ETV Bharat / international

శాంతి చర్చలు అంటూనే.. ఫిరంగుల మోత!

author img

By

Published : Mar 31, 2022, 8:59 AM IST

Updated : Mar 31, 2022, 10:59 AM IST

Ukraine Crisis: శాంతి ఒప్పందంపై చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లో రాకెట్లు, ఫిరంగుల మోత మొదలైపోయింది. కీవ్‌తో పాటు చెర్నిహైవ్‌ నగరంపై రష్యా సైనికులు కొత్త తరహా క్షిపణులతో నిప్పులు కురిపించారు. తమతమ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ చేపడదామని అనుకున్న రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు.. ఇంకా సొంత దేశాలకు చేరుకోకముందే పలు నగరాలు కాల్పులతో దద్దరిల్లాయి.

Ukraine Crisis
ఉక్రెయిన్

Ukraine Crisis: యుద్ధాన్ని విరమించే దిశగా అడుగులు వేయడానికి, శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం కుదిరిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లో రాకెట్లు, ఫిరంగుల మోత మొదలైపోయింది. తమతమ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ చేపడదామని అనుకున్న రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు ఇంకా సొంత దేశాలకు చేరుకోకముందే వివిధ నగరాలు దద్దరిల్లాయి. యుద్ధ విరమణ దిశగా కీలకమైన పరిణామం చోటుచేసుకుందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఈ ఘటనలు చోటు చేసుకుని ఆందోళన రేకెత్తించాయి. కీవ్‌తో పాటు చెర్నిహైవ్‌ నగరంపై రష్యా సైనికులు కొత్త తరహా క్షిపణులతో నిప్పులు కురిపించారు. ఆయుధాగారాలు, ఇంధన డిపోలను వారు లక్ష్యంగా చేసుకున్నారు. మైకొలైవ్‌ ప్రాంతంలో ప్రత్యేక బలగాల ప్రధాన కార్యాలయాన్నీ క్షిపణులు తాకాయి. గణనీయంగా సైనిక బలగాల తగ్గింపునకు రష్యా అంగీకరించినా దానిపై తగిన స్పష్టతను ఇవ్వలేదు. శాంతి ఒప్పందానికి ముందు ఎంతో కసరత్తు జరగాలని చెప్పడం ద్వారా మరికొంత కాలం రక్తపాతం కొనసాగుతుందనే పరోక్ష సంకేతాలను మరోసారి వెలువరించింది. రష్యా వాగ్దానాలు కేవలం బడాయిగా మిగిలిపోయేలా ఉన్నాయని ఉక్రెయిన్‌ వ్యాఖ్యానించింది. బలగాల తగ్గింపుపై చర్చల్లో సానుకూల సంకేతాలు కనిపించినా క్షేత్రస్థాయిలో రష్యా నుంచి మోత ఆగడం లేదని, రష్యాను నమ్మలేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పెదవి విరిచారు.

.
.

రాతపూర్వక ప్రతిపాదన సానుకూల అంశం: క్రెమ్లిన్‌: శాంతి ఒప్పందం గురించి ఉక్రెయిన్‌ నుంచి రాతపూర్వక ప్రతిపాదన రావడం సానుకూల అంశమని, అయితే ప్రతిష్టంభన వీడిపోలేదని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్‌కోవ్‌ పేర్కొన్నారు. భారీ నష్టాలు చవిచూడాల్సి రావడంతో రష్యా బలగాలు తిరిగి స్వదేశానికి, లేదా బెలారస్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని బ్రిటన్‌ రక్షణశాఖ విశ్లేషించింది. యుద్ధ విరమణపై రష్యా మాటల్ని ఎంతవరకు విశ్వసించవచ్చనే సందేహాన్ని బ్రిటన్‌ వంటి పలుదేశాలు వ్యక్తం చేస్తున్నాయి. కీవ్‌ నుంచి కొన్ని బలగాలు వెనక్కి వెళ్తున్నా అది నిజమైన ఉపసంహరణ కాదనీ, వారిని మరోచోట మోహరించబోతున్నారని పెంటగాన్‌ ప్రతినిధి చెబుతున్నారు. ఇది ప్రజల్ని వంచించే చర్య అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పారు. రష్యా చర్యలేమిటో వేచిచూస్తామన్నారు.

రష్యాపై ఉక్రెయిన్‌ దాడి: ఇంతవరకు ఉక్రెయిన్‌పై రష్యా ఏకబిగిన దాడులు చేస్తుండగా మంగళవారం రాత్రి ఆ సీన్‌ తిరగబడింది. రష్యా భూభాగంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్‌ దళాలు బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశాయి. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 12 మైళ్ల దూరంలో సైనిక శిబిరంతో కూడిన ఆయుధ డిపో ఉంది. దాడివల్ల అక్కడ చెలరేగిన మంటలు ఉక్రెయిన్‌ నుంచీ కనిపించాయి. గత వారం ఇదే ప్రాంతం పైకి ఉక్రెయిన్‌ నుంచి ఒక ఫిరంగి గుండు దూసుకువచ్చి, పేలింది. తాజా ఘటనను ఉక్రెయిన్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒకవేళ అలా చేస్తే.. యుద్ధం మొదలయ్యాక రష్యాపై ఉక్రెయిన్‌ చేసిన రెండో దాడిగా ఇది నిలిచిపోతుంది. ఫిబ్రవరిలో మిలెరోవోలోని వాయు స్థావరంపై ఉక్రెయిన్‌ తొలిసారి దాడి చేసింది. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న దొనెట్స్క్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ బ్లాకుపై క్షిపణి దాడి చోటు చేసుకుంది. ఇది ఉక్రెయిన్‌ పనేనని వేర్పాటువాదులు ఆరోపించారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‌ను వీడి వెళ్లిన శరణార్థుల సంఖ్య 40 లక్షలు దాటిందని ఐరాస తెలిపింది.

నేడు భారత పర్యటనకు రష్యా, బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రులు: ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యపై భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తోంది. చర్చలే సమస్యకు పరిష్కారంగా పేర్కొంటోంది. అదే సమయంలో మాస్కోకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానాలపై ఓటింగ్‌కు గైర్హాజరవుతూ వస్తోంది. దీనిపై అమెరికా, ఐరోపా దేశాలు పైకి చెప్పకపోయినా అసంతృప్తిగానే ఉన్నాయి. రష్యా మాత్రం భారత్‌ వైఖరిని ప్రశంసిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్‌.. బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్‌ ట్రస్‌ భారత్‌లో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా పర్యటనలో ఉన్న లవ్రోవ్‌.. గురువారం సాయంత్రం రెండు రోజుల అధికార పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకోనున్నారు. ఉక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యాకు చెందిన కీలక మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అమెరికా, ఐరోపా ఆర్థిక ఆంక్షలు విధించినా, మాస్కో నుంచి భారత్‌ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి మరింత లోతుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రూపాయి-రూబుల్‌ చెల్లింపు విధానం.. రష్యా నుంచి దిగుమతి అయిన సైనిక పరికరాలకు సంబంధించిన విడిభాగాలు సకాలంలో పంపించడం.. తదితర అంశాలను కూడా చర్చల్లో భారత్‌ అధికారులు లేవనెత్తనున్నారు. గురువారం బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దిల్లీలో అడుగుపెట్టనున్నారు. అమెరికా కూడా దిల్లీపై ఒత్తిడి పెంచేందుకు రష్యాపై ఆర్థిక ఆంక్షల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన తన ఉప జాతీయ భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ను బుధవారం భారత్‌కు పంపింది.

ఇదీ చదవండి: చర్చలు ముగిసిన గంటల్లోనే ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడులు..!

Last Updated : Mar 31, 2022, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.