కారు ప్రమాదానికి గురైన జెలెన్​స్కీ.. కాన్వాయ్​ను ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత..

author img

By

Published : Sep 15, 2022, 8:07 AM IST

zelensky-car-accident

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్​ను ఓ కారు ఢీకొట్టింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అధ్యక్షుడి కారు, కాన్వాయ్​ను ఓ కారు ఢీకొట్టిందని జెలెన్​స్కీ ప్రతినిధి సెర్హీ నైకిఫోరోవ్ తెలిపారు. ఈ ఘటనలో అధ్యక్షుడు స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. 'జెలెన్​స్కీ వెంట ఉన్న వైద్యులు.. అధ్యక్షుడితో పాటు కారు డ్రైవర్​కు చికిత్స అందించారు. అనంతరం జెలెన్​స్కీని అంబులెన్సులో తరలించాం. అధ్యక్షుడికి తీవ్రగాయాలేమీ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపడతారు' అని సెర్హీ స్పష్టం చేశారు.

మరోవైపు, రష్యాతో ఉక్రెయిన్ భీకర పోరాటం చేస్తోంది. ఇటీవల దూకుడుగా విరుచుకుపడుతోంది. వ్యూహాత్మక ప్రాంతాలను రష్యా నుంచి తిరికి స్వాధీనం చేసుకుంటోంది. ఈ నెల ప్రారంభం నుంచి రష్యా అధీనంలోని 6,000 చదరపు కిలోమీటర్ల కంటే అధిక భూభాగాన్ని తమ దళాలు హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఇటీవల ప్రకటించారు. అనేక మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి అదుపులోకి తీసుకున్నట్లు జెలెన్​స్కీ సహాయకుడు తెలిపారు. ప్రస్తుతం యుద్ధ ఖైదీలను ఉంచేందుకు స్థలం కూడా లేదని, అంతమంది తమవద్ద బందీలుగా ఉన్నారని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రష్యా సరిహద్దు వరకు ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయని ఖర్కివ్ గవర్నర్ ఓలేహ్ సైనీహుబోవ్ తెలిపారు.

మరోవైపు, రష్యా సైనికులు పారిపోవడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. రష్యా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఖర్కివ్​లోనే వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇది రష్యన్లకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. కీవ్ నుంచి దళాలు ఉపసంహరించుకున్న తర్వాత యుద్ధంలో మాస్కోకు జరిగిన ఘోర అవమానం ఇదేనని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.