ETV Bharat / jagte-raho

విశాఖలో మరోసారి విషవాయువు విడుదల.. పలువురికి అస్వస్థత

author img

By

Published : Oct 13, 2020, 7:25 AM IST

ఏపీలోని విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి విషవాయువు విడుదలైంది. శ్రీహరిపురంలోని కోరమండల్ ఫైర్టిలైజర్స్ నుంచి వచ్చిన గాఢ వాయువుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. శ్వాస ఇబ్బందితో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి గౌతంరెడ్డి ఆదేశించారు.

gas-leakage-in-coromandel-fertilizers-vizag
విశాఖలో మరోసారి విషవాయువు విడుదల.. పలువురికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ నుంచి విడుదలైన గాఢ వాయువు ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాతావరణం మార్పుతో కోరమండల్ పరిశ్రమ నుంచి వాయువును బయటకు విడిచిపెట్టారు. చల్లదనం ఎక్కువగా ఉన్నందున వాయువు గాలిలోకి వెళ్లకుండా చుట్టుపక్కల కాలనీల్లోకి వ్యాపించింది. ఒక్కసారిగా ఘాటైన వాసన రావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు.

పిలకవాని పాలెం, కుంచుమాంబ కాలనీలో ఈ ఘాటైన వాయువు ప్రభావం కనిపించింది. సాయంత్రం నుంచి సమస్య తీవ్రత తగ్గకపోవడంతో స్థానికులు పరిశ్రమ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కోరమాండల్ ఉద్యోగులు స్థానికులతో మాట్లాడారు. పరిశ్రమ ప్రతినిధులపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పటిష్టమైన చర్యలు లేకపోతే తమకు ప్రాణహాని పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాయువు ప్రభావంతో ఇబ్బందిపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

మంత్రి గౌతం రెడ్డి ఆరా...

విశాఖలో 'కోరమాండల్' ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. కర్మాగారం పరిసర గ్రామాల్లోని స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు మంత్రికి వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి సహా ఇతర అధికారులతో మాట్లాడిన మంత్రి... స్థానిక ప్రజలకు భరోసా కలిగే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వాయువు వెలువడిన కర్మాగారం, దాని ప్రభావం, కారణాలు వంటి అంశాలపై నివేదిక అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి: వాగు దాటుతుండగా ప్రమాదం.. ఇద్దరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.