ETV Bharat / international

'రష్యా చేతిలో అమెరికా ఆయుధాలు ముక్కలవుతాయి'.. కిమ్ సోదరి ఘాటు హెచ్చరిక

author img

By

Published : Jan 28, 2023, 9:08 PM IST

Etv Bharat
Etv Bharat

ఉక్రెయిన్​తో యుద్ధం విషయంలో తాము రష్యావైపే ఉంటామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.. అమెరికాపై తీవ్రంగా మండిపడ్డారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో తాము రష్యా వైపే ఉంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా, దాని మిత్రదేశాలపై కిమ్‌ యో జోంగ్‌ ఘాటుగా స్పందించినట్లు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. రష్యా సైన్యం, ప్రజల పక్షాన ఉత్తర కొరియా ఉంటుందని జోంగ్ వ్యాఖ్యానించారు.

రష్యా ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు దృఢంగా నిలబడ్డారని.... తమ పూర్తి మద్దతు పుతిన్‌ ప్రభుత్వానికేనని కిమ్ యో జోంగ్ తెలిపారు. ఉక్రెయిన్‌కు అబ్రామ్స్‌ ట్యాంకులను అందించాలన్న అమెరికా నిర్ణయం చాలా నీచమైందని వ్యాఖ్యానించారు. మాస్కో నగరాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో అమెరికా ముందుకెళ్తోందని... అయితే రష్యా చేతిలో అమెరికా, పశ్చిమ దేశాల ఆయుధాలు ముక్కలుగా మారిపోతాయని తెలిపారు.

పుతిన్ ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌నకు ఉత్తర కొరియా ఆయుధాలు అందిస్తోందని ఇటీవల అమెరికా ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ అత్యాధునిక ఆయుధాలు పంపేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.