మరోవైపు పొట్టకూటి కోసం కూలినాలీ చేసుకుంటూ బతుకెళ్లదీసే పేద కుటుంబాలున్నాయి. వీరిలో అధిక శాతం గొడవ పడి ఠాణా వద్దకు పంచాయితీకి చేరేది బాగా చదువుకున్న జంటలే అంటున్నారు పోలీసులు. సైబరాబాద్‌ పోలీసులకు డయల్‌ 100 ద్వారా రోజూ వచ్చే 750 ఫోన్‌కాల్స్‌లో 300 మహిళల వేధింపులకు సంబంధించినవే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

నాలుగేళ్ల వ్యవధిలో హత్యలు,ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారం, వేధింపులతో నమోదైన కేసులివీ..

సైబరాబాద్‌ పరిధిలో
20182,555
2019 2,830
2020 2,302
2021 2,500-2,550 (అంచనా)

కారణాలు చిన్నవే

ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ

భార్యాభర్తల తగాదాల్లో ఇటువైపు నుంచి చూసినపుడు సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. మనోవేదన అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుందంటారు క్లినికల్‌ సైకాలజిస్టు ఆరె అనిత. గచ్చిబౌలి మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఏటా 4,000కు పైగా ఫిర్యాదులు వస్తుంటాయని అంచనా. వీటిలో 70-80 శాతం ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులు ఉంటున్నారు. విడిపోవడానికి కారణాలు కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయంటారు గచ్చిబౌలి మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ. ‘మద్యం అలవాటు, వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులకు గురవుతున్న గృహిణులు భర్త నుంచి బయటపడాలని భావిస్తున్నారు. పిల్లల్ని కూడా తామే పోషిస్తామంటున్నారు. అంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఎంతోకాలంగా అనుభవిస్తున్న మనోవేదన కారణం’ అంటూ విశ్లేషించారు.

రోజుకు ఐదు ఫిర్యాదులు

కనకయ్య, ఇన్‌స్పెక్టర్‌

భార్యాభర్తల తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రతిరోజు సగటున ఐదు వరకు అందుతున్నాయి. ఇందులో భార్యభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసేవారివే ఎక్కువ. వివాహేతర సంబంధాలు హత్య/ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇతరులతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించడం ద్వారా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో ఆర్థిక సమస్యలు విభేదాలకు కారణమవుతున్నాయి. కొంతమంది భర్తలు వచ్చే సంపాదన తాగుడుకు ఖర్చు చేయడం ద్వారా ఆయా ఇళ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

- కనకయ్య, ఇన్‌స్పెక్టర్‌, రాజేంద్రనగర్‌

బంధాల విలువ తెలియక..

నచ్చిన జీతం, కోరుకున్న జీవితం ఉన్నప్పటికీ ఆలుమగలకు బంధాల విలువ తెలియకపోవటం, కుటుంబ విలువలపై అవగాహన లేకపోవటం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛతో ఒంటరిగా బతకవచ్చనే అభిప్రాయం వివాహ బంధాన్ని తేలికగా తీసుకునేందుకు కారణం. స్నేహితులు/ప్రేమికులుగా ఏళ్ల తరబడి తెలిసిన జంటల్లోనూ పెళ్లి తరువాత ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించటాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. పిల్లలకు సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా వారి నిర్ణయానికే వత్తాసు పలుకుతున్నారు.

- అరే అనిత, క్లినికల్‌ సైకాలజిస్టు

ఇదీ చూడండి: jagtial murders: మాటు వేసిన మూఢ నమ్మకం.. మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.