ETV Bharat / international

రష్యా 'మారణహోమం'.. శవాల గుట్టగా మారిన 'బుచా'

author img

By

Published : Apr 4, 2022, 7:19 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా భీకరదాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​కు 30 కిలోమీటర్ల దూరంలో బుచా నగరమంతా శవాల గుట్టగా మారింది. ఒకే చోట 300 మందికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో రష్యా వైఖరి పట్ల ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా, మాస్కోలో కూర్చొని శత్రువు తీసుకునే నిర్ణయంతో ఉక్రెయిన్‌లో శాంతి రాదని అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

russia ukriane confict
russia ukriane confict

Ukraine Crisis: బుచా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని నగరం. ఇప్పుడు అక్కడ ఏ వీధిలో చూసినా శవాల దిబ్బలే. ఎడాపెడా దాడుల్లో భాగంగా రష్యా ఆ నగరంపై విరుచుకుపడిన తీరుకు నిదర్శనంగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత అక్కడకు వెళ్లగలిగినవారి హృదయాలు ద్రవిస్తున్నాయి. ఒకేచోట దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీటిల్లో ఓ పసిబిడ్డ మృతదేహం కూడా ఉంది. ఇది ఉద్దేశపూర్వక మారణకాండ అని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా ఆదివారం పేర్కొన్నారు. వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే.. ప్రజల్ని నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి తలవెనక భాగాన కాల్చినట్లు తెలుస్తోందని మేయర్‌ అనతోలి ఫెడొరక్‌ చెప్పారు. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. సురక్షిత ప్రాంతానికి తరలిపోయే ప్రయత్నంలో ఉన్నవారినీ రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా నుంచి మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో అక్కడి వీధులు బీభత్సంగా కనిపిస్తున్నాయి.

russia ukriane confict
.

మొదటి నుంచి భీకర పోరు.. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత రష్యా సేనలు కీవ్‌ దిశగా వేగంగా వచ్చినా తొలి ప్రతిఘటన బుచాలో ఎదురైంది. ఇక్కడ ఉక్రెయిన్‌ దళాలు రష్యా సైనిక వాహనశ్రేణిపై ఎదురుదాడి చేశాయి. దీనిలో వాహనశ్రేణి మొత్తం ధ్వంసమైంది. కీవ్‌ చుట్టుపక్కల అత్యంత భీకర పోరు జరిగిన ప్రాంతం ఇదే. బుచా నుంచి కీవ్‌ వైపు వెళ్లే మార్గంలో ఓ చోట రోడ్డు ఇరుకుగా, పొడవుగా ఉంది. దీంతో మాటువేసి ప్రత్యర్థిపై దాడి చేయడానికి ఉక్రెయిన్‌ దళాలకు సులభమైంది. దాడిలో 100 యూనిట్ల రష్యా సాయుధ సామగ్రి ధ్వంసమైంది. బుచా-ఇర్పిన్‌ మధ్య ఉన్న ఓ వంతెనను కూడా ఉక్రెయిన్‌ దళాలు పేల్చేశాయి. దీంతో రష్యా దళాలు ముందుకుసాగలేకపోయాయి. పట్టువదలని రష్యా సేనలు దాడులను తీవ్రతరం చేస్తునే ఉన్నాయి. బుచాతో పాటు పలు ఇతర నగరాల్లోనూ సాధారణ పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఫ్రాన్స్‌, జర్మనీ సహా అనేక దేశాలు రష్యాను తప్పుపట్టాయి. బుచాపై ఉక్రెయిన్‌ది దుష్ప్రచారమని రష్యా ఖండించింది. ఇవన్నీ కల్పితాలని తోసిపుచ్చింది.

russia ukriane confict
.

శత్రువు నిర్ణయాలతో శాంతి రాదు.. మాస్కోలో కూర్చొని శత్రువు తీసుకునే నిర్ణయంతో ఉక్రెయిన్‌లో శాంతి రాదని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తమ భూభాగాన్ని పుతిన్‌ సేనలు ఖాళీ చేసి వెళ్తాయనే శుష్క వాగ్దానాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. పోరాటం ద్వారానే శాంతి సాధ్యమని చెప్పారు. ప్రత్యర్థిని బలహీనపరచడానికి, వారి వ్యూహాలు వమ్ము చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుచాలో జరిగింది కచ్చితంగా సామూహిక హత్యాకాండ అని నిప్పులు చెరిగారు. తమపైకి పంపిస్తున్న ప్రతి క్షిపణి, ప్రతి బాంబు.. రష్యా చరిత్రను నల్లగా మార్చేస్తాయని చెప్పారు. రష్యాను ప్రతిఘటిస్తున్న తీరుకు గానూ జెలెన్‌స్కీని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభినందించారు.

russia ukriane confict
ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

అతిపెద్ద ఓడరేవుపై రష్యా దాడులు.. ఉక్రెయిన్‌పై రష్యా ఫిరంగుల మోత కొనసాగుతూనే ఉంది. చమురు డిపోలే లక్ష్యంగా.. వ్యూహాత్మక ఒడెసా ఓడరేవుపై గగనతల దాడులు జరిగాయి. ఇది నల్ల సముద్ర తీరంలో అతిపెద్ద రేవు. దట్టమైన నల్లని పొగలు ఎగసిపడ్డ తీరు ఈ దాడుల తీవ్రతను చాటుతోంది. ఖర్కివ్‌పై రష్యా యుద్ధ ట్యాంకులు 20 సార్లు గుళ్ల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్‌ ఉత్తర భాగం నుంచి పూర్తిగా వైదొలగినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌ సేనలు బ్రోవరీ అనే నగరాన్ని, ప్రిప్యాత్‌ పట్టణాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగాయి. రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ మరోసారి డిమాండ్‌ చేసింది. దీనిపై రష్యా స్పందిస్తూ తమపై ఆంక్షలు నిర్హేతుకమని పేర్కొంది. పశ్చిమ దేశాలు ఎలాంటి అవివేకమైన నిర్ణయాలనైనా తీసుకుంటాయనడానికి ఇది నిదర్శనమని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి విమర్శించారు. తమ కీలక ప్రతిపాదనలను రష్యా మౌఖికంగా అంగీకరించిందని ఉక్రెయిన్‌ శాంతి చర్చల ప్రతినిధి తెలిపారు. మానవతా దృక్పథంతో యుద్ధ విరమణ జరిగేలా చూసేందుకు రష్యా, ఉక్రెయిన్‌లలో ఐరాస అండర్‌ సెక్రటరీ జనరల్‌ మార్టిన్‌ గ్రిఫిత్స్‌ పర్యటించనున్నారు. అజోవ్‌ నగర సమీపంలో దాదాపు లక్ష మంది గత కొన్నిరోజులుగా సముద్రంలోనే ఉన్నారు.

ఇదీ చదవండి: చైనాలో ఒక్కరోజే 13 వేల కేసులు.. మాస్కుతోనే కొత్త వేరియంట్​ కట్టడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.