ETV Bharat / jagte-raho

లక్నవరం జలాశయంలో గల్లంతైన​ ఉద్యోగి మృతదేహం లభ్యం

author img

By

Published : Dec 26, 2020, 3:40 PM IST

పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సరదాగా స్నేహితులతో బయటకు వెళ్లిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి అదే చివరి రోజు అయింది. వరుసగా మూడు రోజులు సెలవు దొరికిందని స్నేహితులంతా కలిసి లక్నవరం జలాశయం సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిన ఉద్యోగి గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది.

software employee dead body was found in laknavaram water
లక్నవరం జలాశయంలో గల్లంతైన​ ఉద్యోగి మృతదేహం లభ్యం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో గల్లంతైన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వల్లూరి సుధాకర్ హైదరాబాద్​లో ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో సుధాకర్​.. తన 18 మంది స్నేహితులతో కలిసి లక్నవరం వెళ్లాడు.

సరదాగా గడుపుతుండగా

జలాశయం పరిసర ప్రాంతాల్లో గడపాలని నిర్ణయించుకుని అందరూ కాటేజీలు బుక్ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జలాశయం కట్ట మెట్ల వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను వీక్షిస్తున్న సమయంలో సుధాకర్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు రాత్రి 9 గంటలకు వరకు గాలించినా అతను దొరకలేదు. శనివారం ఉదయం ఈతగాళ్లు మళ్లీ గాలింపు చేపట్టడంతో సుధాకర్ మృతదేహం లభ్యమైంది.

ఇదీ చదవండి: మహిళ హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.