ETV Bharat / lifestyle

గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!

author img

By

Published : Aug 21, 2020, 9:45 AM IST

ఆమె ఐఆర్‌ఎస్‌ అధికారి... అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన నాయకత్వ పాఠాలు చెబుతోంది! ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా? ఉంది. రోడ్డువారన గుడారాల్లో పెరిగిన అమ్మాయి. వైకల్యం కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమై.. అడుగువేయలేని అమ్మాయి. ఆ పేదరికాన్నీ, వైకల్యాన్నీ పక్కకు నెట్టి 30ఏళ్ల ఉమ్ముల్‌ఖేర్‌ సివిల్స్‌ సాధించడమే కాదు స్ఫూర్తివంతమైన ప్రసంగాలతో ఎందరిలోనో చైతన్యం నింపుతోంది...

IRS Officer Ummul Kher
IRS Officer Ummul Kher

రాజస్థాన్‌ నుంచి దిల్లీకి బతుకుదెరువు కోసం వలస వచ్చింది ఉమ్ముల్‌ఖేర్‌ కుటుంబం. హజ్రత్‌ నిజాముద్దీన్‌ సమీపంలో తండ్రి ఫుట్‌పాత్‌పై దుస్తులు అమ్ముకునేవాడు. చిన్న టార్పాలిన్‌ టెంట్‌ నీడలోనే వాళ్ల కుటుంబం నివసించేది. వర్షంవస్తే... అందరూ తడిసిముద్దవ్వాల్సిందే. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడేది ఉమ్ముల్‌. చిన్న దెబ్బ తగిలినా, జారిపడినా ఏ ఎముక విరిగిపోతుందో తెలీదు. అలా చిన్నప్పుడే 16 సార్లు ఆమె శరీరంలోని ఎముకలు విరిగిపోయాయి. ఇన్ని కష్టాలున్నా చదువుకుంటానని మారాం చేసే ఆమెను సమీపంలోని బధిరులకోసం ప్రత్యేకంగా నడిపే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు తల్లిదండ్రులు.

ఇంకా పై చదువులు చదువుతానని అన్నప్పుడు మాత్రం... ‘చదువు మనస్థోమతకు ఎక్కువ. ఇక ఆ ఆలోచన మానుకో. ఇక చెప్పిన మాట వినకపోతే, మాతో నీకు ఎటువంటి సంబంధం ఉండదని’ బెదిరించారా తల్లిదండ్రులు. అన్నట్టుగానే ఉమ్ముల్‌ను దూరం పెట్టారు. చదువుకోవాలనే ఆకాంక్షతో అందరికీ దూరమైన ఉమ్ముల్‌ఖేర్‌కు రోజులు అంత తేలిగ్గా ముందుకు నడవలేదు. ఓవైపు చదువుకోవాలి. మరోవైపు తన జబ్బును నయం చేసుకోవాలి. వీటన్నింటికీ డబ్బు కావాలి. అందుకోసం.. చిన్నగది అద్దెకు తీసుకుని చుట్టుపక్కల పిల్లలకు ప్రైవేట్లు చెప్పడం మొదలుపెట్టింది. ‘ఉదయం నుంచి రాత్రి వరకు నెలంతా పాఠాలు చెబితే ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ. 100 వరకు వచ్చేవి. పదోతరగతిలో 91 శాతం మార్కులు తెచ్చుకోవడంతో గార్గి కాలేజీలో ప్రవేశం దొరికింది. ట్యూషన్లతోపాటు, పోటీల్లో పాల్గొని నగదు బహుమతులు తెచ్చుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది ఉమ్ముల్‌.

గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!
ఐఆర్‌ఎస్‌ అధికారి ఉమ్ముల్‌ఖేర్‌

చక్రాల కుర్చీలో... ఉమ్ముల్‌కున్న ఎముకల వ్యాధి తరచూ ఇబ్బంది పెట్టేది. దాంతో కొన్నిసార్లు చక్రాలకుర్చీలోనే కాలం గడపాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బందుల మధ్యే జేఎన్‌యూలో పీజీ చేసి తర్వాత ఎంఫిల్‌కు సీటు సాధించింది. ప్రభుత్వ ఉపకారవేతనం దొరకడంతో.. ప్రైవేట్లు చెప్పడం మానేసి చదువుపై దృష్టి నిలిపింది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌ సాధించిన తర్వాత ఆమె కష్టాలు కాస్త తీరాయి.

అంతటితో ఆగిపోకుండా 2017లో సివిల్స్‌ రాసి 420 ర్యాంకును సాధించింది. రోడ్డువారన ఓ చిన్నటెంటులో జీవనం సాగించిన అమ్మాయికి ఈ విజయం చిన్నదేం కాదు. ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపడుతోంది. అంతర్జాతీయస్థాయిలో బధిరుల కోసం నిర్వహించే లీడర్‌షిప్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని వారిలో చైతన్యం నింపుతోంది. తన అనుభవాలనే వారికి పాఠాలుగా చెబుతోంది.

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.