ETV Bharat / lifestyle

బుజ్జాయిలకు కథలు చెప్పే.. ముద్దు ముద్దు టెడ్డీబేర్​లు

author img

By

Published : Dec 13, 2020, 2:08 PM IST

...అప్పుడు ఆ సింహం, కుందేలుతో ఏమందంటే...’ ఆసక్తిగా కథ వింటున్నాడు చింటూ. ఈలోగా అమ్మ గదిలోకి వచ్చి ‘ఇంకెంతసేపు నాన్నా, టైం అయింది పడుకో’ అంటూ దుప్పటి కప్పింది. దాంతో చింటూ తన టెడ్డీబేర్‌ కాలు మీద నొక్కి, కథ ఆపేసి పడుకున్నాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఆ కథ చెబుతోంది టెడ్డీనే! ఇప్పుడు కథలు వినిపించే బొమ్మలు వస్తున్నాయిగా మరి!

Storytelling toys for kids
పిల్లలకు కథ చెప్పే బొమ్మలు

కథలు చెప్తే వినడానికి ఇష్టపడని పిల్లలెవరు చెప్పండి! ఒకప్పుడైతే ఇళ్లల్లో అమ్మమ్మా తాతయ్యలు ఉండటంతో రోజూ రాత్రిళ్లు చక్కగా బోలెడన్ని కథలూ కబుర్లూ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తక్కువ, అమ్మానాన్నలేమో పనుల్లో బిజీ! మరి అలాంటప్పుడు చిన్నారుల బొమ్మలే వారికి రకరకాల కథలు చెబితే భలే ఉంటుంది కదా! ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘స్టోరీ టెల్లింగ్‌ టాయ్స్‌’.

పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే సాఫ్ట్‌టాయ్స్‌ రూపంలోనే ఇవీ వస్తున్నాయి. అందువల్ల వీటితో మామూలుగా ఆడుకుంటూనే కావాలనుకున్నప్పుడు కథలూ వినొచ్చు. బ్యాటరీతో నడిచే ఈ బొమ్మల్లో కొన్నింటికి ముందే అయిదారు ఫేమస్‌ కథలు ఫీడ్‌ చేసి ఉంటాయి. వాటి కాళ్లూ, చేతులూ లేదా పొట్ట మీద చిన్నగా నొక్కితే కథ చదవడం మొదలుపెడతాయి. ఆపాలనుకున్నా, మరో కథ వినాలనుకున్నా మళ్లీ అలాగే నొక్కితే సరి. పుస్తకం చూసి చదువుతున్నట్టు అనిపించేందుకు వాటి చేతిలో ఓ బుక్‌ కూడా ఉంటుంది. కథ చదువుతున్నంతసేపూ అవి నోరు తెరిచి మూయడం, తలను అటూఇటూ ఆడించడం, కళ్లు ఆర్పడం చేస్తుంటాయి. దానికి తగ్గట్టు మంద్రంగా సంగీతం కూడా వినిపిస్తుంది.

కొన్నింటికి అయితే చేతిలో ఉన్న పుస్తకం మెరుస్తుంది కూడా. అందువల్ల పిల్లలకు నిజంగా బొమ్మే కథ చదువుతున్న భావన కలుగుతుంది. ఇంకా అడ్వాన్స్‌డ్‌ బొమ్మల్లో ముందే ఫీడ్‌ చేసి ఉన్న కథలకుతోడు మనం కూడా నచ్చినవాటిని జతచేయొచ్చు. అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు కథ చెబుతూ ఆ వాయిస్‌ రికార్డ్‌ చేసి మొబైల్‌ ద్వారా బొమ్మలో ఫీడ్‌ చేసుకోవచ్చన్నమాట. ఇంటర్నెట్‌ వాడుకునే సౌకర్యం ఉన్నవాటిలో అయితే అలా ఫీడ్‌ చేసిన కథలను ఇతర పిల్లలతో పంచుకునే అవకాశమూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లల దగ్గరున్న బొమ్మలు కూడా మన కథ చదివేస్తాయి! ఇవి కుందేలు, కప్ప, ఉడుత, కంగారూ, బాతు, గుడ్లగూబ, కుక్కపిల్ల, ఆక్టోపస్‌, యూనికార్న్‌, టెడ్డీబేర్‌, డ్రాగన్‌ వంటి ఎన్నో ఆకారాల్లో దొరుకుతున్నాయి. అయిదు నుంచీ పదేళ్ల మధ్య వయసున్న పిల్లల కోసం ఉద్దేశించిన ఈ ముద్దు ముద్దు బొమ్మలు వారికెంతో నచ్చుతాయనడంలో సందేహమే లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.