ETV Bharat / international

ఈసారి 1000 మందితోనే హజ్‌ యాత్ర!

author img

By

Published : Jul 21, 2020, 11:12 AM IST

hajj this year
1000 మందితోనే హజ్‌ యాత్ర!

ఏటా లక్షల మందితో జరిగే హజ్​ యాత్ర ఈసారి అత్యంత సాదాసీదాగా జరగనుంది. వెయ్యి మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది సౌదీ ప్రభుత్వం. జులై 29న ప్రారంభం కానున్న యాత్రకు కేవలం సౌదీలో ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఏటా జరిగే హజ్‌ యాత్రను ఈసారి అత్యంత సాదాసీదాగా జరపాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది.

విదేశీయులకు నో..

సౌదీలో నివసిస్తున్న వారిని మాత్రమే ఈసారి హజ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్థులు కాగా.. మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రికుల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆధునిక సౌదీ చరిత్రలో విదేశీయుల్ని అనుమతించకపోవడం ఇదే తొలిసారి.

కట్టుదిట్టమైన చర్యలు..

కరోనా నేపథ్యంలో యాత్రా స్థలంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మక్కాకు చేరుకోవడానికి ముందే యాత్రికులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే యాత్ర తర్వాత వారంతా గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఏటా ఈ యాత్రకు దాదాపు 2.50 లక్షల మంది హాజరవుతుంటారని అంచనా.

భారత హజ్​ యాత్ర రద్దు..

ఇప్పటికే భారత్‌ నుంచి ఈసారి హజ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి హజ్‌ కమిటీ ప్రకటించింది. యాత్రకు టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: హజ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.