బైడెన్‌ సర్కార్​కు ఊరట.. అప్పుల పరిమితి పెంపునకు అంతా రెడీ!

author img

By

Published : May 28, 2023, 3:08 PM IST

US Debt Ceiling Limit News

US Debt Ceiling : అప్పుల పరిమితి పెంపుపై చిక్కుముడులతో దివాలా అంచున ఉన్న అమెరికాకు ఊరట లభించింది. గతకొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య జరుగుతోన్న సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై బైడెన్‌, మెకార్థీ మధ్య ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లో డెమొక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ మేరకు ఇరు పక్షాల నేతలు ధ్రువీకరించారు.

US Debt Ceiling Limit : దివాలా అంచున ఉన్న అమెరికాకు ఊరట లభించింది. అమెరికా రుణపరిమితిని పెంచేందుకు అధ్యక్షుడు జోబైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య ఒప్పందం కుదిరింది. జో బైడెన్‌ మెకార్థీతో ఫోన్‌కాల్‌లో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా శ్వేతసౌధం, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. దివాలా అంచున కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకు ఈ ఒప్పందం తిరిగి ప్రాణం పోయనుంది. వారాల తరబడి సుదీర్ఘ చర్చల తర్వాత తాము సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చినట్లు స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ తెలిపారు. ఇంకా తాము చాలా పనిచేయాల్సి ఉందని.. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు ఎంతో విలువైందని మెకార్థీ అన్నారు. ఈ ఒప్పందం తనతో సహా కాంగ్రెస్‌లోని డెమొక్రాట్ల కీలక ప్రాధాన్యాలు, చట్టపరమైన విజయాలను సంరక్షిస్తుందని ప్రెసిడెంట్‌ బైడెన్‌ అన్నారు. ఈ ఒప్పందం రాజీ పడటానికి ప్రతీక మాత్రమేనని వెల్లడించారు. అది పాలనాపరమైన బాధ్యతని బైడెన్‌ పేర్కొన్నారు.

ఆమోదముద్రే లాంఛనం!
US Debt : ఈ ఒప్పందంతో అమెరికాకు కాస్త ఊరట లభించినట్లైంది. ఈ డీల్‌ను కాంగ్రెస్‌లోని తమ పార్టీ సహచరులతో బైడెన్‌, మెకార్థీ ఆమోదముద్ర వేయించడమే మిగిలి ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా.. సెనెట్‌లో డెమొక్రాట్లకు పట్టు ఉంది. ఈ ఒప్పందం జూన్‌ 5వ తేదీలోపు కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత బైడెన్‌ దీనిపై సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. 2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. యూఎస్‌ జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా, దాదాపు 7 ట్రిలియన్‌ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు ససేమిరా అనడం వల్ల అలజడి మొదలైంది. తాజాగా ఇరువురి మధ్య ఒప్పందం కుదరడం వల్ల దివాలా నుంచి అమెరికా బయటపడినట్లైంది.

డెట్​ సీలింగ్​ అంటే ఏమిటి..?
US Debt Crisis : చెల్లింపుల కోసం అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే 'డెట్‌ సీలింగ్‌'గా పరిగణిస్తారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి వీలులేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్‌, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రీఫండ్‌లు.. ఇలా అన్ని వ్యయాలు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదు. కాగా, బైడెన్​ సర్కార్​ ప్రభుత్వం జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. దేశ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ వచ్చింది. ఈ కథనం పూర్తి సమాచారం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.